నేడు నరసన్న కల్యాణం

ABN , First Publish Date - 2023-03-02T23:37:16+05:30 IST

నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన స్వయంభు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు గురువారం రాత్రి ఆలయ ముఖ మండపంలో ఘనంగా ప్రారంభమ య్యాయి.

నేడు నరసన్న కల్యాణం
విద్యుత్‌ దీపాల అలంకరణ

కోరుకొండ, మార్చి 2: నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన స్వయంభు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు గురువారం రాత్రి ఆలయ ముఖ మండపంలో ఘనంగా ప్రారంభమ య్యాయి. అంతకు ముందు మంగళవాయిద్యాలు, మేళతాళాలతో ప్రత్యేక పల్లకిలో శ్రీచక్ర పెరుమాళ్ళను తీసుకుని దేవుడి కోనేటి వద్దకు వెళ్లి శాస్త్రోక్తంగా పుస్తక పూజలు చేసి పుట్టమన్ను సేకరించారు. అనంతరం ఆలయం వద్ద అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు, వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం పాణింగపల్లి పవన్‌కుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో అనువంశిక ధర్మకర్త ఎస్‌వీ రంగరాజభట్టర్‌ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్నవరం దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆలయం వద్ద పోలీస్‌ ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోరుకొండ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచామని ఎస్‌ఐ శారదా సతీష్‌ తెలిపారు. అన్నవరం దేవస్థానం జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌.మూర్తి ఆధ్వర్యంలో అన్నవరం నుంచి స్వామి వారి కల్యాణోత్సవాల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది తరలివచ్చారు. దేవదాయ ధర్మదాయశాఖ నుంచి ఉత్సవాలకు కొంత మంది సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించారు.

నేడు రథోత్సవం.. కల్యాణం

రథోత్సవం శుక్రవారం మధ్యాహ్నం 1.56 గంటలకు నిర్వహించనున్నారు. రథోత్సవానికి ముందు స్వామి వారిని పెండ్లి కుమారుడు, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించి ప్రత్యేక పల్లకిలో మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య తోడ్కొని వచ్చి రథంపై ఆశీనులు గావిస్తారు. రథానికి ప్రత్యేక పూజలు చేసి వేలాది మంది భక్తులు గోవిందనామ స్మరణ మధ్య స్వామి వారి దేవస్థానం నుంచి రథోత్సవం బయలు దేరుతుంది. రాత్రి 9 గంటలకు స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మేరకు స్వామి కల్యాణ మండపాన్ని విశేష పుష్ప అలంకరణలతో సిద్ధం చేశారు. రథోత్సవం అనంతరం ఎదుర్కోలు సన్నాహంతో నూతన వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు సమర్పించి మేళ తాళాలతో స్వామి వారిని, అమ్మవారిని రథం పైనుంచి ప్రత్యేక పల్లకిలో ఆలయానికి తోడ్కొని వస్తారు. రాత్రి 8 గంటల సమయంలో మంగళస్నానం నిర్వహించి కల్యాణ మహోత్సవాలకు సిద్ధం చేస్తారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి కల్యాణం నిర్వహిస్తారు.

Updated Date - 2023-03-02T23:37:16+05:30 IST