ప్రశాంతంగా పోలీస్‌ కానిస్టేబుల్స్‌ రాత పరీక్ష

ABN , First Publish Date - 2023-01-23T01:02:16+05:30 IST

కాకినాడ జేఎన్టీయూకేలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఏపీ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్‌ కానిస్టేబుల్స్‌ రాతపరీక్ష రాష్ట్రవ్యాప్తంగాను, జిల్లాలోను ప్రశాంతంగా జరిగినట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. క్యాంపస్‌లోని పరీక్షా కేంద్రాలను వీసీ ప్రసాదరాజు, కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు, ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌తో కలిసి పరిశీలించారు.

ప్రశాంతంగా పోలీస్‌ కానిస్టేబుల్స్‌ రాత పరీక్ష
కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాసేందుకు వెళ్తున్న అభ్యర్థులు

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జేఎన్‌టీయూకే వీసీ

జేఎన్టీయూకే, జనవరి 22: కాకినాడ జేఎన్టీయూకేలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఏపీ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్‌ కానిస్టేబుల్స్‌ రాతపరీక్ష రాష్ట్రవ్యాప్తంగాను, జిల్లాలోను ప్రశాంతంగా జరిగినట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. క్యాంపస్‌లోని పరీక్షా కేంద్రాలను వీసీ ప్రసాదరాజు, కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు, ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు 5,03,487మంది హాజరుకావాల్సి ఉండగా 4,58,219మంది అభ్యర్థులు హాజరయ్యారని, 45,268మంది పరీక్ష రాయలేదన్నారు. మొత్తం 91.01శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాశారన్నారు. జేఎన్టీయూకేలోని యూసీఈకేలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1641మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 1469మంది హాజరయ్యారని, 172మంది గైర్హాజరయ్యారని వీసీ తెలిపారు. రాతపరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్‌ అధికారులను, ప్రాంతీయ సమన్వయకర్తలకు, అధ్యాపక, అఽధ్యాపకేతర సిబ్బందికి కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు కృతజ్ఞతలు తెలిపారు.

పది నిమిషాల ఆలస్యం.. అనుమతివ్వని అధికారులు

పోలీస్‌ కానిస్టేబుల్స్‌ రాత పరీక్షకు జేఎన్టీయూకే పరీక్షా కేంద్రానికి ఇద్దరు విద్యార్థినులు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా అప్పటికే సమయం 10 గంటల 10 నిమిషాలు కావడంతో పోలీసులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఆ విద్యార్థినులు తాము అనకాపల్లినుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చామని ఆ ట్రైన్‌ ఆలస్యం కావడంతో తమకు ఆలస్యమైందని ఏఎస్పీకి మొరపెట్టుకున్నప్పటికీ అనమతిలేదని వారిని వెనక్కి పంపించారు. దీంతో ఇద్దరు విద్యార్థినులు నిరాశతో వెనుదిరిగారు.

జిల్లావ్యాప్తంగా 90.28శాతం హాజరు

కాకినాడ క్రైం, జనవరి 22: పోలీస్‌ కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్ష కాకినాడ జిల్లావ్యాప్తంగా 59 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో మొత్తంగా 30,184మంది అభ్యర్థులు అనగా 24,273 మంది పురుషులు, 5,911మంది మహిళలు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 27,249మంది 90.28శాతం హాజరయ్యారు. వారిలో పురుష అభ్యర్థులు 22,289మంది 91.83శాతం, మహిళా అభ్యర్థులు 4,960 మంది 83.91శాతం పరీక్షకు హాజరయ్యారు. 1953మంది పురుష అభ్యర్థులు, 951 మంది మహిళా అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షా కేంద్రాలను ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, అడ్మిన్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత పరీక్ష పారదర్శకంగా నిర్వహించామన్నారు.

Updated Date - 2023-01-23T01:02:18+05:30 IST