కొండెక్కిన గుడ్డు
ABN , Publish Date - Dec 17 , 2023 | 01:23 AM
ఎన్నడూ లేనివిధంగా మార్కెట్‌లో గుడ్డు ధర ఆకాశానికి ఎగబాకింది. గుడ్డు హోల్‌సేల్ ధర రూ.5.82కి చేరుకుంది. మార్కె ట్‌లో రూ.7 నుంచి రూ.7.50 వరకు విక్రయాలు సాగుతున్నాయి.
హోల్‌సేల్‌లో రూ.5.82
బయ ట మార్కెట్‌లో రూ.7 -7.50
కోళ్లఫారాల యజమానులకు ఎంతో ఊరట
కార్తీకం ముగియడం, కొత్త బ్యాచ్‌లు లేకపోవడం, శీతాకాలం ప్రభావంతో వారికి కలిసొచ్చిన కాలం
సామాన్యులు మాత్రం లబోదిబో.. కొనలేమంటూ ఆవేదన
ఉమ్మడి జిల్లాలో రోజుకు కోటి 20 లక్షల గుడ్లు ఉత్పత్తి
మండపేట, డిసెంబరు16: ఎన్నడూ లేనివిధంగా మార్కెట్‌లో గుడ్డు ధర ఆకాశానికి ఎగబాకింది. గుడ్డు హోల్‌సేల్ ధర రూ.5.82కి చేరుకుంది. మార్కె ట్‌లో రూ.7 నుంచి రూ.7.50 వరకు విక్రయాలు సాగుతున్నాయి. గతంలో 2017లో గుడ్డు ధర రూ 5.45కి చేరినప్పుడు ఇదే అప్పటికి అత్యధిక రికార్డుగా నమోదైంది. ఇప్పుడు పాత రికార్డులను బద్దలుకొడుతూ హోల్‌సేల్ ధర రూ.5.82కు చేరుకుంది. మొన్నటి కార్తీకమాసంలో రూ.4.95 ఉండగా, కార్తీక మాసం ముగియడం, శీతాకాలం కావడంతో వినియోగం పెరగడంతో గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా గుడ్డు వినియోగం గణనీయంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెరగడం కూడా మరో కారణం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 200కు పైబడి కోళ్లఫారాలు ఉండగా, జిల్లాలో మండపేట, ద్వారపూడి, వేము లపల్లి, ఆర్తమూరు, అనపర్తి, జగ్గంపేట, బిక్కవోలు, రాయవరం మండలం, పెద్దాపురం, తుని, రాజమహేంద్రవరం, రావులపాలెం తదితర ప్రాంతాల్లో కోళ్లఫారాలు విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2.4 కోట్ల మేర కోళ్లు ఉండగా వాటి ద్వారా నిత్యం 1.20 కోట్ల మేర గుడ్ల ఉత్పత్తి ఉంటోంది. వీటిలో 40 శాతం మేర గుడ్లు స్థానిక మార్కెట్లలో వినియోగిస్తుండగా.. మిగి లిన 60 శాతం గుడ్లు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. గుడ్డు ధర ఇదే విధంగా కొద్దిరోజులు నిలకడగా ఉంటే గతంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడే వీలుంటుందని ఏపీ పౌలీ్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే కోళ్ల మేతలకు వినియోగించే దాణా, వాటి ముడిసరుకుల ధరలు భారీగా పెరిగిపోయాయని కోళ్లఫారాల నిర్వాహకులు చెబుతున్నా రు. మొక్కజొన్న క్వింటా రూ.2500, రూ.5 వేలు, నూకలు రూ.2500, సన్‌ఫ్లవర్ రూ.3500, వేరుశెనగచెక్క రూ.4400, నూనెతీసిన తవుడు ధర రూ.180 ఉందని వారు తెలిపారు. దీంతో గుడ్డు ధర పెరుగుదల తమను సంతృప్తికరంగా ఉన్నా, గతంలో నష్టాల నుంచి తేరుకునేందుకు మాత్రమే ఉపయోగపడతాయని వారు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్ల నుంచి కోళ్ల ఫారాల్లో నష్టాల కారణంగా చాలామంది కొత్త బ్యాచ్‌లు వేయలేదని, పాతకోళ్లతోనే నడుస్తున్నందున గుడ్డు ఉత్పత్తి తగ్గి ధర పెరుగుదలకు కార ణమైందని ఆర్తమూరుకు చెందిన ఎస్‌బీఎస్‌ఆర్ పౌలీ్ట్ర నిర్వాహకులు సత్తి బుల్లిస్వామిరెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే గుడ్డు ధర పెరుగుదల నిర్వాహకులకు ఊరటనిస్తుంటే గుడ్డును కొనుగోలు చేసే సామాన్యులకు మాత్రం గుడ్లు తేలేసేలా ఉంటోంది. ఏకంగా బయట మార్కెట్‌లో ఏడు నుంచి ఏడున్నర రూపాయల వరకు గుడ్డును విక్రయిస్తుండడంతో వినియోగదారు లు గగ్గోలు పెడుతున్నారు. కూరగాయలు, మాంసాహారం అందుబాటు ధరల్లో లేనప్పుడు కోడి గుడ్లును సామాన్య, మధ్యతరగతి వర్గాలు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవడం సహజంగానే జరుగుతుంటుంది. అటు కూరగాయల ధరలు ఆకాశానికి చేరుతుండడంతో పాటు కోడిగుడ్లు ధర కూడా అదే రీతిన ఎగబాకడం ఆయా వర్గాలకు ఇబ్బందికరమే.
చికెన్.. ఇక చిక్కదు!
పెరుగుతున్న ధరలు
నాన్‌వెజ్ ప్రియులకు భారమే
మొన్నటిదాకా కొనేవాళ్లు లేక ఎదురుచూపులు చూసిన చికెన్ షాపుల వాళ్లకు సీజన్ మొదలైపోయింది. కార్తీకమాసం వల్ల చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోగా, కార్తీకం ముగిసిన వెంటనే మాంసాహార ప్రియులు ఈ దుకాణాలపై దాడి చేయడం ప్రారంభించారు. దాంతో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం మొదలైంది. కొద్ది రోజుల కిందట కిలో రూ.150కి కూడా లభించిన చికెన్ ఇప్పుడు రూ.220కి చేరింది. ఈ ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ధర తగ్గే పరిస్థితి లేదు.