Share News

ప్రచారమే పరమావధిగా ‘ఆడుదాం..’

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:24 AM

బ్యాట్లు, బాల్‌లు, నెట్‌లు కొన్ని ఇచ్చి ‘ఆడుదాం ఆంధ్ర’ అంటే.. క్రీడా స్ఫూర్తిని కలిగించినట్టేనా? ఆంధ్రులంతా ఆరోగ్యంగా, శారీరదారుఢ్యంతో, ఉల్లాసంగా ఉండడం కోసం ఆడేయండి అని హడావుడి చేస్తే ఆడేస్తారా? కేవలం ఆటవస్తువులను మాత్రమే ఇచ్చి ఆడుదాం ఆంధ్ర అంటే లక్ష్యం నెరవేరిపోతుందా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

ప్రచారమే పరమావధిగా ‘ఆడుదాం..’
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎంపీ భరత్‌ తదితరులు

  • క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతులేవీ

  • కిట్లు ఇచ్చేసి.. ఐదు ఆటలతో మమ

  • పంచాయతీలు, మున్సిపాల్టీల సొంత ఖర్చుతోనే ఆటల నిర్వహణ

  • బలవంతపు రిజిస్ట్రేషన్లే ఎక్కువ

  • క్రికెట్‌, వాలీబాల్‌ ఆడే అమ్మాయిలేరీ?

  • కనీస తర్ఫీదు కూడా లేకుండా ఆటలు

  • నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

బ్యాట్లు, బాల్‌లు, నెట్‌లు కొన్ని ఇచ్చి ‘ఆడుదాం ఆంధ్ర’ అంటే.. క్రీడా స్ఫూర్తిని కలిగించినట్టేనా? ఆంధ్రులంతా ఆరోగ్యంగా, శారీరదారుఢ్యంతో, ఉల్లాసంగా ఉండడం కోసం ఆడేయండి అని హడావుడి చేస్తే ఆడేస్తారా? కేవలం ఆటవస్తువులను మాత్రమే ఇచ్చి ఆడుదాం ఆంధ్ర అంటే లక్ష్యం నెరవేరిపోతుందా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా క్రీడలకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు విద్యా సంస్థల్లో ఆటస్థలాలు కూడా ఉండడం లేదు. ఆటల్లో శిక్షణ కూడా అదే చందాన ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆడుదాం ఆంధ్ర అంటే ఓ ప్రచార పర్వంలా హడావుడి చేసే ప్రయోజనం ఏమిటనేది పిల్లలు, వారి తల్లిదండ్రుల ప్రశ్న. ఆడుదాం ఆంధ్ర పేరిట మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా జిల్లాలో నూ ఆడుదాం అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. వీటికి ఆయా క్రీడలకు సంబంధించిన కిట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. కానీ క్రీడాకారుల ఎంపిక, గ్రౌండ్‌, నిర్వహణ తదితర పనులన్నీ ఆయా పంచాయతీలు, మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలే నిర్వహించారు. ప్రతీ సచివాలయం పరిధిలోనూ ఈ ఆటలు నిర్వహించాలనే లక్ష్యంతో క్రీడాకారులను రిజిస్ర్టేష న్‌ చేయించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రధాన గ్రౌండ్లలో నిర్వహించ డానికి ఏర్పాట్లుచేస్తున్నారు. జిల్లాకు సంబంధించి 512 సచివాలయాల్లో క్రీడలు నిర్వహించాలని చెప్పి మొత్తం 365 చోట్ల నిర్వహిస్తున్నట్టు చెబు తున్నారు. రాజమహేంద్రవరంలో మొత్తం సచివాలయాల పరిధిలోని క్రీడా కారులను కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఆడించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి నిర్వహణకు సచివాలయానికి రూ.10 వేలు ఇస్తామని మాత్రమే చెప్ప డం గమనార్హం. కానీ ఇంతవరకూ డబ్బు విడుదల చేయలేదు. ముందు క్రీడలు నిర్వహించేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఇక ఆడుదాం ఆంధ్రలో మొదట ఎంపిక చేసినట్టు కాకుండా ఇటీవల క్రీడాకారుల సంఖ్యను తగ్గించమని ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. ప్రభుత్వం అధి కారికంగా ఐదు రకాల ఆటల్లో ఆడుదాం ఆంధ్ర నిర్వహించడానికి సిద్ధమైంది. క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ను ఎంపిక చేసింది. ఒక్కో సచివాలయంలో పరిఽధిలో కనీసం రెండు టీములను ఎంపిక చేయాలని ఆదేశించింది. దానికి క్రికెట్‌కు రెండు బ్యాట్‌లు, ఆరు బాల్‌లు, ఆరు స్టంప్‌లు, ఇతర గేమ్‌లకు బాల్‌లు, నెట్‌లు ఇస్తున్నారు. మొదట ఒక్కో సచివాలయం నుంచి మొత్తం 228 మందితో రిజిస్ర్టేషన్‌ చేయించాలని ఆదేశించింది. క్రికెట్‌కు 11 ప్లస్‌ 5తో మొత్తం రెండు టీములకు 64 మంది, ఖోఖోకు జట్టుకు 9+6తో మొత్తం 60 మందిని, బాడ్మింటన్‌కు ఇద్దరు వంతున మొత్తం 8 మందిని, వాలీబాల్‌కు 6+6తో మొత్తం 48 మందిని, కబడ్డీకి 7+5తో మొత్తం 48 మందిని ఎంపిక చేయమన్నారు. కానీ ఇటీవల ఈ సంఖ్యను తగ్గించారు. ప్రస్తుతం క్రికెట్‌కు 11 మంది, వాలీబాల్‌కు ఆరుగురు, కబడ్డీకి ఏడుగురు, ఖోఖోకు 9 మందిని ఎంపిక చేస్తేచాలని కుదించారు. అంటే అదనపు ప్లేయర్లు ఉండరు.

