Share News

రోడ్లా.. డ్రెయిన్లా!

ABN , First Publish Date - 2023-11-06T00:07:20+05:30 IST

రాజమహేంద్రవరంలో అభివృద్ధి రివర్స్‌ గేరు వేసింది. నిన్నమొన్నటి వరకూ వరదల సమయంలో ముంపునీటితో తంటాలు పడేవారు.ఇది ఏడాదికోసారే ఉండేది.. అయితే అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు తలా తోకా లేకుండా చేసిన పను లతో ప్రస్తుతం చినుకు పడితే నగరం మురుగునీటితో నిండిపోతోంది.

రోడ్లా.. డ్రెయిన్లా!
నీరెళ్లే దారేది : రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్‌లో రోడ్డుపై నిలిచిన వాన నీరు

అభివృద్ధి పేరుతో కొత్త సమస్యలు

చినుకు పడితే డ్రెయినేజీలుగా రోడ్లు

నీరు పోయే దారిలేక నిలిచిపోతున్న వైనం

గతంకంటే అధ్వానంగా మారిన పరిస్థితి

అధికారులు.. పాలకుల నిర్లక్ష్యమే కారణం

రాజమహేంద్రవరం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో అభివృద్ధి రివర్స్‌ గేరు వేసింది. నిన్నమొన్నటి వరకూ వరదల సమయంలో ముంపునీటితో తంటాలు పడేవారు.ఇది ఏడాదికోసారే ఉండేది.. అయితే అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు తలా తోకా లేకుండా చేసిన పను లతో ప్రస్తుతం చినుకు పడితే నగరం మురుగునీటితో నిండిపోతోంది. మురుగు మయమవుతున్న రోడ్లను చూసి అభివృద్ధి అంటూ ధారపో సిన కోట్లాది రూపాయలు పాలకుల అనాలోచిన నిర్ణయాలను వెక్కి రిస్తున్నాయి. ప్రచార ఆర్భాటాలకు, పైకి షోకులకు ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్న వాస్తవం గమనిస్తున్న ప్రజలు రాజమహేంద్రవరంలోని అద్భుతమైన ఇంజనీరింగ్‌ పనిత నాన్ని చూసి నవ్విపోతున్నారు. అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఎంతో కొంత మెరుగుపడాలి.. కానీ అంతకుముందు కంటే అధ్వానమైన పరిస్థితి దాపురిస్తోంది. కమిషన్ల కక్కుర్తితో అనవసర పనులకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమైన పనులను వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. శనివారం సుమారు గంట పాటు కురిసిన వర్షం వాటిని రుజువు చేసింది.

పొంగిపొర్లిన మురుగు

గంటపాటు వర్షానికే డ్రైన్లు పొంగిపొర్లాయి. గతంలో వర్షం వస్తే లాలా చెరువు రోడ్లో పెద్దగా ఇబ్బంది ఉండేదికాదు. ఎగువ నుంచి వచ్చే ముంపునీరు కంబాల చెరువులోకి వెళ్లేది. అయితే ఫుట్‌పాత్‌ల అభివృద్ధి అంటూ హం గామా చేస్తూ బిళ్లలు అతికించే కార్యక్రమం చేపట్టారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోలేదు. ఇది శనివారం కురిసిన వర్షం బట్ట బయలు చేసింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో ముంపునీరు సాఫీగా ప్రవహించే వీలు లేక ఆర్‌అండ్‌బీ కార్యాలయం దగ్గర నుంచి నీరు పైకి ఎగదన్ని రోడ్డుపైకి చేరింది. డ్రైనేజీ ఎలా ఉన్నా కంబాలచెరువు వరకూ మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించింది. ఐఎల్‌టీడీ జంక్షను వద్ద రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్‌ ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. క్వారీ మార్కెట్‌ రోడ్‌, తాడితోట, తుమ్మలోవ, వైజంక్షన్‌, ఆర్యాపురం తదితర చోట్ల మురుగునీరు రోడ్లపైకి చేరింది. వర్షం తగ్గిన తర్వాత గంటల తరబడి మురుగును శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది.

షోకులకు కోట్లు

నగరంలో అనవసర షోకులకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కంబాల చెరువు పార్కు. ఈ పార్కు అభివృద్ధి చేశామంటూ ఇటీవలే హంగామా చేశారు.ఇప్పుడు ఈ పార్కు మురుగు నీటితో నిండిపోతోంది. శనివారం కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున మురుగునీరు ఈ పార్కులో చేరుకొంది. వర్షం కురిసినప్పుడు మురుగునీరు సాఫీగా పార్కులోకి చేరడానికి వీలుగా పార్కులో ఉన్న మురుగునీటి ఇన్‌టేక్‌ కాలువలో పారిశుధ్య కార్మికులతో చెత్తాచెదారాన్ని తీయిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చివరకు మురుగు నీటిలో తిరిగి, మురుగు కంపు పీల్చడానికి డబ్బులు వసూలు చేయడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-06T00:07:29+05:30 IST