బడి బస్సు బాగేనా!?
ABN , First Publish Date - 2023-05-22T00:48:53+05:30 IST
బడి బస్సు బాగేనా? అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే అన్ని బస్సులు బాగుంటాయా.. ఏదో ఒకటీ అరా బాగుంటాయి.. పలు బస్సులకు కనీసం ఫిట్‌నెస్ ఉండదు..అయినా ఊగుతూ ఆగుతూ ఏడాదంతా తిరిగే స్తాయి.. తరువాత ఏడాది షరా మామూలే..
ఒక్కటీ కానరాని వైనం
అయినా ఫిట్‌గా ఉన్నట్టు సర్టిఫై
ప్రభుత్వ ఫీజు ఒక్కో బస్‌కు రూ. వెయ్యి
బ్రోకర్ చెంతకు వెళితే రూ.6 వేలు
బస్ ఎలాగున్నా ఓకే
అందుకే బ్రోకర్ల చెంత క్యూ
బడి బస్సు బాగేనా? అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే అన్ని బస్సులు బాగుంటాయా.. ఏదో ఒకటీ అరా బాగుంటాయి.. పలు బస్సులకు కనీసం ఫిట్‌నెస్ ఉండదు..అయినా ఊగుతూ ఆగుతూ ఏడాదంతా తిరిగే స్తాయి.. తరువాత ఏడాది షరా మామూలే.. అధికా రులు చూసీ చూడనట్టు వదిలేస్తారు.. ఒకసారి అక్క డికి వెళ్లామా మనకి అంతా భారతీయుడు సినిమాలో ఆర్‌టీవో ఆఫీస్ దగ్గర సీన్ కళ్లెదుట కనబడుతుంది... డబ్బులిస్తే చాలు రైట్ రైట్.. లేదంటే స్టాప్..స్టాప్.. 32 నిబంధనలు గుర్తొస్తాయి.. బస్సుకు బ్రేక్ పడుతోంది. ఈ ఏడాదైనా అధికారులు బడి బస్సులు ఫిట్‌గా ఉండేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రైవేటు బడి బస్సులకు బ్రేక్ పడింది. అయితే ఈ సమయంలో బస్సుకు అవసరమైన అనుమతుల రెన్యువల్స్, కండీషన్ చెకింగ్ వంటివి చేసుకోవాలి. మళ్లీ బడులు తెరిచేనాటికి అన్ని విధాలుగా ఫిట్‌గా ఉండే వాహనాన్ని విద్యార్థులకు సిద్ధం చేయాలి. ఇప్పటికే సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.జిల్లాలోని 19 మండలాల్లో సుమారు 600 వరకూ స్కూల్ బస్సులు ఉన్నాయి.కొన్ని బస్సులు పైకి రంగుల హంగులతో తళుక్కుమంటున్నా.. పైనపటారం లోనలొటారం అనే చందంగా ఉంటున్నాయి. ప్రతి ఏడాది మే 15వ తేదీతో ఫిట్‌నెస్ అనుమతులు ముగుస్తాయి. 16వ తేదీ నుంచి అధికారులు అన్ని తనిఖీలు చేసి మళ్లీ ఏడాది కాలానికి ఫిట్‌నెస్ ఇస్తారు. కొన్ని కార్పొరేటు, ప్రైవేటు స్కూల్స్, కళాశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు ఉంటాయి. వాటిలో కొన్ని బస్సులకు ఫిట్‌నెస్ నిబంధనల విషయంలో ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాదికి ఒకసారి ఫిట్‌నెస్ ఇచ్చేసి తర్వాత తనిఖీలు చేయడం లేదనే విమర్శలూ వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ’ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
32 నిబంధనలు పాటించాలి
ఎపీఎంవీ రూల్ 185(జీ) ప్రకారం పాఠశాలల యాజమాన్యాలు సుమారు 32 నిబంధనలను పాటించి తీరాల్సిందే. సంబంధిత వెబ్‌సైట్‌లో స్కూలు వివరాలు మొత్తం నమోదు చేయాలి. స్కూల్ అడ్రస్, సెల్ నంబర్, స్కూల్ బస్సు నెంబరు, డ్రైవర్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జి, బీమా, ట్యాక్స్‌లతోపాటు వాహన వివరాలు పూర్తిగా పొందుపర్చాలి. బస్సులో ఉండే అటెండర్ పేరు, వయస్సు, బస్సులో ప్రయాణించే పిల్లల సంఖ్య తదితర వివరాలను నమోదు చేయాలి. డ్రైవర్, అటెండెంట్‌గా పనిచేవాళ్ల వయసు 18ఏళ్లకు తక్కువగా ఉండకూడదు. వాళ్ల ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. నిబంధనల ప్రకారం అన్నీ పరిశీలించి ధ్రువపత్రాన్ని స్కూలు యాజమాన్యాలకు అందజేస్తారు.
