Share News

క(న)ష్టాల గింజ!

ABN , First Publish Date - 2023-11-21T23:46:21+05:30 IST

కళ్లెదుటే బంగారంగా పంట కనబడుతోంది.. చేతి వరకూ పంట రావడంతో అన్నదాతకు ఆనందమే..ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవడం లేదు.ప్రకృతి ప్రకోపం కారణంగా చేతి వరకూ వచ్చింది..నోటిదాకా రావడంలేదు? ప్రతి ఏటా ఇంతే.

క(న)ష్టాల గింజ!
కొవ్వూరులో బరకాలు కప్పి ఉంచిన ధాన్యం

రెండు రోజులుగా మారిన వాతావరణం

చిరుజల్లులతో ఉరుకులు..పరుగులు

ఆందోళన చెందుతున్న అన్నదాతలు

అంతంతమాత్రంగా ధాన్యం కొనుగోళ్లు

ఇప్పటి వరకూ 33 వేల టన్నులే సేకరణ

దళారులను ఆశ్రయిస్తున్న వైనం

ఆరబెట్టకుండా బస్తా రూ.1200

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కళ్లెదుటే బంగారంగా పంట కనబడుతోంది.. చేతి వరకూ పంట రావడంతో అన్నదాతకు ఆనందమే..ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవడం లేదు.ప్రకృతి ప్రకోపం కారణంగా చేతి వరకూ వచ్చింది..నోటిదాకా రావడంలేదు? ప్రతి ఏటా ఇంతే. పంట చేతికొచ్చి,కోతలు కోసి,అమ్ముకునే సమయానికి ప్రకృతి వైపరీత్యం కారణంగా అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు.ఈసారి గట్టెక్కాం అను కునే లోపునే వరుణదేవుడు నేనున్నానంటూ వచ్చేస్తున్నాడు.. నష్టాల పాలు చేస్తున్నాడు. ఈ ఏడాది పంట ఎక్కువ పొలాల్లోనే ఉంది. పైగా కళ్లాల్లోనే ధాన్యం ఉంది. జిల్లాలో 72 వేల హెక్టార్లలో ఖరీఫ్‌ వరి సాగు చేయగా ఇప్పటి వరకూ 40 శాతం కోతలు పూర్తయ్యాయి. సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకూ దిగుబడి ఉందని చెబుతున్నారు. ఇందులో 2.52 లక్షల టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఇంత వరకూ కేవలం 33 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. మిల్లర్లు, బ్రోకర్లు కొంత కొను గోలు చేశారు. యంత్రాలతో కోతల వల్ల కోసిన ధాన్యాన్ని 17 శాతం కంటే తక్కువ తేమ వచ్చే వరకు నాలుగైదు రోజులు ఆరబెట్టాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు వేగవంతం అయ్యాయి. ఇదిలా ఉం డగా గత రెండు రోజు లుగా మబ్బులతో కూడిన వాతావరనం రైతులను బెం బేలెత్తిస్తోంది. దీపావళి ముందు నుంచి బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోణి ఏర్పడే ప్రమాదం ఉందని.. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చ రిస్తున్నప్పటికీ జిల్లా యంత్రాంగం,వ్యవసాయ శాఖ పట్టిం చుకున్నట్టు లేదు. కనీసం రైతులను అప్రమత్తం చేయ లేదు. దీంతో ఆకస్మికంగా వాతావరణం మారి కళ్లాలోని ధాన్యాన్ని తడిపేసింది. కొవ్వూరు నుంచి నల్లజర్ల వైపు వెళ్లే హైవే సర్వే రోడ్లలో వందల మంది రైతుల ధాన్యం గుట్టలు కనిపిస్తు న్నాయి.వానకు బరకాలు కప్పి, తాత్కాలిక రక్షణ ఏర్పా టు చేశారు. అక్కడక్కడా ఆరబోసిన ధాన్యం చెమ్మగిల్లింది. ఇంకా వాతావర ణం ఇలానే ఉంటే ధాన్యం తడిచిపోతుందని రైతులు ఆందోళనకు చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పచ్చిధాన్యం అనే పేరుతో 75 కేజీల బస్తాను రూ.1200 నుంచి 1250కు కొనేస్తున్నారు. వాస్తవా నికి రూ.1632లకు కొనుగోలు చేయాలి. దీంతో రైతులు నష్టపోతున్నారు.

గోకవరంలో కొనుగోళ్లే లేవు..

