భూస్వామి నరసన్నకు భుక్తి కరువాయె!
ABN , First Publish Date - 2023-03-18T00:52:16+05:30 IST
బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయన్న నానుడి మనుషు లకే కాదు.. కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామికి తప్పలేదు. ఆలయంలో లక్ష్మి ఉంది తప్ప.. ఆ దేవుడికి లక్ష్మి లేకుండా పోయింది.
నాడు పెద వెంకన్నకే ఆర్థిక సాయం
నేడు అన్నవరానికి దత్తుడు
దిగజారిన నరసన్న ఆదాయ పరిస్థితి
ఉత్సవాలకు అన్నవరంపై ఆధారం
కష్టంగా ధూపదీప నైవేద్యాలు
ప్రభుత్వ ఆధీనంలో భూమి
ఏడాదికి రూ.5 వేలు చెల్లించని వైనం
15 ఏళ్లుగా అందని సొమ్ములు
కనుమరుగైన నాటి వైభవం
బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయన్న నానుడి మనుషు లకే కాదు.. కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామికి తప్పలేదు. ఆలయంలో లక్ష్మి ఉంది తప్ప.. ఆ దేవుడికి లక్ష్మి లేకుండా పోయింది..ఒకనాడు ఆ ఆలయం నుంచి పెద్ద తిరుపతి వేంకటేశ్వరుడికి పట్టు వస్ర్తాలు సమర్పించేవారు. ఆలయ నిర్వహణకు ఆర్థిక సహాయం చేసేవారు. ఎందుకంటే నాడు వేల ఎకరాలు ఆయన సొంతం..మరి నేడు అంతా పోయి కేవలం 15 ఎకరాలు మిగిలింది..ఆ భూమి అంతా ఏమైపోయిం దంటే.. ఏం చెబితే ఏమైపోతుందోననే భయంతో ఎవరు నోరు మెదపడం లేదు.. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన స్వామి మాత్రం ధూప దీప నైవేద్యాలకు వందేళ్ల చరిత్ర కలిగిన అన్నవరం దేవస్థానంపై ఆధారపడి కాలం వెళ్లదీస్తు న్నారు..ఇటీవల కోరుకొండలో జరిగిన కల్యాణోత్సవాలకు అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో రూ.25 లక్షలు ఖర్చు పెట్టారు. ఇలా స్వామికి ఏం చేయాలన్నా అన్నవరంపై ఆధారపడాల్సిన దుస్థితికి తెచ్చారు.
కోరుకొండ, మార్చి 17 : పేరు కోరుకొండ.. అంటే కోరిన కోర్కెలు తీర్చే కొండ.. ఆ కొండపై ఉన్న స్వామి లక్ష్మీ నరసింహస్వామి..ఆ స్వామి ఎవరి కోర్కెలు తీర్చాడో ఏమో కానీ..ఒకనాడు వేలాది ఎకరాలు ఆయన సొంతం.. ఎవరి జీవితంలోనైనా లక్ష్మి ఉంటేనే కదా ఆడంబరమైనా.. సంబరమైనా..ఆయనకూ అదే జరిగింది .. లక్ష్మి ఉన్నంత సేపు స్వామి వెలిగిపోయారు.. ఒకనాడు వేలాది ఎకరాల భూమి కలిగి భూ స్వామిగా పిలిపించుకున్న నరసన్న..ఆ భూమి అంతా కరిగిపోతూ కేవలం 15 ఎకరాలకు చేరారు.నిత్య దీప ఽధూప నైవేద్యా లకు గత 12 ఏళ్లుగా అన్నవరం దేవస్థానానికి దత్తుడిగా వెళ్లిపోయారు. అన్నవరం దేవస్థానం దయా దాక్షిణ్యా లపై కల్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలను జరిపించుకో వాల్సిన దయనీయ పరిస్థితి వచ్చింది.
1959లో ప్రభుత్వ స్వాధీనం..
1959లో ఎస్టేట్ అండ్ ఎబాస్‌మెంట్ యాక్ట్ పేరుతో ప్రభుత్వం నరసింహస్వామి భూములను, అటు రంగ నాఽథస్వామి భూములు స్వాధీనం చేసుకుని కేవలం 15 ఎకరాల భూమిని మాత్రమే స్వామి వారికి మిగిల్చారు. రెడ్డిరాజులు స్వామి వారి ధూపదీప నైవేద్యాలకు వెయ్యి ఎకరాల భూమి శతాబ్దాల కిందటే శిలాశాసనంపై రాసి ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి. ఒకప్పుడు స్వామి వారి సేవ నిమిత్తం 72 మందికి నౌకరీలకు ఈనం పట్టాలు కింద 880 ఎకరాల భూమి ఇచ్చారంటే స్వామి చరిత్ర ఏ పాటితో అర్ధమవుతుంది. క్రీస్తుశకం 1902 సర్వే ప్రకారం కోరుకొండలో స్వామి వారి భోగాలకు 311 ఎకరాలు, సేవా మాన్యాలకు సుమారు 900 ఎకరాలు, రంగనాథ స్వామి వారికి భూప తిపాలెంలో సుమారు 1150 ఎకరాలు ఉన్నట్టు చరిత్ర. క్రీ.శ 1964లో ఈనాం రద్దు శాసనం ఫలితంగా స్వామి వారికి వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వానికి చెందింది. ఫలితంగా స్వామికి నష్టపరిహారంగా ప్రతి సంవత్సరం రూ.5 వేలు ఇచ్చే వారు.అదీ గత 15 ఏళ్లగా రావడం లేదు.