స్కూల్ బస్సు ఇలా ఫిట్‌గా..
బస్సు ఎక్కే మెట్లు(ఫుట్‌బోర్డు) భూమి నుంచి 325 మిల్లీమీటర్లకు మించి ఉండకూడదు. ఫుట్‌బోర్డు వద్ద పిల్లలు ఎక్కిదిగేందుకు ఇబ్బంది పడకుండా రెయిలింగ్, పవర్ స్టీరింగ్ ఉండి ఫ్రీప్లే చాలా తక్కువగా ఉండాలి. డ్యాష్ ప్యానల్ బోర్డులో ఎడమ, కుడి ఇండికేటర్ ఉండాలి. ఎయిర్ ప్రెజర్ గేజ్, ఫెయిల్స్ సేఫ్టీ ఇండికేటర్, బ్రేకుల్లో లోపాలు తెలిపే ఇండికేటర్, ఫ్యూయల్ మీటరు, స్పీడో మీడర్, డ్రైవర్ సీటు వద్ద ఎయిర్ హ్యాండ్ బ్రేక్, హ్యాండ్ లివర్ గైడ్ స్ర్పింగ్, గేర్ లివర్‌లో అంతర్గత స్ర్పింగ్, కాన్వెక్స్ క్రాస్‌వ్యూ మిర్రర్లు, బస్సులో పిల్లల కదలికలు తెలుసుకునేందుకు డ్రైవరు వద్ద అద్దం, అగ్నిమాపక సిలిండర్(పొడి), తలుపులకు సురక్షిత లాకింగ్ సిస్టం, సీట్ల కింద విద్యార్థులకు లగేజీ బాక్సులు, పార్కింగ్, సిగ్నల్ లైట్లు పనిచేస్తూ ఉండాలి. అత్యవసరద్వారం, ఆ ద్వారం వద్ద అద్దం సురక్షితమైనదిగా ఉండాలి. అత్యవసర సమయంలో పగులగొట్టేందుకు సుత్తి అందుబాటులో ఉండాలి. క్లచ్ ప్లేట్, పెడల్ ఫ్రీ ప్లే ఒక అంగుళాని కంటే తక్కువ ఉండకూడదు. సైడ్ విండోలకు మధ్యలో 31 అంగుళాలకు మించకుండా అడ్డంగా మూడు లోహపు కడ్డీలు ఏర్పాటు చే యాలి.సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను ఎక్కించరాదు. అంటే విద్యార్థులు నిలబడి ప్రయాణం చేయకూడదు. డ్రైవరు, అటెండెంట్ ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం సేవించి బస్సులో ఎక్కకూడదు. పిల్లల ముందు ధూమపానం చేయరాదు.ఫస్ట్‌ఎయిడ్ బాక్సు ఉండడంతోపాటు ప్రాథమిక చికిత్స మందులు కచ్చితంగా ఉండాలి. ఫైర్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులను తరచుగా అటెండెంట్ పరిశీలించాలి. టైర్లు అరిగిపోయినవి ఉండకూడదు. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం ఉండాలి.
