ఉద్యోగం సరే.. జీతమేది!
ABN , First Publish Date - 2023-06-26T00:52:55+05:30 IST
అందరూ 55 ఏళ్లు పైబడిన వారే.. ప్రభుత్వ ఉద్యో గం అంటే ఎగిరిగంతేశారు.. అవకాశం వచ్చింది కదా అని అందరూ జాయి నైపోయారు..
58 రోజులుగా అందని వేతనాలు
అయోమయంలో డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులు
కోరుకొండ, జూన్ 25: అందరూ 55 ఏళ్లు పైబడిన వారే.. ప్రభుత్వ ఉద్యో గం అంటే ఎగిరిగంతేశారు.. అవకాశం వచ్చింది కదా అని అందరూ జాయి నైపోయారు.. అయితే వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా ఒక్కటే.. జీతాలు ఎప్పుడు సక్రమంగా ఇచ్చింది కనుక.. 1998 డీఎస్సీ ఉపాధ్యాయులకు అంతే పరిస్థితి. మొదటి నెల నుంచే పెండింగ్.. గత విద్యా సంవత్సరం ముగిసినా నేటికీ జీతాలు పడలేదు. ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనం నేటికీ అందక పోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 280 మంది 1998 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 25 ఏళ్ల పాటు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు న్యాయస్థానాల్లో సుదీర్ఘపోరాటం చేసిన వీరిని ప్రస్తుత ప్రభుత్వం గత ఏప్రిల్ 12వ తేదీన విధుల్లోకి తీసుకుంది. వీరి నివాస స్థానం నుంచి 200 కిలోమీటర్లు దూరం వరకు విస్తరించి ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో నియమించారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో 50 ఏళ్లు పైబడిన వయ సులో విలీన మండలాల్లోని గ్రామాల్లోకి కూడా చాలా మంది వెళ్లి విధుల్లో చేరారు. అయితే వీరందరిని ఏప్రిల్ 30న విధుల నుంచి తొలగించారు. ఇప్పటికీ 58 రోజులు అవుతున్నా వీరు పని చేసిన కాలానికి వేతనం ఇవ్వలేదు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ తిరిగి వీరిని విధుల్లోకి తీసుకోలేదు. 98 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు.