ప్రస్ఫుటంగా ప్రజాగ్రహం
ABN , First Publish Date - 2023-08-02T01:23:06+05:30 IST
వైసీపీ సర్కారు తీరుతో జిల్లావ్యాప్తంగా నాలుగేళ్లలో వేలాది మంది ప్రజలు అనేక సంక్షేమ పథ కాలకు దూరమైపోయారు.
నిరసనలు, నిలదీతల మధ్య జిల్లాలో ముగిసిన జగనన్న సురక్ష
కీలక సమస్యల పరిష్కారం పక్కనపెట్టి ధ్రువపత్రాల జారీతో మమ
ఇప్పటికీ పరిష్కారంకాని రీసర్వే చిక్కులు, పథకాల్లో కోత, ఇళ్ల స్థలాల బాధలు
అయినా 2.68 లక్షల సేవా విజ్ఞప్తులు పరిష్కరించేసినట్టు సర్కారు గొప్పలు
మరోపక్క సురక్ష ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు
ఈ నెల రోజుల్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను పరుగులు పెట్టించిన ప్రజలు
సమస్యలపై జనగళంతో జగ్గంపేట, పిఠాపురం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలకు చుక్కలు
అటు గడపగడపకు, ఇటు సురక్షలో వైసీపీ ఎమ్మెల్యేలకు చుక్కలే చుక్కలు
ప్రభుత్వంపై పేరుకుపోయిన ప్రజాగ్రహంతో తలపట్టుకుంటున్న నేతలు
జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం మమ అనిపించేసింది. నెలరోజులపాటు ఆర్భాటంగా నిర్వహించిన సురక్షలో ప్రజల కీలక సమస్యలను పరిష్కరించడాన్ని పక్కన పెట్టేసి కేవలం తూతూమంత్రపు ధ్రువపత్రాల జారీతో ముగించేసింది. ప్రజలకు పెద్దగా ఉపయోగం లేకపోయినా అద్భుతంగా నిర్వహించేశామంటూ జబ్బలు చరుచుకుంటోంది. ఈ కార్యక్రమం ముగియడంతో జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. నెలరోజులపాటు ఎక్కడికక్కడ ప్రజల నిలదీతలు, నిరసనలతో అనేకమంది ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సురక్ష సభల్లో ప్రజలు ఎటువైపు నుంచి వచ్చి ఎదురు తిరుగుతారోననే భయంతో బిక్కుబిక్కుమన్నారు. ముఖ్యంగా జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ఎమ్మెల్యేలపై జనం తిరగబడ్డారు. ఇప్పటికే గడపగడప పేరుతో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యేలకు తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. తాజాగా జగనన్న సురక్ష అంతకుమించిన చేదు అనుభవాలనే మిగిల్చింది.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
వైసీపీ సర్కారు తీరుతో జిల్లావ్యాప్తంగా నాలుగేళ్లలో వేలాది మంది ప్రజలు అనేక సంక్షేమ పథ కాలకు దూరమైపోయారు. గడచిన నాలుగేళ్లుగా రకరకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం వేలాది లబ్ధిదారులను అనేక పథకాల్లోంచి తొలగించేసింది. అలాగే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి మ్యుటేషన్లు జరగకపోవడం, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రేషన్‌కార్డులకు దరఖాస్తులు చేసినా జారీకాకపోవడం, భూముల రీసర్వేలో తప్పులతో వేలాది మందికి భూముల విస్తీర్ణాలు తగ్గి పోవడం వంటివెన్నో సమస్యలు పేరుకుపోయాయి. వీరంతా ఎన్నిసార్లు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. స్పందనకు వెళ్లి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నా ఏవీ పరిష్కారానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రజా గ్రహం నుంచి తప్పించుకునేందుకు జగన్ ప్రభుత్వం జులై 1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలను నెలరోజులపాటు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం జూన్ 23 నుంచి జిల్లాలో ఇంటింటికి వెళ్లి వలంటీర్లు జనం సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఇందులో వేలల్లో సమస్యలు వచ్చాయి. వీటిని పరిష్కరించి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జులై 1 నుంచి పంపిణీ చేశారు. అయితే వచ్చిన అర్జీల్లో సర్వే సమస్యలు, కౌలురైతుల కార్డులు, ఇళ్ల స్థలా లు, కొత్త రేషన్‌కార్డులు, కార్డుల విభజన వంటి కీలక సమస్యలకు నెలరోజుల సురక్ష కార్యక్రమంలో పరిష్కారం దొరకలేదు. కేవలం అతి సులువైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకే సురక్ష కార్యక్రమం పరిమితమైందనే విమర్శలు పెద్దఎత్తున నెలకొన్నాయి. వాస్తవానికి సురక్ష కింద 11 రకాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో పిల్లిమొగ్గలు వేసింది. దీంతో ప్రజ లకు సంబంధించిన అనేక కీలక సమస్యలు అలాగే ఉండిపోయాయి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలన్నీ పరిష్కరించేసినట్టు ఇప్పుడు జబ్బలు చరుచుకుంటుండడం విశేషం.