డ్రైవరుకు ఆరోగ్య పరీక్షలు
బస్సు డ్రైవరు, అటెండెంట్ ఆరోగ్యంగా ఉండాలి. డ్రైవరు వయసు 18 నుంచి 60ఏళ్ల మధ్యలో ఉండాలి. డ్రైవరుకు ప్రతి మూడు నెలలకు బస్సు యాజమాన్యం సొంత ఖర్చులతో బీపీ,గుండె, మధుమేహం, కంటి పరీ క్షలు చేయించాలి.అటెండెంట్ ఎట్టి పరిస్థితుల్లో బస్సు నడపకూడదు.బస్సులో పిల్లలు ఎక్కిదిగేప్పుడు అటెం డెంట్ సహాయపడాలి. ఒకవేళ రోడ్డుకు అవతలవైపునకు విద్యార్థి వెళ్లాల్సి వస్తే అటెండెంట్ దగ్గరుండి దాటించాలి.పిల్లల పట్ల డ్రైవరు,అటెండెంట్ దురుసుగా ప్రవర్తించరాదు.బస్సులో డ్రైవర్ లైసెన్సు, బస్సునంబరు, ఇంజన్ నంబరు, ఛాసిస్ నెంబర్ కలిగిన కాగితానికి ఫ్రేం కట్టించి డ్రైవరుకు కుడివైపున పెట్టాలి. స్కూల్ కరెస్పాండెంట్/ప్రిన్సిపాల్/హెచ్‌ఎం,బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఫోన్ నెంబర్లు,పిల్లల వివరాలతో కూడిన జాబి తా,ఎక్కడెక్కక దిగుతున్నారనే వివరాలు అందుబాటులో ఉంచాలి.
ఇదీ తల్లిదండ్రుల బాధ్యత
విద్యార్థుల తల్లిదండ్రులు బస్సు కండీషన్ గురించి అప్పుడప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. మీ కంటిపాపలు రాకపోకలు సాగించే బస్సుల విషయంలో యాజమాన్యం నిబంధనలు పాటిస్తుందో లేదో తరచుగా పరిశీలించుకోవాలి. డ్రైవరు, అటెండెంట్ ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. బస్సు అతి వేగంగా వెళుతుందా.. డ్రైవరు సెల్‌ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా.. నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్నారా.. పిల్లలను ఎక్కించి, దించేటప్పుడు బాధ్యతగా ఉన్నారా.. డ్రైవరు, అటెండెం ట్ తీరు ఎలా ఉందనే విషయాలను పిల్లలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలి. సమస్యలుంటే రవాణా అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి.
ఇవీ డ్రైవరు అర్హతలు
18 సీట్లలోపు సామర్థ్యం ఉన్న స్కూల్ వ్యాన్, అర్డినరీ బస్సు నడిపే డ్రైవరుకు ఎల్‌ఎంవీ ట్రాన్సుపోర్టు లైసెన్సు, బ్యాడ్జి ఉండాలి. 20 సీట్లు దాటిన బస్సులను నడపడానికి హెచ్‌టీవీ లైసెన్సు బ్యాడ్జి ఉండాలి. వాహనాల సీట్ల సామర్థ్యాన్ని బట్టి డ్రైవరును ఎంపిక ఉం టుంది.బాధ్యతారహితంగా ఉండే వాళ్లను డ్రైవర్లు,అటెండెంట్లుగా నియమించరాదు. డ్రైవరు లైసె న్సు వివరాలు రవాణాశాఖ వెబ్‌సైటులో ఉండాలి. లేకపోతే రవా ణా అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
రూ.6 వేలు చెల్లిస్తే.. ఓకే
ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది ఒక్కో బస్‌కు రూ.వెయ్యి చెల్లించి ఫిట్‌నెస్ సర్టిఫై చేయిం చుకోవాలి. అయితే పాఠశాలల యాజమాన్యాలు మాత్రం రూ.6 వేలు చెల్లిస్తున్నట్టు సమాచారం. మిగిలిన ఐదు వేలు ఎందుకంటే ఫిట్‌గా లేని బస్సులను కూడా ఫిట్‌గా ఉన్నట్టు చూపించుకోవ డానికి. ఈ మేరకు పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగా బ్రోకర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వారికి రూ.6 వేలు చెల్లిస్తే బస్ ఎలా ఉన్నా ఫిట్‌గా ఉన్నట్టే సర్టిఫై చేసేస్తారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆర్‌టీవో ఆఫీస్ దగ్గర బ్రోకర్ల హవా సాగుతోంది. ఒక స్కూల్‌కు సంబంధించి 10 బస్‌లు ఉంటే ఎన్ని ఫిట్‌గా ఉన్నాయి.. ఎన్ని ఫిట్‌గా లేవు అనేది అనవసరం. మొత్తం ఫిట్‌గా ఉన్నట్టు సర్టిఫై చేయిస్తారు. ముందుగా ఫిట్‌గా ఉన్న బస్సులను చూపించి మమ అనిపిస్తున్నారు. ఇక ఏడేళ్లు దాటిన బస్‌లకు ఏడాదికోసారి గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి.