కోడి పందేలకు సై..గుండాటలకు నై
ABN , First Publish Date - 2023-01-15T00:00:06+05:30 IST
ప్రజాప్రతినిధులు పోరాడి సాధించుకున్న కోడి పందేల బరుల వద్ద గుండాట, పేకాట, రికార్డింగు డ్యాన్సులకు అనుమతి లేకపోవడంతో పందెం బరులు వెలవెలబోయాయి. పందేలు కాసేవారు గానీ, చూసేవారు గానీ బరుల వద్దకు రాకపోవడంతో భోగి రోజున ప్రారంభమైన బరుల ప్రాంగణాలన్నీ జనాదరణ లేక వెలవెలబోయాయి.
కోనసీమలో బరులు వెలవెల
(అమలాపురం-ఆంధ్రజ్యోతి):ప్రజాప్రతినిధులు పోరాడి సాధించుకున్న కోడి పందేల బరుల వద్ద గుండాట, పేకాట, రికార్డింగు డ్యాన్సులకు అనుమతి లేకపోవడంతో పందెం బరులు వెలవెలబోయాయి. పందేలు కాసేవారు గానీ, చూసేవారు గానీ బరుల వద్దకు రాకపోవడంతో భోగి రోజున ప్రారంభమైన బరుల ప్రాంగణాలన్నీ జనాదరణ లేక వెలవెలబోయాయి. ఎట్టి పరిస్థితుల్లోను గుండాటలు, పేకాటలు రికార్డింగు డ్యాన్సులకు అనుమతివ్వాలంటూ ఆయా గ్రామాలకు చెందిన వైసీపీ నేతలు పోలీసులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆదివారం నుంచి బరుల వద్ద అన్ని హంగులు ఉంటాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తొలిరోజు పెద్దగా పందేలు జరగలేదు. పందెం బరుల వద్ద గుండాట, పేకాటల నిర్వహణకు పోలీసులు ససేమిరా అంగీకరించకపోవడంతో నిర్వాహకులు ఆదాయాలకు భారీగా గండి పడింది. దాంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రారంభమైన కోడి పందేల బరులకు పందెంరాయుళ్ల నుంచి పెద్దగా ఆదరణ లేకపోవడంతో నిర్వాహకులు కుదేలయ్యారు. కోనసీమలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి ఈసారి పండుగల్లో నిర్వహించే జూద క్రీడలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు భేటీ అయి ప్రభుత్వ పెద్దలను ఒప్పించి జూద క్రీడలు లేకుండా పందెంబరులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి సాధించుకున్నారు. దాంతో జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ప్రాంతాల్లో హడావిడిగా పందెం బరులు ఏర్పాటుచేశారు. ఉదయం నుంచి పందేలు కాసేవారి కోసం నిర్వాహకులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడడంతో జిల్లాలో అనేక చోట్ల పందెం బరులన్నీ వెలెవెలబోయాయి. అమలాపురం రూరల్ మండలం సమనసలో బరులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు రాకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో పందెం బరుల వద్ద గుండాటలు నిర్వహించేందుకు బోర్డులు ఏర్పాటు చేస్తుండగా ఎస్‌ఐ శ్రీనివాస్‌నాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది అడ్డుకుని పందేలు, గుండాటలు కూడా నిలిపివేశారు. రావులపాలెంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎస్‌ఐ సురేంద్రపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రైవేటు స్థలం, ఇక్కడ మీకు పనేంటి బయటికి పోండంటూ ఎస్‌ఐపై వీరంగం చేశారు. కేసులు ఉంటే నాపై పెట్టాలంటూ ఎస్‌ఐ జబ్బపై చేయివేసి బయటకు పంపించేశారు. వెంటనే కార్యకర్తలు ఎమ్మెల్యే చిర్ల జిందాబాద్ అంటూ పెద్దపెట్టున నినాదాలిచ్చారు. కాట్రేనికోన మండలం గెద్దనాపల్లిలో గుండాటలు లేకపోతే ఆదివారం నుంచి కోడి పందేలు నిలిపి వేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఇదే పరిస్థితి జిల్లాలో అనేక చోట్ల నెలకొంది. ఎస్పీ ఆదేశాలతో గుండాటలు, పేకాటలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టడంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని పొదలాడలాడను ఆనుకుని పశ్చిమగోదావరి జిల్లాలోకి వచ్చే స్థలంలో కోడి పందేలతో పాటు గుండాటలు, పేకాటలు శనివారం భారీగా నిర్వహించారు. వేల సంఖ్యలో ప్రజలు హాజరైనప్పటికీ సరిహద్దు వివాదంతో చాకచక్యంగా జిల్లా పోలీసులు తప్పించుకున్నారు. పొదలాడ లాకు వద్ద ఇటీవల నిర్మించిన వంతెన పైనుంచి వేల సంఖ్యలో జూద క్రీడల్లో పాల్గొంనేందుకు భారీగా వెళుతున్నప్పటికీ అక్కడ పోలీసులు ఆంక్షలు విధించలేదు. ఏటిగట్టు చెంతనే పెదలంక ప్రాంతం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి రావడం పందెం నిర్వాహకులకు అన్నివిధాలా కలిసొచ్చింది. నిర్వాహకులు మాత్రం రాజోలు ప్రాంతంవారే. ఇక రాజోలు దీవిలో పండుగ రోజుల్లో రాత్రి వేళల్లో రికార్డింగు డ్యాన్సులు జోరుగా సాగేవి. అలాగే ప్రభల తీర్థాల ముసుగులో కూడా జరిగే డ్యాన్సులను పోలీసులు కట్టడి చేస్తున్నారు. తొలిసారిగా జిల్లా ఎస్పీ హెచ్చరికలతో సంప్రదాయ కోడి పందేలకు మాత్రం అనుమ తించినప్పటికీ ప్రజలు, పందెంరాయుళ్ల నుంచి తొలిరోజు ఆశించిన స్పందన రాకపోవడంతో కొన్నిచోట్ల బరులను వదిలేసి నిర్వాహకులు చేతులెత్తేశారు. బరుల వద్ద రూ.2 వేల నుంచి రూ.20 వేల లోపులోనే పందేలు కాసినట్టు తెలిసింది. గుండాటలు, రికార్డింగు డ్యాన్సులపై పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ అవి ఏ స్థాయిలో అమ లవుతాయనేది జిల్లా ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది.