ఖరీఫ్‌కు సాగునీరందేనా...?
ABN , First Publish Date - 2023-06-16T01:25:50+05:30 IST
రాజవొమ్మంగి మండలంలో మడేరు, వట్టిగెడ్డ రిజర్వాయర్‌లను ఆనుకొని సుమారు 6000 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఈ రిజర్వాయర్‌ల నుంచి వచ్చే నీరు మాత్రం పొలాలకు చేరట్లేదు. పంట కాలువలకు ఉన్న గండ్లు పూడ్చాలని ఆయకట్టు భూమి రైతులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేడు.
ప్రతీ ఏడాది ప్రతిపాదనలు పంపడమే అధికారుల పని
రైతులు, ప్రజాప్రతినిధులు చందాలు వేసుకుంటేనే పనులు
పట్టించుకోని అధికారులు
రాజవొమ్మంగి, జూన్ 15: రాజవొమ్మంగి మండలంలో మడేరు, వట్టిగెడ్డ రిజర్వాయర్‌లను ఆనుకొని సుమారు 6000 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఈ రిజర్వాయర్‌ల నుంచి వచ్చే నీరు మాత్రం పొలాలకు చేరట్లేదు. పంట కాలువలకు ఉన్న గండ్లు పూడ్చాలని ఆయకట్టు భూమి రైతులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేడు.
ప్రతిఏటా పలు మరమ్మతులకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపడమే చిననీటిపారుదలశాఖ అధికారుల పనిగా మారడంతో మండలంలోని పొలాలకు సాగునీరు అందించే యోచనలో లేరని రైతులు మండిపడుతున్నారు. పంట పొలాలకు సాగునీరు అందాలంటే ప్రతిఏటా రైతులు, ప్రజాప్రతినిధులు సొంతంగా డబ్బులు వేసుకొని పంట కాలువ పూడికతీత, తదితర పనులు చేసుకుంటున్నారు. అప్పలరాజుపేట గ్రామంలో ఉన్న వట్టిగెడ్డ రిజర్వాయర్ ద్వారా సుమారు 7కిలోమీటర్ల మేర రాజవొమ్మంగి, దూసరపాము, తంటికొండ, వట్టిగెడ్డ, డి.మల్లవరం గ్రామాల్లో ఉన్నటువంటి పంటపొలాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ ఐదు గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1472 ఎకరాల్లో సాగు జరుగుతుందని చెబుతున్న సుమారు 3000 ఎకరాలలో పంట సాగవుతుందని రైతులు చెబుతున్నారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ నుంచి పంట పొలాలకు వెళ్లే ప్రధాన కాలువ ప్రారంభంలోనే గండ్లు ఉండడం, సాగునీటి కాలువ గ్రామాల మధ్యలో ఉండడంతో వ్యర్థాలతో కాలువ మూసుకుని పంట పొలాలకు సాగునీరు అందట్లేదు. ప్రతి ఏడాది ఇదే సమస్య రైతులకు ఎదురవడంతో దూసరపాము, రాజవొమ్మంగి రైతులు, ప్రజాప్రతినిధులు చందాలు వేసుకొని పనులు చేయించుకోవడం పరిపాటిగా మారింది. 2021లో సుమారు లక్ష 70వేల రూపాయలతో తాత్కాలికంగా గండ్లు పూడ్చే పనులు పూర్తిచేయమని అప్పటి ఐటీడీఏ పీవో ఆదేశాలు ఇచ్చిన ఆ పనులు ఇప్పటికీ జరగలేదు. అదే సమయంలో జడ్డంగి మడేరు అనకట్టకు గేట్ల రిపేరుకు సుమారు 4లక్షల రూపాయలతో పనులు చేసినా ఇప్పటికీ కాంట్రాక్టర్‌కు బిల్ అవ్వలేదు. దీంతో చిన నీటిపారుదలశాఖ కాంట్రాక్ట్ పనులు అంటే బిల్లులు అవ్వవు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా రాజవొమ్మంగి మండలంలో పంటకాలువలకు పూడికతీత, గండ్లు పూడ్చడం తదితర పనులు పూర్తిచేసేల ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.