టేక్ హోమ్ రేషన్ పాత పథకమే..
ABN , First Publish Date - 2023-08-05T01:00:35+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించి పోషకాహారలోపం, రక్తహీనత నివారించేందుకు ప్రభుత్వం సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం అమలు బాధ్యత ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తుంటారు. కొవిడ్ సమయంలో పౌష్టికాహార సరకులను టేక్ హోమ్ రేషన్ పేరుతో లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఈ పథకానికి పాత పేరునే మళ్లీ తీసుకొచ్చి ప్రతి పౌష్టికాహార ప్యాకెట్, కిట్లలపై సీఎం జగన్ ఫొటో ముద్రించి టీహెచ్‌ఆర్ కింద ప్రచార ఆర్భాటం చేస్తున్నారు.
పౌష్టికాహారం పంపిణీతో సీఎం జగన్ ఫొటో ప్రచారం
విస్తుపోతున్న గర్భిణీ, బాలింతలు
సర్పవరం జంక్షన్, ఆగస్టు 4: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించి పోషకాహారలోపం, రక్తహీనత నివారించేందుకు ప్రభుత్వం సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం అమలు బాధ్యత ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తుంటారు. కొవిడ్ సమయంలో పౌష్టికాహార సరకులను టేక్ హోమ్ రేషన్ పేరుతో లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఈ పథకానికి పాత పేరునే మళ్లీ తీసుకొచ్చి ప్రతి పౌష్టికాహార ప్యాకెట్, కిట్లలపై సీఎం జగన్ ఫొటో ముద్రించి టీహెచ్‌ఆర్ కింద ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. అన్ని వస్తువులపై సీఎం ఫొటో ఉండడాన్ని చూసిన లబ్ధిదారులు విస్తుపోతున్నారు. ఇదేదో కొత్త పథకంలా విస్తృత ప్రచారం చేస్తున్నారని, గతంలో ఇచ్చే సరుకులే ఇచ్చి అదనంగా సీఎం ఫొటో ముద్రించి ఇస్తున్నారని అంటున్నారు.
సీఎం జగన్ ఫొటోతో ప్రచార ఆర్భాటం
సమగ్ర శిశు అభివృద్ధి ప్రాజెక్టు(ఐసీడీఎస్) ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో పది ప్రాజెక్టుల ద్వారా 1986 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో కాకినాడ రూరల్ మండలంలో 127 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఐసీడీఎస్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా మూడేళ్లలోపు చిన్నారులు 5,355మంది, 3నుంచి ఐదేళ్లలోపు 3,260మంది చిన్నారులు ఐసీడీఎస్ సేవలు పొందుతున్నారు. గర్భిణులు 1,257మంది, బాలింతలు 1,131మంది సమతుల్య పోషకాహారం సేవలు పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార లోపం, రక్తహీనత నివారణకోసం అద నంగా పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నారు. కొవిడ్ సమయంలో రెండేళ్ల పాటు టేక్ హోమ్ రేషన్(టీహెచ్‌ఆర్) పేరుతో సరుకులను గర్భిణులు, బాలింతలకు అందించారు. కొవిడ్ తగ్గిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాలు తెరవడంతో 2022లో జూన్ నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే లబ్ధిదారులకు భోజనం వండి పెట్టాలని ఆదేశించింది. ఇంటికి సరుకులు తీసుకువెళ్లడం లో ఉన్న ఆసక్తి కేంద్రాలకు వచ్చి ఆహారం తీసుకునేందుకు ఉండడంలేదు. దీంతో పూర్తిస్థాయిలో గర్భిణిలు, బాలింతలు రావడంలేదు. ఈ నేపథ్యం లో లబ్ధిదారుల అభిప్రాయాన్ని అధికారులు స్వీకరించారు. అధికశాతం మంది ఇంటికే తీసుకునేందుకు మక్కువ చూపడంతో ఐసీడీఎస్ అధికారులు మళ్లీ టీహెచ్‌ఆర్ ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏళ్ల తరబడి ఇవే పంపిణీ
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు ప్రతినెలా బియ్యం, నూనె, చిక్కీలు, బెల్లం, గుడ్లు, పప్పులు ఏళ్ల తరబడి పంపిణీ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ విధానం అమలు ద్వారా ఇం టికి సరుకులు పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని, అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఆహారం వండి పెట్టాలని ఆదేశించడంతో ఇప్పటివరకు అమలు చేశారు. ఇటీవల మళ్లీ పాత పథకం పేరు తో టేక్ హోమ్ రేషన్(టీహెచ్‌ఆర్)లో ఉన్న చిక్కీలు, బెల్లం, ఖర్జూరం, కం దిపప్పు, పాల ప్యాకెట్లు, వైఎస్‌ఆర్ కిట్‌లపై సీఎం జగన్ ఫొటోలు ముద్రిం చి అట్టహాసంగా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రహసనంలా కొనసాగిస్తున్నారు. సీఎం ప్రచారంపై మహిళలు విస్తుపోతున్నారు. గతంలో ఉన్న పాత పథకానికి కవర్లు మార్చి ఇస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
పౌష్టికాహార మెనూ ఇదిగో..
కిలో కందిపప్పు, మూడు కిలోల బియ్యం, 25 కోడి గుడ్లు(వారంలో రెండుసార్లు), 500 గ్రాముల నూనె, 5 లీటర్ల పాలు(రెండుసార్లు), వైఎస్‌ఆర్ కిట్: ఇందులో 2కిలోల రాగిపిండి, కిలో అటుకులు, తలో 250 గ్రాముల ఖర్జూరం, వేరుశెనగ చిక్కి, బెల్లం అందిస్తున్నారు.