పోలవరానికి నో ఎంట్రీ..
ABN , First Publish Date - 2023-06-11T01:04:18+05:30 IST
పోలవరం ప్రాజెక్టు వాస్తవాలు పరిశీలించి, ప్రజలకు తెలియజేయడానికి బయలుదేరిన టీడీపీ నేతల బృందంపై వైసీపీ ప్రభుత్వం దమననీతి ప్రదర్శించింది.
బైక్‌పై బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని
నిమ్మల, దేవినేని, జవహర్, గన్ని, బడేటి, మద్దిపాటి అరెస్ట్
గోపాలపురం, బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లకు తరలింపు
గోపాలపురంలో స్టేషన్ ముట్టడి..తీవ్ర ఉద్రిక్తత
రామానాయుడిని 3 గంటల వరకు తిప్పిన పోలీసులు
అక్రమ అరెస్టులను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళన
అవినీతి బయటపడుతుందని అడ్డుకున్నారు : టీడీపీ
సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల
రాజమహేంద్రవరం, జూన్ 10(ఆంధ్రజ్యోతి)/ గోపాల పురం : పోలవరం ప్రాజెక్టు వాస్తవాలు పరిశీలించి, ప్రజలకు తెలియజేయడానికి బయలుదేరిన టీడీపీ నేతల బృందంపై వైసీపీ ప్రభుత్వం దమననీతి ప్రదర్శించింది. ఇటీవల సీఎం జగన్ పోలవరం వచ్చి పచ్చి అబద్దాలు చెప్పారని, అక్కడ వాస్తవాలన్నీ ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు శనివారం ఉదయం పోలవరం వెళ్లడానికి ప్రయత్నించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, పీతల సుజాత, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బడేటి చంటి, మద్దిపాటి వెంకట్రాజు తదితర పది మంది నేతలు శనివారం ఉదయం పోలవరం బయలుదేరారు. వీరిని అడ్డుకునేం దుకు ప్రాజెక్టుకు చేరుకునే మార్గాల్లో పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పోలవరం మండలంలో నాలుగుచోట్ల పోలీసులు భారీగా మోహరిం చారు. తొలుత కన్నాపురం అడ్డ రోడ్డు వద్ద జవహర్‌ను, గోపాలపురం మండలం నుంచి సాగిపాడు మీదుగా వస్తున్న ఎమ్మెల్యే రామానాయుడిని అదుపులోకి తీసుకు న్నారు. పోలీసుల కన్ను గప్పి బైక్‌పై పోలవరం ప్రాజెక్టు ముఖద్వారం వద్దకు చేరుకున్న దేవినేని, బడేటి, గన్ని, బొరగం శ్రీనివాసులను డీఎస్పీ శ్రీనివాసులు అదుపులోకి తీసు కుని తొలుత పోలవరం పోలీసుస్టేషన్‌కు తరలించి బైండోవర్ కేసు నమోదు చేశారు.తర్వాత దేవినేని, జవహర్, బొరగంలను బుట్టాయిగూడెం పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఎమ్మెల్యే నిమ్మల, గన్ని, మద్దిపాటి, బడేటి లను గోపాలపురం తీసుకువెళ్లారు. ఇది తెలిసి అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడకు వచ్చి, ఆందోళన చేయడంతో ఈ నేతలను పోలీసు వాహనాలలో ఎక్కిం చుకుని జాతీయ రహదారిలో అటూ ఇటూ తిప్పుతూ, నల్లజర్ల హైవేలో అనంతపల్లి వరకూ తీసుకువెళ్లి, మళ్లీ వెనక్కి తిప్పి మళ్లీ హైవేలో తిప్పారు. ఇంతలో పెనుగొండ సీఐకు కబురు పంపి ఎమ్మెల్యే నిమ్మలను వారి వాహనంలో ఎక్కించి తాడేపల్లిగూడెం తీసుకువెళ్లారు. అక్కడ రోడ్ల మీద కాసేపు తిప్పించి పెనుగొండ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి 151 నోటీసు ఇచ్చి సాయంత్రం మూడు గంటల తర్వాత పాలకొల్లు తీసుకువెళ్లి, ఆయన ఇంటి వద్ద వదిలేశారు. రామానాయుడు పోలవరం వెళ్లడం కోసం ఉదయం ఆరు గంటలకు పాలకొల్లులో బయలుదేరి తొమ్మిది గంటలకు కొవ్వూరుపాడు చేరుకున్నారు. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో భోజనం కూడా చేయకుండా ఆయన పోరాడుతూనే ఉన్నారు. వెంకట్రాజు, గన్ని, బడేటి తదితరులను మళ్లీ గోపాలపురం స్టేషన్‌కు తీసుకు వెళ్లి మూడు గంటల తర్వాత 151 నోటీసులు ఇచ్చి వదిలేశారు. మధ్యలో భోజనం చేయమని పోలీసులు అడిగినా ఈ నాయకులు చేయకపోవడం గమనార్హం. మండే ఎండలో కేవలం మంచినీళ్లు మాత్రమే తాగి పోలవరం వెళ్లకుండా ఆపడం దుర్మార్గమని వారు పోలీసులతో వాదిస్తూనే ఉన్నారు. టీడీపీ నాయకుల అరెస్టులను తెలు సుకున్న పార్టీ శ్రేణులు బుట్టాయ గూడెం, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు భారీగా చేరుకుని అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయా లంటూ నాయకులు స్టేషన్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.జగన్‌రెడ్డి పాలనకు రోజులు దగ్గరప డ్డాయని అందుకే అక్రమ అరెస్టులకు పాల్పడుతు న్నా డని నినదించారు.సాయంత్రం నాలుగు గం టలకు అరెస్టు చేసిన నాయ కులను సొంతపూచీకత్తుపై పోలీ సులు విడిచిపె ట్టారు.మాజీ మంత్రి పీతల సుజాతను మార్గమధ్యలోనే ఆపి పోలీసులు వెనక్కి పంపేశారు.
అవినీతి భయంతో అడ్డగింత : దేవినేని
‘ప్రాజెక్టులో నెలకొన్న అవినీతి బయట పడుతుందన్న భయంతో సీఎం జగన్ మా పర్యటనను అడ్డుకున్నారు. జగన్‌రెడ్డి పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగింది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశిస్తాం. టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ప్రతి సోమ వారాన్ని ‘పోలవారం’గా పెట్టుకుని నిర్మాణ పనులను వేగవంతంచేసి 72 శాతం పైగా పూర్తిచేస్తే ఈ అసమర్థ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఒక్కశాతం కూడా పూర్తిచేయలేదు. ప్రజలను పక్కదోవ పట్టించ డానికి ప్రాజెక్టు వద్దకు వచ్చిన జగన్‌రెడ్డి హెడ్‌వర్క్సు, నిర్మాణ పనులకు సంబంధించి తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే అవినీతిని కక్కించి పనులను పూర్తి చేస్తాం’ అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై జగన్ కుట్ర
పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా సీఎం జగన్ కుట్ర చేస్తున్నాడు.. ప్రాజెక్టు పనులు చేయకుండా కుంటిసాకులు చెబుతూ ప్రజలకు అబద్దాలు చెబుతున్నాడు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి, వాస్తవాలను అక్కడ నుంచి ప్రజలకు వివరించడానికి తమ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కొందరునేతలం ఒక కమిటీగా శనివారం అక్కడకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఈదుర్మార్గ వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అడ్డుకుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు బస్సులు ఏర్పాటు చేసి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను రప్పించి ప్రాజెక్టు పనులు చూపించి, భోజనం కూడా పెట్టి పంపిస్తే, ఈ సీఎం జగన్ కనీసం ప్రాజెక్టును చూడడానికి ప్రతిపక్షాలను వెళ్లనీయడంలేదు.
- నిమ్మల రామానాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే
చంద్రబాబే పోలవరంను పూర్తి చేస్తారు : గన్ని వీరాంజనేయులు
ప్రతిపక్షాలు, ప్రజలు ప్రాజెక్టు వద్దకు వస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనే భయంతో జగన్ పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డగిస్తున్నాడు. 9 నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు.పోలీసులు న్యాయం పాటించాలి. జగన్ చెప్పాడుకదా అని ప్రతిపక్షాలను ఇబ్బంది పెడితే.. తాము అధికారంలోకి రాగానే వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.