నేటి నుంచి కార్తీకం
ABN , First Publish Date - 2023-11-14T00:23:52+05:30 IST
శివ, కేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, వైష్ణవ దేవాలయాలను ముస్తాబు చేశారు. 30 రోజుల పాటు కార్తీక పూజలు చేస్తారు.
రాజమహేంద్రవరం సిటీ/ బిక్కవోలు, నవంబరు 13: శివ, కేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, వైష్ణవ దేవాలయాలను ముస్తాబు చేశారు. 30 రోజుల పాటు కార్తీక పూజలు చేస్తారు. ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుం డా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పవిత్రగోదావరి నదీ తీరం రాజ మహేంద్ర వరం, కొవ్వూరులో ప్రధాన ఘాట్లన్నీ శుభ్రం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి కార్తీక మాసం ఆరంభం సందర్భంగా పుణ్యనదుల్లో సాన్నమాచరించి కార్తీక దీపాలు వదిలి, మహాశివుడి దర్శనం చేసుకుంటారు. జిల్లాలో రాజమహేంద్రవరంతో పాటు సీతానగరం, రామ చంద్రపురం, బొబ్బిల్లంక, ములకల్లంక, వెంకటనగరం, కాతేరు, ధవళేశ్వరం, వేమగిరి, కొవ్వూరు, తాళ్ళపూడి, ఔరంగాబాద్, ఆరికరేవులు, విజ్జేశ్వరం, పెరవలి మండలం తీపర్రు తదితర గోదావరి రేవుల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక స్నానాలు ఆచరిస్తారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని రేవులను అధికారులు సిద్ధం చేయించారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనం కోసం కోటిలింగాలరేవు, చింతాలమ్మఘాట్, పుష్కరాలరేవు, టీటీడీ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్, ధవళేశ్వరంలోని రామపా దాల రేవు, సుబ్బాయమ్మ ఘాట్, కొవ్వూరు గోష్పాదాలరేవులు సిద్ధం చేశారు.జిల్లాలో రాజమహేంద్రవరంలో ప్రధానంగా దక్షిణ కాశీగా పిలవబడే కోటిలింగాల క్షేత్రంలో ఉమాకోటిలింగేశ్వరస్వామి, గోదావరి బండ్ రోడ్డులోని ఉమా మార్కండేయస్వామి, టి.నగర్‌లోని విశ్వేశ్వరాలయం, గోదావరి ఒడ్డున ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం,క్వారీ సెంటర్‌లోని కళ్యాణసమేత సోమలింగేశ్వరాలయం, సారం గధరేశ్వరాలయం, జాంపేట లోని ఉమారామలింగేశ్వరాలయాలు ఉన్నాయి. ఆలయాల్లో మంగళవారం వేకువజాము నుంచే అర్చనలు,అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక బిక్కవోలులో 1100 వందల ఏళ్ల చరిత్ర గల ప్రాచీన గోలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. త్రిలింగ క్షేత్రంగా పేరు. భక్తుల దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ ఆకెళ్ల భాస్కర్ తెలిపారు. ఈ మాసం అంతా తెల్లవారుజాము నుంచే భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు.