Share News

సకల సౌకర్యాలతో నూతన టెర్మినల్‌

ABN , First Publish Date - 2023-12-11T00:29:47+05:30 IST

వెయ్యేళ్ల చరిత్ర గల రాజమహేంద్రవరం భారతదేశానికి గర్వకారణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

 సకల సౌకర్యాలతో నూతన టెర్మినల్‌

కోరుకొండ, డిసెంబరు10: వెయ్యేళ్ల చరిత్ర గల రాజమహేంద్రవరం భారతదేశానికి గర్వకారణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద రూ.347 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్‌ భవన నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదిన్నరేళ్లలో దేశంలో విమానయానం రెట్టింపు అయ్యిందన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో కొత్తగా 75 ఎయిర్‌పోర్టులు వచ్చాయన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్‌ పాయింట్‌ 21 వేల 94 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుందని రద్దీ వేళల్లో రోజుకు 2100 మంది ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు భవిష్యత్‌లో ప్రతిఏటా 30 లషల మంది ప్రయాణికులతో వార్షిక సామర్థ్యం ఉంటుందని తెలిపారు. 28 చెక్‌ ఇన్‌ కౌంటర్లు, 4 అరైవల్‌ కంక్ల్యూజర్‌, 600 కార్లకు సరిపడా కారు పార్కింగ్‌, 5 స్టార్‌ రేటింగ్‌తో ఈ కొత్త టెర్మినల్‌ భవనం రూపుదిద్దుకుంటుందని కేంద్ర మంత్రి సింధియా వివరించారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో టెర్మినల్‌ భవనం విస్తరించనున్న దృష్ట్యా రానున్న రోజుల్లో 25 వరకు సర్వీసులు పెంచనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇప్పటికే ప్రారంభించామన్నారు. భోగాపురం, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులను గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుగా ప్రారంభించుకోనున్నామన్నారు. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ ఈ విమానాశ్రయం పనులు మరో 24 నెలల్లో పూర్తవుతాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.347.15 కోట్లు వెచ్చించి టెర్మినల్‌ భవనాన్ని అభివృద్ధి చేయడం రాజమహేంద్రవరం చరిత్రలో నూతన అధ్యాయమని పేర్కొన్నారు. పార్లమెంట్‌ సభ్యుడు మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ రూ.347.15 కోట్లతో నిర్మించే ఈ నూతన టెర్మినల్‌ భవనం ఏడాదిన్నర కాలంలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ 1224 ఎకరాల్లో సుమారు 70 లక్షల జనాభాకు ఉపయోగపడే విధంగా ఈ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తూ నూతన టెర్మినల్‌ భవన నిర్మాణానికి నిధులు ఇచ్చిన కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక నూతన అధ్యా యానికి ఈ రోజు శ్రీకారం చుట్టినట్లు ఎయిర్‌పోర్టు అఽథారిటీ చైర్మన్‌ ఆఫ్‌ ఇండియా సంజయ్‌కుమార్‌ అన్నారు. కలెక్టర్‌ మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.తేజ్‌భరత్‌,మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్‌ ఆఫ్‌ ఇండియా సంజీవ్‌కుమార్‌, మధురపూడి విమానాశ్రయ అధికారి ఎస్‌.జ్ఞానేశ్వరరావు, విమానయాన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:29:48+05:30 IST