ఆ రోజులు మళ్లీ రావాలి..
వెయ్యేళ్ల చరిత్ర కలిగి 1909.17 ఎకరాల భూమి కలిగి ఉండి శ్రీనాథ కవి సార్వభౌముడు, కవి సామ్రాట్ విశ్వనాఽథ సత్యనారాయణ వంటి మహోన్నతులతో కీర్తిం పబడి 72 నౌకరీలు కలిగి నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం,మాసోత్సవం, వసంతోత్సవం, బ్రహ్మోత్స వాల తో తిరుపతి వెంకటేశ్వరస్వామికి ధీటుగా వెలు గొందిన కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహస్వామి వారికి పూర్వ వైభ వంగా తీసుకురావాలని స్వామి గత వైభ వాన్ని చూసిన భక్తులు కోరుతున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు కోరుకొండ లక్ష్మినరసింహస్వామి వారికి చెందిన 880 ఎకరాల సేవా మాన్యాలు ఎన్ని చేతులు మారినప్ప టికీ తిరిగి స్వామి వారికే చెందుతాయని ఆ భూము లపై గత 8 ఏళ్ళగా క్రయ విక్రయాలు నిలిపివేశారు. అదే కోవలో స్వామి వారికి చెందిన 313 ఎకరాలపై కూడా క్రయ విక్రయాలు నిలిపివేశారు.
ఇదీ నరసన్న ఆస్తుల చిట్టా
ఒకప్పుడు 1909.17 ఎకరాలు భూమి కలిగి భూస్వామి నరసన్నగా పేరు తెచ్చుకున్న స్వామి వారు నేడు కేవలం 15 ఎకరాలకు పరిమితమయ్యారు. 1924లో శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన ప్రభుతాంధ్ర పత్రికలో పేర్కొన్న విధంగా శ్రీ లక్ష్మినరసింహస్వామి వారికి గ్రామకంఠంలో ధర్మచెరువు వంటివి 423.57 ఎకరాలు స్వామి వారి పేరున 313.18 ఎకరాలు, స్వామి వారి సేవా మాన్యం కింద 880.41 ఎకరాలు. మొత్తంగా కోరుకొండ గ్రామంలో సర్వ అగ్రహారం కింద 1617.16 ఎకరాలు కలిగి ఉన్నారు.అచ్యుతాపురం, కాపవరం, నర్సాపురం, శ్రీరంగపట్నం, యర్రంపాలెం, గోకవరం, మునగాల, ధవళేశ్వరం గ్రామాల్లో 150 పట్టాల ద్వారా స్వామి వారికి మరో 75 ఎకరాలు భూమి కలిగి ఉన్నారు.శ్రీరంగనాథ స్వామి వారికి భూపతిపాలెం గ్రామాన్ని సర్వ అగ్రహారంగా ఇచ్చి 1100.26 ఎకరాలు ఆ నాటి రెడ్డి రాజులు శిలాశాసనంపై రాయించి ఇచ్చా రు.కోరుకొండ గ్రామం మొత్తం నరసింహస్వామి వారికి భూపతిపాలెంను రంగనాథ స్వామి వారికి సర్వ అగ్రహారాలుగా ఇవ్వబడ్డాయి. ఇది కాకుండా కోరుకొండ శివారు గ్రామంలో 217 ఎకరాల భూమి నరసింహ స్వామికి చెందిందని 1957లో మద్రాసు హై కోర్టు తీర్పు ఇచ్చింది. శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి దర్శించుకు నేందుకు వచ్చే భక్తులకు నిత్యా న్నదానం చేయడానికి గిరిజాల వెంకట రెడ్డి పంతులు 168 ఎకరాల భూమిని స్వామి వారికి రాయించి ఇచ్చారు. దీంట్లో మాగాణి భూమి 43.11 ఎకరాలు కాగా మెట్ట భూమి 85.21 ఎకరాల భూమిగా ఆనాడు పేర్కొన్నారు.
నాడు పెద వెంకన్నకే సాయం..
1909.17 ఎకరాలతో రాష్ట్రంలో అత్యంత ధనికుడిగా ఉన్న ్జకోరుకొండ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం నుంచి ఒకప్పడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆర్థిక సహాయం, పట్టుబట్టలు వెళ్లేవంటే స్వామి వైభవం ఏ పాటిదో అర్ధమవుతుంది. అలాంటి నరసింహస్వామి ఈ నాడు తిరుపతి,అంతర్వేది, అన్నవరం దేవస్థానాల నుంచి కోరుకొండకు పట్టువస్త్రాలు రావడం, వందేళ్ల చరిత్ర కలిగిన అన్నవరం దేవస్థానానికి వెయ్యేళ్ల చరిత్ర కలిగిన నరసింహస్వామి వారు దత్తుడై నిత్యదీప దూప నైవేద్యాలకు ఆధారపడా ల్సిన దయనీయ పరిస్థితి వచ్చింది.