ఏకంగా.. ఇసుక స్టాక్‌ పాయింట్‌ పెట్టేశారు?

ABN , First Publish Date - 2023-03-31T00:55:42+05:30 IST

ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతోంది. అడిగేవారు లేరు.. అడ్డుకునేవారు లేరు..

ఏకంగా.. ఇసుక స్టాక్‌ పాయింట్‌ పెట్టేశారు?
కాతేరులోని ఇసుక అనధికార స్టాక్‌ పాయింట్‌

రాత్రి డ్రెడ్జింగ్‌ చేసి లారీల ద్వారా తరలింపు

కన్నెత్తి చూడని అధికారగణం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతోంది. అడిగేవారు లేరు.. అడ్డుకునేవారు లేరు.. అంతా అక్రమార్కులు ఇష్టమే.. వారు ఏం చేస్తే అదే చట్టం.. కాతేరులో ఒక ర్యాంపు నిర్వాహకుడు, ఓ ఇసుక వ్యాపారితో కుమ్మక్కయి అనధికారికంగా ఇసుక నిల్వలు చేస్తున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాత్రి సమయాల్లో ఇసుకను డ్రెడ్జింగ్‌ చేసి ఇక్కడ నిల్వ చేసి అమ్ముకుంటున్నారు. వీటికి బిల్లులు కూడా ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ర్యాంపు వద్దే బిల్లు ఇచ్చి ఇసుక తరలించాలి. కానీ బిల్లులు లేకుండానే అనధికారికంగా ఇసుక ఇక్కడకు వచ్చేస్తున్నట్టు సమాచారం. అక్కడ బిల్లు ఇచ్చి, ఇక్కడా బిల్లు ఇస్తే సమస్యే ఉంటుంది. అందువల్ల బిల్లులు ఇవ్వకుండా అనధికారికంగా వ్యవహారం సాగుతున్నట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో ఇసుక వ్యాపారం దక్కించుకున్న ఓ కాంట్రాక్టరుకు తెలిసే ఇది జరుగుతుందని, లేకపోతే ఎందుకు ఊరకుంటారనే ప్రచారం కూడా ఉంది. రాత్రి సమయాల్లో లారీల కొలదీ ఇసుకను ఇక్కడకు తరలిస్తున్నారు. గామన్‌ బ్రిడ్జి నుంచి కాతేరుకు వచ్చే ప్రాంతంలో ఓ చెరువు భూమిలో దీనిని స్టాక్‌ చేస్తుండడం గమనార్హం. దీనిపై అధికారులెవరూ స్పందించడంలేదు. అయితే అధికారులు తెలిసి ఊరుకుంటున్నారా.. తెలియక ఊరుకుంటున్నారా అనేది మాత్రం బయటకు రాలేదు. నిత్యం రాత్రి సమయాల్లో మాత్రం నేటికీ యథేచ్ఛగా ఇసుక లారీలు తిరుగుతూనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2023-03-31T00:55:42+05:30 IST