కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2023-06-07T00:48:16+05:30 IST

గ్రామాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి హిందుస్థాన్‌ యునీలివర్‌ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ ద్వారా గ్రామాలను దత్తత తీసుకోవడం అభినందనీయమని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
నూతన వాహనాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

  • జిల్లా కలెక్టర్‌ మాధవీలత

బొమ్మూరు, జూన్‌ 6: గ్రామాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి హిందుస్థాన్‌ యునీలివర్‌ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ ద్వారా గ్రామాలను దత్తత తీసుకోవడం అభినందనీయమని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. మంగళవారం బొమ్మూరు రెవెన్యూ కాలనీలో ప్రభాత్‌ వ్యర్థపదార్థాల నిర్వాహణ, పోషన్‌సాతి కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరించేందుకు ఏడు నూతన ఆటోలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ధవళేశ్వరం, బొమ్మూరులో వ్యర్థపదార్థాల నిర్వహణ కార్యక్రమం చేపట్టడం ప్రోత్సాహకరమైన అంశమన్నారు. ప్రభుత్వం సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా చెత్తను సేకరిస్తోందన్నారు. రక్తహీనత గల గర్భిణులు, బాలింతలను గుర్తించి వైఎస్సార్‌ సంపూర్ణ పోషక పదార్థాలు అందజేస్తున్నామన్నారు. ప్రభాత్‌ పోషన్‌సాతి ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారుల్లో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందుస్థాన్‌ యునీలివర్‌ ,సీఎస్‌ఆర్‌ భాగస్వామ్యంలో కొవ్వూరు, కడియం, రాజమహేంద్రవరం రూరల్‌, సీతానగరం మండలాలకు చెందిన 53 గ్రామాల్లో 107 సచివాలయాల పరిధిలో 4.5 లక్షల ప్రజలకు ఆరోగ్య సమతుల్యతపై కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రభాత్‌ ప్రతినిధి మంధీరానగ్రాంత్‌ తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో సత్యనారాయణ, మ్యానుఫాక్చరింగ్‌ మేనేజర్‌ శేషుకుమార్‌, ఫ్యాక్టరీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:48:16+05:30 IST