గోకవరం, నవంబరు 21 : వాతావరణంలో చోటు చేసు కున్న మార్పుల కారణంగా వరి పంటను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంట చేతికొచ్చే వేళ ఆకాశంలో మబ్బులు, చిన్నపాటి జల్లులు రైతులను బెంబే లెత్తిస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులను దళారీలు తమకు అనుకూలంగా మార్చుకుం టున్నారు. ప్రభుత్వం పచ్చి ధాన్యాన్ని తగిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తే తప్ప రైతులు కష్టాల నుంచి బయటపడే అవకాశం లేదు. ధాన్యం కొనుగోలు కేందాల్ర ద్వారా మండలంలో ఇంతవరకు ఒక్క ధాన్యపు గిం జను రైతులు నుంచి అధికారులు సేకరించిన దాఖలాలు లేవు. దీంతో రైతులు వేరే దారిలేక దళారీలను ఆశ్రయిస్తున్నారు.

దళారులకే ధాన్యం అమ్మకాలు

నల్లజర్ల,నవంబరు 21 : వాతావరణం మార్పుతో రైతులు తాము పండించిన వరి పంటను తక్కువ ధరలకే దళారులు విక్రయిస్తున్నారు. చేతికొచ్చిన పంటను కళ్ళాల్లో ఆరబెట్టుకునే దారిలేక పచ్చి ధాన్యాన్ని బయట వ్యక్తులకు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఆరబెట్టిన ధాన్యం ప్రస్తుతం బస్తా (75 కేజీలు) రూ.1672లు ఉండగా, పచ్చి ధాన్యం రూపంలో అదే ధాన్యాన్ని గోకవరంలో రూ.1100లు నుంచి రూ.1200లకు విక్రయించేస్తున్నారు. నల్లజర్లలో పచ్చి ధాన్యం బస్తా(75కిలోలు)రూ.1280, ఆరుదల బస్తా రూ1500లకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. దళారులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కేవలం బస్తాకు రూ172 మాత్రమే మార్జిన్‌ ఉండడంతో ఎక్కువ శాతం రైతులు దళారులకే విక్రయిస్తున్నారు.ధాన్యం కొనుగొలు కేంద్రాలకు రైతుల ముందుగా రవాణా ఖర్చు లు పెట్టుకుని,కూలీలను ఏర్పాటు చేసుకుని లోడ్‌ చేసి మిల్లర్లకు పంపించాలి.ఈ భాధలు పడలేక దళారులకే ఇచ్చేస్తున్నారు.

కష్టమూ..మిగలడం లేదు!

కడియం, నవంబరు 21 : ఆరు గాలం కష్టించి వ్యవసాయం చేస్తున్నాం. మాకు రెక్కల కష్టం కూడా మిగలడం లేదు. మాకు తెలిసింది ఇదే.. మేము చేయగలిగేది ఇదే.. ఇది తొలకరిపంట సాగు చేసి ప్రస్తుతం ధాన్యం విక్రయిస్తున్న రైతుల పరిస్థితి. వ్యవసాయ గణాంకాల ప్రకారం మండలంలో మొత్తం 4,700 ఎకరాల్లో రైతులు తొలకరి పంట వేశారు. స్వర్ణ రకంతో పాటు 1318 రకాన్ని సాగు చేశారు.ప్రస్తుతం మండలంలో సుమారు 60 నుంచి 70 శాతం కోతలు పూర్తయ్యాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. గత రెండు రోజులుగా ఉన్న మబ్బు వాతావరణం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. తు ఫాన్‌ హెచ్చరికల కారణంగా భయపడుతున్నారు.

తడిచినా.. నిబంధనలా!

సీతానగరం,నవంబరు 21 : రైతులకు మేలు చేస్తామని చెబుతున్న ప్రభుత్రం రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ రకరకాల ఆంక్షలు విధిస్తూ అన్నదాత లను తిప్పలు పెడుతున్నారు. ఆర్‌బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతు తాను పండించిన పంట అమ్ము కునేందుకు స్వతంత్రత లేకుండా పోయింది. 17 శాతం కంటే తేమ ఎక్కువ ఉండకూడదంటూ నిబంధనలు పెట్టారు. ఆర్‌బీకేల ద్వారా తేమ శాతం నిర్ధారణ చేసి మిల్లర్లకు పంపుతున్నారు. మిల్లర్లు మళ్లీ తేమ శాతం పరీక్షించి అధికంగా వచ్చిందంటూ ధాన్యం వెనక్కుపంపడం లేదా బస్తాకు ధర తగ్గించి ఇవ్వడం చేస్తున్నారు.ప్రస్తుతం సీతానగరం మండలంలో సాంబ పంట కోతలకు రావడంతో పంటచేలో ధాన్యం చేనువద్దే దళారీలకు విక్రయించుకుంటున్నారు. 75 కేజీల బస్తా రూ.1300 నుంచి రూ.1600 మధ్య విక్రయిస్తున్నారు.ప్రభుత్వం సాంబ మసూరి కొనుగోలు చేయకపోవడంతో రైతులు బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. చినుకు పడిన సమయంలో తేమశాతం 17 కంటే తక్కువ ఉండాలంటే ఎలా వీలవు తుందని రైతులు అంటున్నారు.