  • రిజిస్ర్టేషన్లు ఎక్కువ-. ఆటలు తక్కువ

ఆడుదాం ఆంధ్ర ఓ హడావుడి మాత్రమే. ఎందుకంటే ఆటలు కేవలం అయిదే ఉన్నాయి. రిజిస్ర్టేషన్లు మాత్రం ఒక్కో ఆటకు వందల్లో ఉన్నాయి. ఈ జాబితాలు చూస్తే వీరంతా ఆటలాడేవారేనా అనే అనుమానం రాక మానదు. బలవంతంగా రిజిస్ర్టేషన్లు చేయించిన వారే ఇందులో ఎక్కువ మంది ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. సచివాలయాల పరిధిలోకి టార్గెట్లు ఇచ్చి ఒక్కో సచివాలయంలో 228 మంది రిజిస్ర్టేషన్లు కావాలనే టార్గెట్లు పెట్టడంతో ఆడడం వచ్చా, లేదా అనేది పట్టించుకోకుండా లక్ష్యాల కోసం రిజిస్ర్టేషన్లు చేయించినట్టు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో క్రికెట్‌కు 3,606 బృందాల ద్వారా 66,386 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 57,437 మంది, స్ర్తీలు 8,949 మంది ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో 4,970 బృందాల ద్వారా 19,447 మంది పేర్లు నమోదు చేసుకోగా, వారిలో 754 మంది పురుషులు, 9,693 మంది మహిళలు ఉన్నారు. వాలీబాల్‌లో 4,384 బృందాల ద్వారా 35,144 మంది నమోదుచేసుకోగా, వారిలో పురుషులు 27,510 మంది, మహిళలు 7,634 మంది ఉన్నారు. ఖోఖోలో 839 బృందాల ద్వారా 36,254 మంది నమోదు చేసుకోగా, పురుషులు 9,487 మంది, మహిళలు 26,767 మంది ఉన్నారు. కబడ్డీలో 3,287 బృందాల ద్వారా 36,882 మంది పేర్లు నమోదు చేసుకోగా, వారిలో పురుషులు 24,530 మంది, మహిళలు 12,352 మంది ఉన్నారు. మొత్తం ఆటల కోసం నమోదైన వారిలో మహిళల సంఖ్య బాగా తక్కువ ఉంది. కేవలం ఖోఖోలో మాత్రం వారి సంఖ్య అధికంగా ఉంది. కాగా ఒకే ప్రాంతానికి చెందిన క్రీడాకారులైనా కనీస సౌకర్యాలు కల్పించాలి. భోజన సౌకర్యాలు కూడా లేవు. పైగా సచివాలయం, మండల స్థాయిలో పోటీదారు లకు బహుమతులు లేవు. కేవలం నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నగదు బహుమతిని ప్రకటించారు. దీంతో ఏదో మొక్కుబడిగా, ప్రచారపు ఆర్భాటమే ధ్యేయంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

  • ఆడుదాం ఆంధ్రాకు అంతా సిద్ధం : ఎంపీ

రాజమహేంద్రవరం, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి): ‘ఆడుదాం ఆంధ్రా’కు అంతా సిద్ధంచేశామని ఎంపీ భరత్‌రామ్‌, వైసీపీ సిటీ కోఆర్డినేటర్‌ గూడూరి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం వై జంక్షన్‌ నుంచి అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ రోజుకు అరగంటైనా జాగింగ్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేశ్‌ కుమార్‌, రుడా చైర్మన్‌ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో జగన్‌ చిత్రంతో ఉన్న ఆడుదాం ఆంధ్రా లోగోను ముద్రించిన కొందరు వైసీపీ నాయకులు మినహా ఇతర ప్రజానీకం, క్రీడాకారులుగాని లేకపోవడం గమనార్హం.

Updated Date - Dec 26 , 2023 | 01:24 AM