రూ.11.42 లక్షలు దోపిడీ

ABN , First Publish Date - 2023-06-01T01:14:47+05:30 IST

సంక్షేమ పింఛన్ల పంపిణీ నిమిత్తం కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసి తీసుకువస్తుండగా గుర్తుతెలియని ఇద్దరు యువకులు దాడి చేసి రూ.11.42 లక్షలు ఎత్తుకెళ్లిపోయారు.

రూ.11.42 లక్షలు దోపిడీ

తొండంగి, మే 31: సంక్షేమ పింఛన్ల పంపిణీ నిమిత్తం కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసి తీసుకువస్తుండగా గుర్తుతెలియని ఇద్దరు యువకులు దాడి చేసి రూ.11.42 లక్షలు ఎత్తుకెళ్లిపోయారు. తొండంగి ఎస్‌ఐ రవికుమార్‌, సచివాలయ సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. పైడికొండ సచివాలయం-2 వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ సి.వివేక్‌ సుమారు రూ.8 లక్షల 90 వేలు నగదును, సచివాలయం 1 వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కె.నాగదేవి రూ.11.42 లక్షల నగదును బుధవారం పెరుమాళ్లపురం కెనరా బ్యాంకు నుంచి డ్రా చేసి మోటార్‌ బైక్‌పై తీసుకు వస్తున్నారు. వారిని బ్యాంకు నుంచి పల్సర్‌ బైక్‌పై ఇద్దరు యువకులు వెంబడిస్తున్నారు. వేమవరం పైడికొండ రహదారిలో వివేక్‌ చేతిపై కర్రతో వారు బలంగా కొట్టడంతో బైక్‌ పై నుంచి కింద పడిపోయారు. వివేక్‌ వద్ద ఉన్న బ్యాగును లాక్కునేందుకు ప్రయత్నించగా అతను గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో వారు అతనిని వదిలి నాగదేవిని కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు. ఈ బ్యాగులో పింఛన్ల పంపిణీ నిమిత్తం తీసుకువస్తున్న రూ.11.42 లక్షల నగదు ఉంది. బాధితులు జరిగిన విషయాన్ని పంచాయతీ కార్యదర్శికి, మండల అభివృద్ధి అధికారికి, పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం డీఎస్పీ లలితకుమారి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తోంది. బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరా పుటేజీతో పాటు ఇతర వివరాలు ౉ సకరిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Updated Date - 2023-06-01T01:14:47+05:30 IST