దోపిడీకి గ్రీన్‌సిగ్నల్‌!

ABN , First Publish Date - 2023-05-03T00:57:24+05:30 IST

రైల్వే స్టేషన్లలో ధరల దోపిడీకి అడ్డుకట్ట వేసేవారే లేరు.. నిత్యం దోపిడీ సాగిపోతూనే ఉంటుంది. దీంతో ప్రయాణికుల జేబుకు లక్షల రూపాయల్లో పెద్దచిల్లు పడుతోంది.

దోపిడీకి గ్రీన్‌సిగ్నల్‌!
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌

రైల్వే నిబంధనలు గాలికి

ప్రయాణికుల జేబు గుల్ల

నిత్యం సా..గుతున్న ధరల దందా

ఇష్టారాజ్యంగా అమ్మకాలు

తూతూ మంత్రంగా కేసులు

రోజుకు 120 రైళ్ల రాకపోకలు

10 వేల మంది ప్రయాణికులు

రెండు నెలల్లో 25 కేసులే నమోదు

కళ్లు మూసుకుంటున్న అధికారులు

రాజమహేంద్రి స్టేషన్‌లో ఇదీ సీన్‌

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), మే 2 : రైల్వే స్టేషన్లలో ధరల దోపిడీకి అడ్డుకట్ట వేసేవారే లేరు.. నిత్యం దోపిడీ సాగిపోతూనే ఉంటుంది. దీంతో ప్రయాణికుల జేబుకు లక్షల రూపాయల్లో పెద్దచిల్లు పడుతోంది. ప్రయాణికుల సదుపాయాల్లో భాగంగా రైల్వే అందిస్తున్న రాయితీనీ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. వాటర్‌ బాటిల్స్‌, కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌లు.. ఇలా అదనానికి కాదేదీ అనర్హం అన్న చందంగా అన్నిటిపైనా ధరల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు జరిమానాలు విధించినా.. అడపాదడపా కేసులు బనాయించినా ఈ చిల్లర దందా మాత్రం ఆపలేకపోతున్నారు. ఎవరైనా ప్రయాణికుడు ఫిర్యాదు చేస్తే అపరాధ రుసుం వసూలు చేశాం..ఫిర్యాదు క్లోజ్‌ అనే దారిలో యంత్రాం గం వెళుతోంది. చిన్నమొత్తం జరిమానా కడితే సరిపోతుందిలే.. దోపిడీ ఆపేదెవరు? అనే ట్రాక్‌పై దుకాణాల వాళ్లు పరుగులు పెడుతున్నారు. దీంతో అనధికార ధరలకు రెడ్‌ సిగ్నల్‌ పడడం లేదు. కోనసీమ, తూర్పు, అల్లూరి జిల్లాలవాసులకు రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌.ఈ స్టేషన్‌ నుంచి రోజుకు 120 రైళ్లు నడుస్తుండగా.. 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. సెలవులు, పండుగ దినాల్లో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదే అదునుగా వ్యాపారుల దోపిడీ రోజూ లక్షల్లో సాగుతోంది.

టీ..కాఫీ తాగాలన్నా అధనమే..

రైల్వే స్టేషన్‌లో 17 స్టాల్స్‌ ఉన్నాయి. ఎంఆర్‌పీ అనే మాటే ఇక్కడ వినబడదు. కూల్‌డ్రింక్‌లు, వాటర్‌బాటిల్స్‌ కలిపి రోజుకు 300 కార్టాన్ల(కార్టాన్‌కి 15 బాటిల్స్‌) వరకూ వస్తాయి. వీటిలో సగం వాటిర్‌ బాటిల్స్‌ ఉంటాయి. రోజుకు కనీసం 3 వేల వాటర్‌ బాటిల్స్‌ అమ్ముడవుతాయి. వేసవికాలం కాబట్టి ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఈ లెక్కన బాటిల్‌పై రూ.5 చొప్పున దాదాపు రూ.20 వేలు రోజూ ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది. కేవలం వాటర్‌ బాటిల్స్‌పైనే నెలకు రూ.6 లక్షల వరకూ దోపిడీ జరుగుతోంది. జ్యూస్‌, కాఫీలు, టీ, కూల్‌డ్రింక్‌లపై ఎక్స్‌ట్రా ధరలు అదనం. జ్యూస్‌ రూ.25కి విక్రయించాల్సి ఉండగా రూ.30, కాఫీ రూ.10కాగా రూ.15 పిండేస్తున్నారు.ఇవన్నీ కలుపుకుంటే నెలకు సుమారు రూ.10 లక్షల వరకూ ప్రయాణికులు నష్టపోతున్నారు. బిల్లు ఇవ్వకపోతే డబ్బులు చెల్లించవద్దనే సూక్తులు బోర్డులకే పరిమితమవుతున్నాయి. ఒక్క చోట కూడా బిల్లు అనే మాటే ఉండదు. వినియోగదారుల హక్కులను ఇలా హరించేస్తున్నారు.

ఫిర్యాదు చేసినా.. చర్యలు శూన్యం..

ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే చూద్దాంలే అనే అధికారుల ధోరణి వ్యాపారుల దోపిడీకి ఊతమిస్తోంది. ఎవరైనా రైల్‌ మదద్‌ వెబ్‌సైటులో లేదా 139కి ఫోన్‌లో ఫిర్యాదు చేసినా ఏం చర్య తీసుకున్నారో కూడా ఫిర్యాదుదారుడికి తెలియజేయకుండా ఫిర్యాదు పరిష్కరించేశామనే సమాధానం మాత్రం సెల్‌ఫోన్‌కి మెసేజ్‌ వచ్చేస్తుంది. ఒకవేళ జరిమానాలు విధిస్తున్నా అవి దోపిడీతో పోల్చుకుంటే ఆవగింజకు పనసపండుకు ఉన్నంత తేడా ఉంటుంది.దీంతో ప్రయాణికుల నుంచి లక్షల్లో లాగేస్తూ.. పదోపరకో జరిమానా కట్టేస్తే సరిపోతుందనే ధోరణి అలవాటుగా మారిపోయింది. ఉన్నతాధికారులు వచ్చినపుడు హడావుడి చేస్తారు. వాళ్లు అలా రైలెక్కాక ఇలా అదనపు దోపిడీ మొదలుపెడతారు. రైల్వేకు అందే ఫిర్యాదుల్లో చిల్లర ఇవ్వడంలేదనేవి ఎక్కువగా ఉంటున్నా యి. తర్వా తి స్థానంలో ఆహార నాణ్యత, నిర్ధారిత పరిమాణం ఇవ్వకపోవడం, అధిక ధరలు తదితర వాటిపై ఫిర్యాదులందుతున్నాయి.రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ పరిధిలో ఫిబ్రవరిలో 8 కేసులు నమోదు చేసి కేవలం రూ.5 వేలు, మార్చిలో 17 కేసులుపెట్టి రూ.16 వేలు మాత్రమే అపరాధ రుసుం విధించారు.

ప్రశ్నించేవారేరి..?

అధిక ధరలు, నాణ్యత, పరిమాణంపై సాధారణంగా ప్రయాణికులెవరూ ప్రశ్నించరు. సర్దుకుపోయే ధోరణిని అవలంభిస్తారు. ఒకవేళ ప్రశ్నించినా దురుసు సమాధానం వినాల్సివస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేయాలో చాలామందికి తెలియదు. దీనిపై అవగాహన కూడా పెద్దగా కల్పించరు. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఫిర్యాదుదారుడి సంతృప్తి అనేది అధికారులు పట్టించుకోరు. దీంతో ప్రతీ అమ్మకంలో కక్కుర్తికి అడ్డుకట్ట పడడం లేదు. ఉదాహరణకు కాఫీ, టీ 150ఎంఎల్‌ ఉండాలి. కప్పుపై 150ఎంఎల్‌, 170ఎంఎల్‌ అని స్పష్టంగా ముద్రించి ఉండాలి. కానీ ఉండవు. అలా ఉన్నప్పుడు కూడా కప్పులో నీళ్ల కాఫీ, టీ 80ఎంఎల్‌కి మించదు. రైలులో అయితే మరీ దారుణంగా నాణ్యత, పరిమాణం ఉంటోంది. ఈ దోపిడీ చిన్నగా కనిపిస్తున్నా.. కొన్ని వేల కప్పుల టీ, కాఫీ అమ్మితే ఎన్ని లక్షల రూపాయలు అక్రమ సంపాదనో లెక్కలేస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.ఈ దోపిడీకి రైల్వే కొన్నేళ్లుగా అడ్డుకట్ల వేయలేకపోతోంది. పైగా ఈ అంశాలన్నీ వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడం కిందకే వస్తాయి. అయినా చర్యలు మాత్రం శూన్యం.

ధరల బోర్డులు కనబడకుండా..

రైల్వే నిబంధనల ప్రకారం ఆయా స్టాల్స్‌లో విక్రయించే ఆహార పదార్థాలు, వస్తువుల ధరల పట్టికను ప్రయాణికులకు కనబడే విధంగా ఉంచాలి. ధరల పట్టిక చిన్న అక్షరాలతో ఉండగా.. కొన్ని స్టాల్స్‌ వద్ద అతి తెలివి ప్రదర్శిస్తూ ఆ పట్టికలను కుర్‌కురే, లేస్‌ వంటి ప్యాకెట్లతో మూసేస్తున్నారు. అధికశాతం స్టాల్స్‌లో ధరల పట్టికలు ప్రయాణికులకు నేరుగా కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు దోపిడీని చూసీచూడనట్టు వదిలేస్తూ వ్యాపారులకు ’సాధ్యమైనంత’ సహాయపడుతున్నారని ఆరోపణలున్నాయి.

వాటర్‌ బాటిల్‌పై రాయితీ నొక్కుడే..

వాటర్‌బాటిల్‌ బయట రూ.20 కావడం వ్యాపారులకు కలిసివస్తోంది. చాలా మందికి రైల్వేస్టేషన్‌లో వాటర్‌ బాటిల్‌పై రూ.5 రాయితీ ఉంటుందని, రూ.15 చెల్లిస్తే సరిపోతుందని తెలియదు. దీంతో బయటరేటు ఇచ్చేస్తున్నారు. రైళ్లలో కూడా అంతే.వ్యాపారులు ప్రయాణికులు అడిగితే చిల్లర రూ.5 విసుక్కుంటూ చేతిలో పెడతారు. లేకపోతే స్వాహా చేస్తారు. రైళ్ల రద్దీ వేళల్లో, రైలు ఆగి ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై వచ్చినప్పుడు, రైళ్లలో విక్రయించేప్పుడు చిల్లర ఇవ్వనేఇవ్వరు. ఒకవేళ అడిగితే చిల్లర లేదంటున్నారు. ఇలా ప్రయాణికుడికి మిగలాల్సిన డబ్బులను వ్యాపారులు దోచేస్తున్నారు. అన్నిటిపైనా ఎంతో కొంత అదనంగా అనధికారికంగా లాగేస్తున్నారు.

Updated Date - 2023-05-03T00:57:24+05:30 IST