ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 31 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2023-03-15T01:19:56+05:30 IST

ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న  31 కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురు మహిళల అరెస్టు

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), మార్చి 14: ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ.1.60 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ పి.సోమశేఖర్‌ వివరాలను వెల్లడించారు. విశాఖపట్నం నుంచి కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం అందింది. ఎస్‌ఈబీ(సౌత్‌) ఇన్‌స్పెక్టర్‌ పి.హనుశ్రీ తమ సిబ్బందితో బస్సులో సోదాలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జెర్రిలకు చెందిన జోబా వరలక్ష్మీ, వణుకూరుకు చెందిన గెమ్మిలి కుమారి, దొంగలెగకు చెందిన గండేరి లింగమ్మ వద్ద కవర్లలో ప్యాక్‌ చేసి ఉన్న 31.695 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దొంగలెగ నుంచి విజయవాడకు గంజాయిని తీసుకెళ్తున్నారని, తునిలో ఈ బస్సు ఎక్కారని అడిషనల్‌ ఎస్పీ చెప్పారు. జోజా వరలక్ష్మీతో సహజీవనం చేస్తున్న బాబూరావు అనే వ్యక్తి వీళ్లకు గంజాయి ప్యాకెట్లు ఇచ్చాడని.. విజయవాడ చేరవేస్తే చార్జీలు కాకుండా రూ.2 వేలు చొప్పున ఇస్తానని చెప్పాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. బాబూరావును అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపించామని పేర్కొన్నారు. విజయవాడలో ఒక వ్యక్తి వచ్చి స్వాధీనం చేసుకుంటాడని నిందితులకు బాబూరావు చెప్పాడన్నారు. ఆ వ్యక్తిని కూడా అరెస్టు చేస్తామన్నారు. గెమ్మిలి కుమారి నాలుగు నెలల క్రితం 7కిలోల గంజాయి తరలిస్తుండగా కేడీ పేట పోలీసులు అరెస్టు చేశారని.. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉందని సోమశేఖర్‌ వెల్లడించారు. ఇన్‌స్పెక్టర్‌ హనుశ్రీ, సిబ్బందిని ఆయన అభినందించారు.

చిందాడగరువు-కామనగరువు బైపాస్‌ రోడ్డులో

22 కిలోల గంజాయి స్వాధీనం

ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌

అమలాపురంరూరల్‌, మార్చి14: అమలాపురం తాలూకా పోలీసులకు అందిన సమాచారంతో చిందాడగరువు-కామనగరువు బైపాస్‌ రోడ్డులో దాడిచేసి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రూ.67,170 విలువైన 22.390 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ అందే పరదేశి తెలిపారు. సమనసకు చెందిన దారా కిరణ్‌(27), కామనగరువు అబ్బిరెడ్డి రామదాసు కాలనీకి చెందిన ఎన్‌. లోవరాజు (27)లను అరెస్టుచేసి గంజాయితోపాటు రెండు సెల్‌ఫోన్లు, రూ.200నగదు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్‌ అడపా సుబ్రహ్మణ్యం, వీఆర్వో వలీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-15T01:19:56+05:30 IST