సారా నియంత్రణకు చర్యలేవి?

ABN , First Publish Date - 2023-06-01T01:10:21+05:30 IST

కిందిస్థాయి అధికారుల విధి నిర్వహణపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో గోకవరం మండలంలో సారా క్రయ విక్రయాలు మూడు ప్యాకెట్లు, ఆరు సీసాల చందాన కొనసాగుతోంది.

సారా నియంత్రణకు చర్యలేవి?

జాడలేని పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు

పలు గ్రామాల్లో కుటీర పరిశ్రమగా సారా తయారీ

గోకవరం, మే 31: కిందిస్థాయి అధికారుల విధి నిర్వహణపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో గోకవరం మండలంలో సారా క్రయ విక్రయాలు మూడు ప్యాకెట్లు, ఆరు సీసాల చందాన కొనసాగుతోంది. కొన్ని గ్రామాలలో సారా తయారీ కుటీర పరిశ్రమగా తయారైందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవల సారా నిర్మూలన కోసం పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు గతంలో మాదిరిగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో సారా వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత రెట్టింపు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం సారా క్రయ విక్రయాలపై అధికారులు దృష్టిసారించి దాని నిర్మూలనకు కృషి చేసేవారు. అలాగే ఏ ఒక్కరు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించి సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకునేవారు. కానీ ఇపుడు ఆ పరిస్థితులు కనిపించడంలేదు. ఫిర్యాదుదారుడి పేరును సారా వ్యాపారులకు చేరవేసి వారి ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే అపవాదు స్థానిక అధికారులపై ప్రస్తుతం ఉంది. దీనివల్ల లేనిపోని గొడవ మనకెందుకులే అంటూ ఫిర్యాదు చేసేందుకు ప్రజలు అంతగా ఆశక్తి కనపర్చ డంలేదు. దీంతో సారా తయరీదారులు తమ వ్యాపారాన్ని జోరుగా విస్తరింప జేస్తున్నారు. మండలంలోని ఏయే గ్రామాలలో సారా తయారీతోపాటు, క్రయ విక్రయాలు జరుగుతాయో సంబంధిత అధికారులలో చాలామందికి తెలుసనే అభిప్రాయం స్థానికుల్లో ఉంది. అయినప్పటికీ వారు ఎందుకనో పట్టించు కోరనే పుకార్లు ఉన్నాయి. ఒకోసారి ఉన్నతాధికారుల ఒత్తిళ్ల వల్ల నామ మాత్రపు కేసులు పెడుతున్నారు. అప్పుడు కూడా బడా వ్యాపారుల జోలికి వెళ్లకుండా లీటరు, రెండు లీటర్ల సారా విక్రయించుకునే చిన్న చిన్న వ్యాపా రులను కేసులలో ఇరికించి చేతులు దులుపుకుంటారంటూ పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులపై ప్రజల నుంచి విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించి సారా నిర్మూలన కోసం చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2023-06-01T01:10:21+05:30 IST