రిక‘వర్రీ’!

ABN , First Publish Date - 2023-03-26T00:34:49+05:30 IST

జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులు డిపాజిటర్లనుంచి కోట్లాది డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసి దాదాపు ఏడాది కావస్తోంది. రూ.582కోట్ల ఆర్థిక మో సానికి పాల్పడిన చైర్మన్‌, వైస్‌చైర్మన్లతోపాటు ఇప్పటికే సీఐడీ అధికారులు ఏడుగురిని అరెస్ట్‌ చేయగా మరో ముగ్గురు డైరెక్టర్ల కోసం గాలిస్తున్నారు. రుణాల రికవరీకోసం పాలకవర్గం చర్యలు తీసుకుంటున్నా, డాక్యుమెంట్లు సీఐడీ అధికారులవద్ద ఉండిపోవడంతో ఏమీ చేయలేని స్థితిలో సభ్యులు ఉన్నారు.

రిక‘వర్రీ’!

జయలక్ష్మి సొసైటీ రుణాల రికవరీలో అన్నీ ఇబ్బందులే..

డాక్యుమెంట్లు లేక రికవరీలో జాప్యం

ఆందోళనలో బాధితులు

సర్పవరం జంక్షన్‌, మార్చి 25: జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులు డిపాజిటర్లనుంచి కోట్లాది డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసి దాదాపు ఏడాది కావస్తోంది. రూ.582కోట్ల ఆర్థిక మో సానికి పాల్పడిన చైర్మన్‌, వైస్‌చైర్మన్లతోపాటు ఇప్పటికే సీఐడీ అధికారులు ఏడుగురిని అరెస్ట్‌ చేయగా మరో ముగ్గురు డైరెక్టర్ల కోసం గాలిస్తున్నారు. రుణాల రికవరీకోసం పాలకవర్గం చర్యలు తీసుకుంటున్నా, డాక్యుమెంట్లు సీఐడీ అధికారులవద్ద ఉండిపోవడంతో ఏమీ చేయలేని స్థితిలో సభ్యులు ఉన్నారు. డాక్యుమెంట్లు వెనక్కి ఇస్తే రూ.100కోట్ల వరకు రివకరీ వస్తుందని, సాంకేతిక కారణాలతో రుణాలు కట్టించుకునే అవకాశాలు లేకుండా పోతోందని పాలకవర్గం సభ్యులు తెలిపారు. సత్వరంగా చార్జిషీట్‌ దాఖలు చేసి డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆర్థిక మోసానికి.. ఏడాది కావస్తున్నా..

కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం జంక్షన్‌ ప్రధాన కేంద్రంగా ది జయలక్ష్మి మ్యూచువల్‌ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలో 29 బ్రాంచీల ద్వారా 19వేలమందినుంచి రూ.582కోట్ల డిపాజిట్లు సేకరించారు. సొసైటీ చైర్మన్‌ సీతారామాంజనేయులు, వైస్‌చైర్మన్‌ విశాలక్ష్మి ఇష్టారాజ్యంగా రుణాల మంజూరు, సొంతానికి వాడేసుకోవడం, ఎటువంటి కొల్లేటరల్‌ సెక్యూరిటీ లేకుండా కోట్లాది రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. వీరిద్దరూ రూ.350కోట్లకు పైబడి ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. డిపాజిటర్లకు నగదు చెల్లించకపోవడతో గతేడాది మార్చి ఆఖరివారంలో డిపాజిటర్లు జిల్లా స్పందనలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ విచారణకు ఆదేశించడంతో ఈలోగా 2022, ఏప్రిల్‌ 6న జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. బాధితుల ఆందోళన మధ్య రాష్ట్ర సహకారశాఖ కమిషనర్‌ విచారణకు ఆదేశించగా 348 పేజీలతో కూడిన నివేదికను రిజిస్ట్రార్ల బృందం అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. రూ.582కోట్ల మేర ఆర్థికమోసం జరిగినట్లు గుర్తించారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఈ కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఈ కేసులో ఏ1 రాయవరపు సీతారామాంజనేయులు, వైస్‌చైర్మన్‌ ఏ2 రాయవరపు బదరీ విశాలాక్ష్మి, డైరెక్టర్లు రాయవరపు జయవమణి, చక్రభాస్కరరావు, ప్రబల మల్లిఖార్జునరావు, మంగళంపల్లి వెంకట సుబహ్మణ్యకుమార్‌, వారణాసి శాంతేశ్వరరావులను నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఇంకా దూళ్ల శ్రీనివాస్‌, ఆర్‌.నాగేశ్వరరావు, విదేశానికి పారిపోయిన జయశంకర్‌లను అరెస్ట్‌ చేయాల్సి ఉంది.

రుణాల రికవరీలో అన్నీ ఇబ్బందులే...

జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులు కోట్లాది డిపాజిట్లు స్వాహాకు పాల్పడి ఏప్రిల్‌ 6 నాటికి ఏడాది కావస్తోంది. కొత్తపాలకవర్గం గతేడాది నవంబరు ఒకటో తేదీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సీబీసీఐడీ మార్గదర్శకంలో 1450 మందికి నోటీసులు జారీచేశారు. రుణగ్రహీతలనుంచి ఇప్పటివరకు రూ.2.20కోట్ల మేర రికవరీ చేశారు. రూ.120కోట్ల విలువైన 64 ఆస్తులను సీఐడీ సీజ్‌ చేసింది. రుణాల చెల్లించేందుకు ముందుకు వస్తున్నా, సాంకేతిక సమస్యలతో రుణాలు కట్టించుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. డబ్బులు చెల్లిస్తాం, తనఖా పెట్టిన ఒరిజినల్‌ దస్తావేజులు వెనక్కి ఇవ్వాలని కోరుతుండడం, సంస్థ పాలకవర్గానికి పెను సమస్యగా మారింది. సీఐడీ అధికారులు అన్ని డాక్యుమెంట్లు, గోల్డ్‌ని సీజ్‌ చేయడంతో ఇవన్నీ అక్కడ ఉండిపోయాయి. డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే రూ.100కోట్లు రుణాలు రికవరీ చేసేందుకు వస్తున్నా, ఏం చేయలేని స్థితిలో ఉన్నామని జయలక్ష్మి సొసైటీ చైర్మన్‌ గంగిరెడ్డి త్రినాథరావు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.30లక్షల వరకు గోల్డ్‌ లోన్‌ వెనక్కి చెల్లిస్తామంటున్నా కట్టించుకునే స్థితి లేదన్నారు. ముగ్గురు డైరెక్టర్లు పరారీలో ఉన్నారని, వీరికోసం ఇంకా కోర్టులో చార్జిషీట్‌ నమోదు చేయకపోవడంతో సాంకేతిక సమస్య ఉందన్నారు. బాధితుల సౌకర్యార్థం తక్షణమే చార్జిషీటు దాఖలు చేసేలా సీఐడీ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

డాక్యుమెంట్లకోసం కోర్టులో పిటిషన్‌

రుణాలు చెల్లించినవారికి డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చేం దుకు డాక్యుమెంట్లు, గోల్డ్‌కోసం రాజమహేంద్రవరంలో ఉన్న సీబీసీఐడీ కోర్టులో వారంరోజుల్లో పిటిషన్‌ దాఖలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. కోర్టు అంగీకరిస్తే నెలరోజుల్లో రూ.50కోట్లు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. మోసానికి పాల్పడ్డ చైర్మన్‌కు చెందిన భూములు సెజ్‌లో ఉన్నా యి. ఇందులో 9ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి ఇ చ్చింది. ఈ భూమి కోసం కలెక్టర్‌తో మాట్లాడి సొసైటీకి వచ్చేలా న్యాయపరంగా చర్యలు తీసుకుంటున్నా. ప్రభుత్వ సహకారంతో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నా. సొసైటీ నిర్వహణపై ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టిసారిస్తున్నాం.

-గంగిరెడ్డి త్రినాథరావు, చైర్మన్‌

Updated Date - 2023-03-26T00:34:49+05:30 IST