పాడి.. కనబడదే..

ABN , First Publish Date - 2023-03-26T01:25:57+05:30 IST

గతంలో పల్లెటూర్లకు పట్టుకొమ్మలైన పాడి పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. ఏ రైతు పొలం వద్ద చూసినా పాడి గేదెలతో కళకళలాడేది. ఏ ఇంట చూసినా పాలు, పెరుగుకు లోటుండేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి పోయింది.

పాడి.. కనబడదే..
కానూరులో రైతు మకాంలో పెరుగుతున్న ఆవులు

కష్టతరంగా మారిన పాడి పశువుల పెంపకం

పశువుల రేట్లు ఆకాశంలో.. గిట్టుబాటుకాని పాల ధర

ప్రభుత్వ ప్రోత్సాహం నిల్‌

పెరవలి, మార్చి 25: గతంలో పల్లెటూర్లకు పట్టుకొమ్మలైన పాడి పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. ఏ రైతు పొలం వద్ద చూసినా పాడి గేదెలతో కళకళలాడేది. ఏ ఇంట చూసినా పాలు, పెరుగుకు లోటుండేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి పోయింది. పల్లెటూర్ల నుంచి వచ్చే పాల కోసం గతంలో పట్టణవాసులు ఎదురు చూసేవారు. మారిన పరిస్థితుల్లో పాల ఫ్యాక్టరీల నుంచి వచ్చే పాలు, పెరుగు ప్యాకెట్ల కోసం పల్లె ప్రజలు సైతం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. దీనంతటికి కారణం పాడి గేదెలను పెంచడం, రైతులకు గిట్టుబాటు కాకపోవడమేనని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో పెద్ద పెద్ద వ్యవసాయ కమతాలు ఉండేవి. పది నుంచి 20, 30 ఎకరాల వరకు ఒకే రైతు చేతిలో వ్యవసా యం ఉండేది. పది మంది పాలేర్లు పది పాడి గేదెలు అన్నట్టు ఉండేవి. ప్రస్తు తం వ్యవసాయ కమతాలు చిన్నవిగా మారి కేవలం 2 నుంచి 5 ఎకరాల వరకే రైతులు పరిమితం అయ్యారు. పాలేర్లు కూడా గతంలో మాదిరి ఎక్కడా లేని పరిస్థితి ఏర్పడింది. కేవలం రోజూ వారి కూలీపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు. పాలేరుగా పనిచేయ డానికి ఎవరూ రాక రైతులే సొంతంగా పనులు చేసుకోవాల్సి వస్తోంది.

పోషణ భారంగా మారింది..

పాడి పశువులను మోపాలంటే వాటి ఖరీదు కూడా రైతులకు ఇప్పుడు అందుబాటులో లేకుండాపోయింది. పాడి గేదె రూ.80 వేల నుంచి రూ.లక్షా 20 వేలకు వరకు పలుకుతోంది. అంత ఖరీదు పెట్టి కొనుగోలు చేసినప్పటికి ప్రతీ రోజూ వాటికి మేత కోసం రైతులు నానా తంటాలు పడవలసి వస్తోంది. పచ్చిమేత కోసం కొంత భూమిని కేటాయించి దానిలో మేత పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం భూమి విలువ దృష్ట్యా ఉన్న కొంత భూమి పశువులను మోపడానికి కేటాయించడం కూడా రైతులకు వీలు పరిస్థితి ఏర్పడుతోంది. ఒక ఎకరం భూమి ఏడాదికి సాగు చేస్తే 40 వేల వరకు వస్తుంది. అదే భూమిలో సొం తంగా వ్యవసాయం చేసి అరటి, కూరగాయలు, ఇతర పంటలు వేస్తే 80 వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తోంది. ఈ పరిస్థితుల్లో పచ్చగడ్డి కోసం భూ మిని కేటాయించాలంటే రైతులకు ఒప్పడం లేదు. అంతేకాకుండా పశువులకు దాణా కోసం జొన్నలు, ఉలవలు, పచ్చితౌడు, కంపెనీలు తయారు చేసే కణి కలు వంటి రేటు కూడా విపరీతంగా పెరిగింది. రోజుకు ఒక్కొక్క పశువుకు వంద రూపాయలు పెడితే కాని దాణా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది.

పాలపై వచ్చే ఆదాయం అంతంత మాత్రమే..

అష్టకష్టాలు పడి పాడి గేదెలను మేపినా పాలకు మాత్రం గిట్టుబాటు ఽధర లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లీటరుకు 60 నుంచి 70 మాత్రమే లభిస్తుంది. దీంతో పెట్టిన పెట్టుబడికి, వచ్చేరాబడికి పొంతన లేకపోవడంతో పాడి గేదెలను మేపే బదులు మార్కెట్‌లో ఒక లీటరు పాలు, పెరుగు కొనుక్కోవడమే చవకైందిగా రైతులు భావిస్తున్నారు. దీంతో పాల వ్యాపారం అంటేనే రైతులకు విరక్తి కలుగుతోంది. వ్యవసాయ పనులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసి ముగించవచ్చు. కానీ పాడి పశువులకు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కనిపెట్టుకుని ఉండాలి. దీంతో సమయం వెచ్చించాల్సిరావడంతో వాటిపై సహజంగానే రైతుల్లో ఆసక్తి సన్నగిల్లింది.

ప్రభుత్వం ప్రోత్సాహం కరువు...

పశుపోషణ కోసం వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ రైతులకు దక్కేది మాత్రం అంతంతమాత్రమే. పశువులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహం తగ్గిపోయింది. సబ్సిడీలు నామమాత్రంగానే ఉన్నాయి. ఒకవేళ వచ్చినప్పటికీ అధికారులు, నాయకుల ఆమ్యామ్యాలకే సగం సొమ్ము సరిపోతోంది. సబ్సిడీపై దాణా ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ అది కూడా నాణ్యతగా లేకపోవడంతో రైతులు వాటి కొనుగోలుకు ఎవరూ ముందుకు వెళ్లడం లేదు.

మార్కెట్‌లో కల్తీ పాలదే రాజ్యం..

పాడి గేదెలు పెంపకం తగ్గిపోవడంతో మార్కెట్‌లో కల్తీ పాల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అక్కడక్కడ పెద్ద మొత్తంలో ఏర్పాటుచేసి పశువులను పెంచుతున్నప్పటికీ ప్రజల వినియోగానికి అవి సరిపోకపోవడంతో వ్యాపారులు కల్తీ పాలు తయారు చేయడంపై ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. వివి ధ రకాల రసాయనాలు కలిపి అసలు పాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా తయారుచేస్తున్నారు. వాటిని కొనుగోలు చేసి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనిని నివారించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి, పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు. లేదంటే ప్రజలు అనారోగ్యం బారిన పడకతప్పదని వాపోతున్నారు.

కూలి కూడా కిట్టడం లేదు..

పాడి పశువులను పెంచాలన్న కోరికతో ఐదారు పాడి గేదెలను మేపుతున్నాను. పచ్చిమేత కోసం పొలం కౌలుకు తీసుకుని పెంచుతున్నాను. ప్రతీ రోజూ మేత, దాణా కోసం ఎక్కువగా ఖర్చుపెడుతున్నాను. ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం రావడం లేదు. రోజూ వారి కూలీ పనికి వెళితే ఉదయం నుంచి సాయంత్రానికి 700 నుంచి 800 ఆదాయం వస్తుంది. పాడి పశువుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా ఆ మాత్రం కూలీ కూడా కిట్టడం లేదు. - కె.హనుమ, తీపర్రు

Updated Date - 2023-03-26T01:25:57+05:30 IST