వారంతా హమ్మయ్య...
జగనన్న సురక్ష ముగియడంతో జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. జనం నుంచి నిరసనలు,నిలదీతల సెగ తప్పినట్టేనని భావిస్తున్నారు. వాస్తవానికి నియోజకవర్గాల్లో ప్రజలకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను నెల రోజుల వ్యవధిలో జారీ చేసినప్పుడు ఎక్కడి కక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి వైసీపీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఏ రోజుకారోజు ఎమ్మెల్యేలు ఈ సభలకు హాజరయ్యారు. తీరా ఈ సమావేశాలతో ప్రభుత్వానికి ప్రచారం కంటే వ్యతిరేకతే ఎక్కువగా మిగిలింది. గడచిన నాలుగేళ్లుగా రహదారులు పెద్దగా వేయకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణించే పరిస్థితులు లేక పోవడం, ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో సభలు, సమావేశాలకు వచ్చిన జనం అనేకసార్లు వైసీపీ ఎమ్మెల్యేలను చుట్టుముట్టి నిలదీ శారు. దీంతో ప్రభుత్వంపై ఏస్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తమవుతుందో ఎమ్మెల్యేలకు అర్థమైంది. ముఖ్యంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో అనేకసార్లు జనం చుక్కలు చూపించారు. కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేను గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని, మురుగునీరు పోయేదారి లేదని జనం నిలదీశారు. జగ్గం పేట మన్యవారంపాలెంలో తనకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి చనిపోతామని ఓ మహిళ హెచ్చరించగా, మంచిది అం టూ ఎమ్మెల్యే విసురుగా సమాధానమిచ్చారు. ఏలేశ్వరం మండలం జె.అన్నవరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఊరి జనం షాక్ ఇచ్చారు. గ్రామానికి రహదారి లేదని జనం నిలదీయడంతో పాటు ఎమ్మెల్యే కారు ముందు పడుకుని ఓ యువకుడు నిరసనకు దిగాడు. యు.కొత్తపల్లి వెళ్లిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుపై ప్రజలతోపాటు పార్టీ సర్పం చ్ సైతం తిరగబడ్డారు. ఇళ్ల స్థలాల పట్టా ఇచ్చినా స్థలాలు కేటాయించలేదని మండిపడ్డారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే జారుకోవడానికి ప్రయత్నిస్తే ఏకంగా వెంబడించారు. ఇలా అనేకచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులను సైతం జనం నిరసనలు, నిలదీతలతో పరు గులు పెట్టించారు. ఫలితంగా ఏరోజు ఏ సురక్ష సభకు వెళ్తే ఏం నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని వైసీపీ ఎమ్మె ల్యేల్లో వణుకు పెరిగిపోయింది. ఎట్టకేలకు సురక్ష కార్యక్ర మం ముగియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరో పక్క గడపగడప పేరుతో ఇప్పటికే ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ జనం ఎదురుతిరుగుతూ జగన్ సర్కారు పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. నాలుగేళ్లుగా ఏం చేయలేదని నిలదీస్తున్నారు. మంత్రి దాడిశెట్టి రాజా సహా ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కన్నబాబు తదితరులకు సైతం ఈ సెగలు తగిలాయి. దీంతో ప్రజల్లో ఉన్న జనాగ్రహం చూసి వీరంతా బెంబేలెత్తుతున్నారు. ఈసారి అధిష్ఠానం ఇంకేం కార్యక్రమంతో జనంలోకి వెళ్లమంటుందోనని తల్చు కుని వైసీపీ ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు.