స్వీప్ చేద్దాం
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:09 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన అన్ని అసెంబ్లీ సీట్లు గెలవాలని, ఏ ఒక్క సీటు కూడా వదలకుండా మొత్తం స్వీప్ చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. ఎక్కువ సీట్లు వచ్చాయన్న గర్వంతో విర్రవీగుతున్న వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలంటే ఇదే సరైనదని స్పష్టం చేశారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో సీట్లన్నీ టీడీపీ, జనసేన నెగ్గాల్సిందే
కాకినాడ జిల్లా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జుల భేటీలో పవన్‌కల్యాణ్
ఎక్కడైనా చిన్నచిన్న విభేదాలున్నా అర్థం చేసుకుని కలిసిపోవాలన్న జనసేనాని
కాకినాడ సిటీలో ద్వారంపూడిని ఓడించేందుకు శ్రేణులు పనిచేయాలని ఆదేశం
మూడురోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరిన పవన్
జనవరి 3న పవన్ మళ్లీ కాకినాడ రాక
(కాకినాడ, ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన అన్ని అసెంబ్లీ సీట్లు గెలవాలని, ఏ ఒక్క సీటు కూడా వదలకుండా మొత్తం స్వీప్ చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. ఎక్కువ సీట్లు వచ్చాయన్న గర్వంతో విర్రవీగుతున్న వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలంటే ఇదే సరైనదని స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన కలవడం ద్వారా అన్ని స్థానాల్లో పాగా వేయడం సాధ్యమేనన్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడా ఓట్లు చీలకుండా ఇరుపార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మూడురోజుల పర్యటనలో భాగంగా పవన్‌కల్యాణ్ శనివారం కాకినాడ జిల్లా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి రాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఎస్వీఎస్‌ఎన్ వర్మ, వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల తదితరులతో మాట్లాడారు. తొలుత ఒక్కొక్కరినీ పేరుపేరునా పలకరించారు. ఇటీవల యువగళం బహిరంగ సభలో పలకరించలేకపోయానని జ్యోతుల నెహ్రూను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం పుర్హుతికా అమ్మవారి ప్రసాదం, తాడు అందించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గాల్లో సంస్థాగత నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని వర్మను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌చార్జుల ద్వారా నియోజకవర్గాల్లో సమస్యలు, వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి గురించి పవన్ ఆరా తీశారు. చంద్రబాబును అకారణంగా వైసీపీ జైలుపాలు చేసినప్పుడు వచ్చి పొత్తు గురించి ప్రకటన చేసిన పవన్‌ను టీడీపీ నేతలు కొనియాడారు. అనంతరం పవన్ మాట్లాడుతూ పొత్తు తర్వాత నియోజకవర్గాల్లో ఇరుపార్టీల నేతల మధ్య ఏమైనా పొరపొచ్చాలు ఉంటే సర్దుకుపోవాలని హితవు పలికారు. టీడీపీలో ఎందరో సీనియర్లు ఉన్నారని, జనసేనలో ఉడుకు రక్తం ఉందని, ఈ రెండింటి మేళవింపుతో ఉమ్మడి జిల్లాలో అత్యధిక సీట్లు గెలవాలని సూచించారు. పొత్తు ప్రకటన తర్వాత పార్టీ అధ్యక్షుల స్థానంలోను, కిందిస్థాయిలో కార్యకర్తల స్థానంలోను అంతా బాగుందని, కానీ నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం పెరగాలన్నారు. ఇటీవల జగ్గంపేటలో జరిగిన వివాదాన్ని పవన్ ప్రస్తావించగా, నెహ్రూ దానికి వివరణ ఇవ్వబోయారు. తాను వివరణ కోరడం లేదని, మనస్పర్థలు లేకుండా సర్దుకుపోయి నియోజకవర్గాల్లో ఇరువర్గాలు కలిసి పనిచేయాలన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో అడ్డగోలుగా వైసీపీ నేతల దందాలు సాగుతున్నాయని, వీటిని అరికట్టాలంటే ద్వారంపూడిని ఓడించాల్సిందేనని పవన్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం సిటీ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లో కాకినాడ సిటీలో వైసీపీ ఓడి తీరాలని, ఆ దిశగా నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు. అంతకుముందు తనను కలవడానికి వచ్చిన పలువురు ఉమ్మడి తూర్పుగోదావరి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జులతో పవన్ కాసేపు సమావేశమయ్యారు. కాగా మూడురోజుల పర్యటనను ముగించుకుని శనివారం సాయంత్రం పవన్ హైదరాబాద్ బయలుదేరారు. బయటకు వస్తూ కారు ఎక్కి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. కాగా మూడు రోజుల పర్యటనలో పవన్ ప్రత్యేకంగా కాకినాడసిటీ నియోజకవర్గంపై సమీక్షించడం ప్రత్యేక చర్చకు దారితీసింది.
ఆస్తులు లాగేసుకుంటున్నారు.. మీరూ పోరాడండి..
కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రజల ఆస్తులు కూడా లాగేసుకుంటున్నారని, వాటిపై జనసేన పోరాడుతోందని, మీరు కూడా మీ బాధ్యతగా పోరాడాలని న్యాయవాదులకు పవన్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం కొందరు న్యాయవాదులతో భేటీ అయిన పవన్ జనసేన గురించి మీరు మాట్లాడాలని నేను అడగడం లేదు. ప్రజల సమస్యలపైనా, జరుగుతున్న తప్పులపైనా మాట్లాడాలని కోరుతున్నానన్నారు. పేదల ఇళ్ల స్థలాల కొనుగోలు, ఇళ్ల నిర్మాణంలో జరిగిన లక్షల కోట్ల అవినీతిని ప్రధానికి రాసిన లేఖలో శనివారం వివరించానని ఇక్కడ జరుగుతున్న అరాచకాలను న్యాయవాదులు కూడా ఖండించాలని పవన్ కోరారు.
తిరిగి 3న పవన్ రాక..
పవన్‌కల్యాణ్ జనవరి 3న మరోసారి కాకినాడ పర్యటనకు రానున్నారు. రెండురోజులపాటు ఇక్కడే మకాం వేసి కాకినాడ సిటీ నియోజకవర్గంపై సమీక్షించనున్నారు. తాజాగా మూడురోజుల పర్యటనలో కాకినాడ సిటీలో 22 డివిజన్లపై పవన్ సమీక్ష పూర్తిచేశారు. ఇంకా 28 డివిజన్లపై సమీక్ష చేయాల్సి ఉండడంతో వాటిని పూర్తి చేయడానికి మళ్లీ రావాలని నిర్ణయించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంపైనా సమీక్షించనున్నారు. జనవరి 3న సీఎం జగన్ కాకినాడ పర్యటనకు వస్తున్నారు. వివిధ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదేరోజు పవన్‌కల్యాణ్ వస్తుండడం విశేషం. ఇదే విషయమపై జనసేన పార్టీ నేతలవద్ద ప్రస్తావించగా 3న రావడం ఖాయమని, లేదంటే 4వ తేదీకి వాయిదా పడే అవకాశం కూడా ఉందన్నారు.