రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు కన్నుమూత
ABN , First Publish Date - 2023-07-13T01:23:21+05:30 IST
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి గ్రామానికి చెందిన అల్లూరి కృష్ణంరాజు(83) బుధవారం మృతిచెందారు. ఇటీవల లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
అంతర్వేది, జూలై 12: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి గ్రామానికి చెందిన అల్లూరి కృష్ణంరాజు(83) బుధవారం మృతిచెందారు. ఇటీవల లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తొలుత వరహాలమ్మను వివాహం చేసుకోగా వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలరు. ఆ తరువాత వరహాలమ్మ కాలం చేయడంతో మల్లీశ్వరిని కృష్ణంరాజు వివాహమాడారు. ఈమె ప్రస్తుతం టీటీడీ మెంబరుగా కొనసాగుతున్నారు. 2004 ఎన్నికల్లో టీడీపీతో పోటీపడి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 28,018 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు 1999 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పొందిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరంతరం నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజలతో మమేకం కావడంతో 2004 ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. రాజోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించి పర్యాటక రంగంలో దిండి రిసార్ట్స్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశారు. లంక గ్రామాలను వరదల నుంచి కాపాడేందుకు ఏటిగట్ల ఆధునికీకరణ పనులు నిర్వహించడంతో పాటు తీర ప్రాంత వాసుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి పైపులైన్లు, వాటరు ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. గొంది నోవా కాల్వ, రామేశ్వరం-శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ మరమ్మతు పనులు చేపట్టారు. సఖినేటిపల్లిలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంఖం పూరిస్తే ఇప్పటికి పూర్తయ్యాయి. కులాలకు అతీతంగా రాజకీయ ప్రస్థానం చేపట్టిన కృష్ణంరాజు మలికిపురం ఏఎఫ్‌టీడీ, ఎంవీఎన్‌జేఎస్ అండ్ ఆర్‌వీఆర్ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా రాజోలు నియోజకవర్గ ప్రజా సమస్యలపై పోరాడి ఇటీవల కాలంలో వైసీపీలో చేరారు. ఆరోగ్యం సహకరించక ఇంటికే పరిమితమైన ఆయన రాజోలు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో సలహాలు, సూచనలు ఇచ్చినట్టు సమాచారం. లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి సఖినేటిపల్లిలోని స్వగృహానికి తీసుకువస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.