Share News

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు

ABN , Publish Date - Dec 14 , 2023 | 01:35 AM

పంటల సాగులో అధిక దిగుబడులు పొందాలంటే నాణ్యమైన విత్తనాలతోపాటు మేలైన యాజమాన్య పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వాణిజ్య పంటల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డీకే యాదవ్‌ అన్నారు.

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు

వాణిజ్య పంటల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డీకే యాదవ్‌

రాజమహేంద్రవరంరూరల్‌, డిసెంబరు 13: పంటల సాగులో అధిక దిగుబడులు పొందాలంటే నాణ్యమైన విత్తనాలతోపాటు మేలైన యాజమాన్య పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వాణిజ్య పంటల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డీకే యాదవ్‌ అన్నారు. సీటీఆర్‌ఐ కార్యాలయంలో కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థలో నిర్వహిస్తున్న 75వ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇటీవల వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయని, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా అధిక దిగుబడులనిచ్చే వంగడాలను రూపొందించడానికి శాస్త్రవేత్తలు కృషిచేయాలన్నారు. పొగాకు పంట నుంచి ప్రత్యామ్నాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆ దిశగా పరిశోధనలు చేసి రైతులకు అందించాలన్నారు. ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ అధిక ఆదాయానిచ్చే పసుపు, మిరపలాంటి పంటల వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ పొగాకు కట్టెను కాగితపు తయారీలో ఉపయోగించడానికి పరిశోధనలు చేయాలన్నారు. ప్రపంచ వాణిజ్య పంటల్లో భారతదేశానికి చోటు లభించేలా పొగాకురైతులను నిలబెట్టడంలో కేంద్ర పొగాకు సంస్థ అద్భుతమైన కృషి చేస్తోందని పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ అన్నారు. పొగాకు పంటతో పాటు మిరప, పసుపు, అశ్వగంధ, ఆముదం పంటలను చేర్చడం ద్వారా పరిశోధనలకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నన్నయ్య యూనివర్శిటీ వీసీ పద్మరాజు, పలువురు శాస్త్రవేత్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్తావానికి చిహ్నంగా నిర్మించిన ప్రత్యేక ఫైలాన్‌ను అతిథులు ఆవిష్కరించారు. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ అంతర్జాతీయ అతిథి గృహాన్ని ప్రారంభించారు. అలాగే చాలా కాలంగా పొగాకు పంటను సాగు చేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలచిన గద్దె లక్ష్మణరావు, కొండారెడ్డి, సురేంధ్ర, చైతన్య కుమార్‌, సత్యనారాయణ, ఫలనీకుమార్లను, సంస్థ అభివృద్ధికి సేవలందించిన పూర్వపు డైరెక్టర్లు దేవ్‌సింగ్‌, కృష్ణమూర్తి, టీజీకే మూర్తిలను ఘనంగా సత్కరంచారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన రైతులు, సంస్థ శాస్త్రవేత్తలు, సిబ్బంది, విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా సంస్థ రూపొందించిన సంచికలను ఆవిష్కరించారు.

Updated Date - Dec 14 , 2023 | 01:35 AM