ఆర్‌బీకేల కన్నా..దళారులే బెటర్‌..

గోపాలపురం, నవంబరు 21 : దళారీ వ్యవస్థను నిర్మూలించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటూ ప్రభుత్వం వరి రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. గతంలో వరి మాసూళ్ల సమయంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ద్వారా కళ్లాలు ఏర్పాటు చేసి టార్ఫాలిన్లు సరఫరా చేసేవారు. కాల క్రమేణా అది కనుమరుగైంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రూ.1600 మద్దతు ధర పలుకుతుందని రైతులను నమ్మ బలికి తేమ, హమాలీలు, రవాణా, తదితర సాకులతో రైతుల కష్టాన్ని రైస్‌ మిల్లర్స్‌తో సహా దోచేస్తున్నారు. కాలం కలిసి రాక అకాల వర్షాలు పడితే రంగు మారిన ధాన్యం పేరుతో అతి తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారు.దీంతో ఈ ఏడాది రైతులు ముందస్తుగా దళారీలనే ఆశ్రయిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా రైతులు చేలు మీదే దళారులకు బస్తా రూ.1270 నుంచి రూ.1300ల వరకు విక్రయిస్తున్నారు. నష్టం వచ్చినా దళారులకు ధాన్యం అప్పగించి కళ్లెం వద్ద సొమ్మును దక్కించుకుని హమ్మయ్యా అనుకుంటున్నారు. ప్రభుత్వం ధాన్యం కొను గోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని విక్రయిస్తే తరుగులు పోనూ అసలు రైతుల ఖాతాలో డబ్బులు ఎన్ని రోజులకు పడతాయో అనే అనుమానం రైతులను వెంటాడుతుంది. దీంతో ఆర్‌బీకేల కన్నా దళారులే నయం అన్నట్టు రైతులు భావిస్తున్నారు.

రెక్కల కష్టం తప్ప.. మాకు మిగిలేదేమీ లేదు!

నేను 10 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. నారు వేసిన నాటి నుంచి కోత కోసి ధాన్యం విక్రయించే వరకు అయ్యే ఖర్చు చూస్తే మిగిలేదేమీలేదు. రెక్కల కష్టమే మిగులుతోంది. కూలీల ఖర్చులు పెరిగిపోతున్నాయి. సాగు చేయడం కష్టంగా మారింది. ఈ పంట కాకపోతే మరో పంటకైనా దిగుబడి పెరుగుతుంది.. నష్టాల నుంచి బయటపడవచ్చని ఆశిస్తున్నాం. అయితే ఏ పంట చూసినా ఇంతే.. నష్టాలు తప్పడంలేదు.

- ఆకుల సుబ్బారావు, రైతు, కడియం

ప్రభుత్వ గొడౌన్లు ఏర్పాటు చేయాలి..

కౌలు రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వ గొడౌన్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చినుకు పడిందంటే మా పరిస్థితి అయోమ యంగా మారిపోతోంది. ఆరుగాలం శ్రమ వృథా అయిపోతుంది. సార్వాలో 30 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తుంది. పెట్టుబడులు పెరిగిపోవడంతో గిట్టుబాటు కావడంలేదు. ప్రభుత్వ మద్దతు ధర 75 కిలోలకి రూ.1632 ఇస్తుంది. మద్దతు రూ.2 వేలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది. ఏ పనీ చేయలేక వ్యవసాయం చేస్తున్నాం.

- కడలి చిరంజీవి, కౌలు రైతు, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం

ఆర్‌బీకేలలో అమ్మితే నరకయాతన..

ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మడం కన్నా దళారులను నమ్ముకోవడమే మేలు. గత నాలుగేళ్ళుగా డబ్బు లు సక్రమంగా అందక నరకయాతన అనుభ వించా.ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోళ్లు లేక.. దళారులకు బస్తా రూ.1500లకు విక్రయించాం.. సొమ్ములు చేతికందాయి. ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించి నరకయాతన అనుభవించాం. ప్రస్తుతం ప్రాణం హాయిగా ఉంది.

- సత్తి సత్తిరెడ్డి, రైతు పొలమూరు, అనపర్తి మండలం

Updated Date - 2023-11-21T23:46:24+05:30 IST