అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2023-03-19T02:34:32+05:30 IST
ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ పి.మునిరత్నం అన్నారు.

వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ మునిరత్నం
ఙపెద్దాపురం, మార్చి 18 : ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ పి.మునిరత్నం అన్నారు. శనివారం కాకినాడజిల్లా పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయాధికారులతో నిర్వహించిన శిక్షణ, సందర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా పంటల స్థితిగతులను ఆయన అధికారులకు వివరించారు. ప్రస్తుతం రబీ ఆశాజనకంగా ఉందని, చీడపీడల సమస్యలు తక్కువగానే ఉన్నాయన్నారు. పంట ఆఖరి దశలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందవచ్చని సూచన చేశారు. వాతావరణానికి అనుకూలమైన పంట రకాలను రైతుల ప్రయోజనార్థం వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసి విడుదల చేసిందన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చల్లా నరసింహారావు మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటి నుంచి నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, తూర్పుగోదావరిజిల్లాలో లాలాచెరువువద్ద కొత్తగా ఏరువాక కేంద్రాలు పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సీతారామశర్మ, బాలాజీ నాయక్, సుధీర్‌కుమార్, వ్యవసాధికారులు నూనే సుజాత, భరత్, మాధవరావు, డీడీ ఓలేటి బోసుబాబు, ఆత్మా పీడీ జ్యోతిర్మయి, ఏడీఏలు నల్లి దైవకుమార్, ఎం.రత్నప్రశాంతి, పెందుర్తి పద్మలత పాల్గొన్నారు.