తాపీగా...
ABN , First Publish Date - 2023-01-29T01:12:23+05:30 IST
మండపేట మండలం తాపేశ్వరం- ద్వారపూడి మధ్య నిర్మిస్తున్న రహదారి పనుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఈ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సీసీ రోడ్డు పనులు అరకొరగా చేసి మధ్యలో గాలికి వదిలేశారు.
తాపేశ్వరం-ద్వారపూడి మధ్య రోడ్డు పనులు సగం సగం
సీసీ రోడ్డు పనుల నత్తనడకతో ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లు, కల్వర్టులు పనులు పూర్తయ్యేదెపుడో
మండపేట, జనవరి 28: మండపేట మండలం తాపేశ్వరం- ద్వారపూడి మధ్య నిర్మిస్తున్న రహదారి పనుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఈ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సీసీ రోడ్డు పనులు అరకొరగా చేసి మధ్యలో గాలికి వదిలేశారు. దీంతో అటువైపు రాకపోకలు సాగించే వారంతా అష్టకష్టాలు పడుతున్నారు. సెం ట్రల్ రోడ్డు ఫండ్ నిధులు రూ.12.50 కోట్ల వ్యయంతో తాపేశ్వరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి గ్రామంలో 400 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణం ప్రస్తుతం ఉన్న రోడ్డును ఏడు మీటర్ల మేర విస్తరించేందుకు వీలులేకపోవడం, దానికి తగిన ప్రభుత్వ స్థలం లభ్యంకాకపోవడంతో 5 మీటర్ల మేర మాత్రమే సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు తాపేశ్వరం-ఇప్పన పా డు మధ్య సీసీ రోడ్డు 1850 మీటర్ల మేర పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 700 మీటర్ల మేర మాత్రమే సీసీ రోడ్డు పూర్తికాగా, అందులో ఒకపక్క మాత్రం 100 మీటర్లు వేసి, మరోపక్క పనులు చేయకుండా వదిలేశారు. దాంతో నిత్యం వాహనాలు రాకపోకలతో బిజీగా ఉండే తాపేశ్వరం-ద్వారపూడి రోడ్డుపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారు. అలాగే ఈ రహదారిలో రోడ్డు మధ్యనున్న నాలుగు కల్వర్టుల పనులు చేపట్టలేదు. అలాగే సీసీ డ్రైన్‌ల పనులు కూడా చేపట్టలేదు. కేవలం ఇప్పనపాడు- ద్వారపూడి మధ్య సీసీ రోడ్డు 7 మీటర్ల మేర నిర్మాణ పనులు పూర్తిచేయగా రోడ్డుకు అదనంగా మార్జిన్ రెండు మీటర్ల మేర పెంచి మొత్తం 9 మీటర్లు పెంచారు. ఇక తాపేశ్వరం ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తాపేశ్వరం గ్రామంలో మాత్రం సీసీ రోడ్డు పెంపునకు స్థల కొరతతో పాత రోడ్డునే నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రోడ్డు పనులు మాత్రం కేవలం బీటీ రోడ్డు పూర్తికాగా, సీసీ రోడ్డు పనులు మాత్రం అసంపూర్తిగా ఉన్నాయి. మరోపక్క సీసీ డ్రైన్, కల్వర్టులు పనులు ఇప్పటిదాకా ప్రారంభించలేదు. దాంతో అసలు ఈ సీసీ రోడ్డు పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క రోడ్డు పనులు పూర్తి కాకుండానే ట్రాఫిక్ కూడా వదిలేశారు. దీంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోపక్క సదరు కాంట్రాక్టర్‌కు రోడ్డు బిల్లుల చెల్లింపు జాప్యం కావడంతోపాటు రోడ్డు నిర్మాణానికి రెండేళ్లపాటు ప్రభుత్వం గడువు ఇవ్వడంతో పనుల విషయంలో వేగం తగ్గినట్టు తెలుస్తోంది. ఇలాగే నత్తనడకన పనులు జరిగితే రహదారి నిర్మా ణం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. ఇక తాపేశ్వరం నుంచి మోహర్ సెం టరు వరకు రోడ్డు పాడైంది. అక్కడ రోడ్డు కూడా సీసీ రోడ్డు వేయాలని ప్రతిపా దనలు ఉన్నప్పటికీ నిధుల కొరత వేధిస్తోంది. అరకొరగా రోడ్డు నిర్మాణ పనులు జరగడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో సీసీ రోడ్డు కింద వేసిన ఇనప ఊచలు గుచ్చుకుని వాహనాల టైర్లు పాడైపోతున్నాయని వాహన దారులు వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.