జగనన్న కాలనీలు.. కన్నీళ్లు!
ABN , First Publish Date - 2023-07-28T00:38:04+05:30 IST
జిల్లాలో జగనన్న ఇళ్ల కాలనీలకు వెళ్లాలంటే కన్నీళ్లు తప్పవు.. ఎందు కంటే కనీసం నడవడానికి దారి లేదు.. కట్టుకున్న ఇళ్లలో ఉందామంటే అవకాశం లేదు.. చాలా చోట్ల చేల మధ్యన స్థలా లను కేటాయించడంతో వర్షాలకు నీట మునిగాయి..
అసలు రోడ్లే లేవు
నేటికీ మట్టి రోడ్లే దిక్కు
తాగడానికి నీరుండదు
అయినా ఆగని ఒత్తిడి
ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్
నలిగిపోతున్న పేదలు
జిల్లాలో 18 వేల ఇళ్లే పూర్తి
రాజమహేంద్రవరం, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జగనన్న ఇళ్ల కాలనీలకు వెళ్లాలంటే కన్నీళ్లు తప్పవు.. ఎందు కంటే కనీసం నడవడానికి దారి లేదు.. కట్టుకున్న ఇళ్లలో ఉందామంటే అవకాశం లేదు.. చాలా చోట్ల చేల మధ్యన స్థలా లను కేటాయించడంతో వర్షాలకు నీట మునిగాయి.. కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులు అధ్వానంగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. ఏదో ధైర్యం చేసి కాలనీలో దిగారా మట్టిలో కూరుకుపోతున్నారు. కనీసం లోపలకు మెటీరియల్ వెళ్లే పరిస్థితి కూడా లేదు. పల్లపు ప్రాంతాల్లో చాలా కాలనీలు నిర్మించడం వల్ల అవి చెరువుల్లా మారుతున్నాయి. దీంతో అధికారులు గత మూడు రోజులుగా పనులు ఆపేశారు. కనీసం మెరక చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కాలనీలన్నీ ఇలాగే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 68,519 ఇళ్ల పట్టాలు పం పిణీ చేశారు. మొత్తం 330 కాలనీల వరకూ ఉన్నాయి. అందులో 64,332 మొదలెట్టారు. కానీ పూర్తయినవి కేవలం 18,587, అసలు మొదలు పెట్టనివి 4187 ఉన్నాయి. పునాదులలో 33,449 ఉన్నాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అనేక కాలనీల్లో రోడ్లు లేవు. ప్రస్తుతం విద్యుత్ స్థంభాలు వేస్తున్నారు. జలజీవన్ మిషన్‌కు డబ్బులు ఇవ్వకపోవడంతో మంచినీటి సౌకర్యాల పనులన్నీ ఆగిపోయాయి.అవి కాక సుమారు 50వేల ఇళ్ల వరకూ కోర్టు కేసుల వల్ల పెండింగ్‌లో ఉన్నాయి.ఆవ భూముల్లో ఇళ్లు ఆరంభించలేదు.ఇక ఎన్నికలకు ఎంతో సమయంలేదు.ఈలోపు ఎన్ని పూర్తవుతాయో చెప్పలేం. కట్టుకోకపోతే ఇళ్ల ను తొలగించి వేరేవారికి ఇస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఒకసారి లబ్ధిదారుడైన తర్వాత వారిని తొలగించే అవకాశంలేదు.దీనిపైమార్గాల వెతుకులాటలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
గోకవరంలో కదలిక లేదు..
గోకవరం, జూలై 27 : గోకవరం మండలానికి సుమారు 1419 ఇళ్ళు మంజూరయ్యాయి. వీటిలో కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేం దుకు ముందుకు రాలేదు. స్థలాలు కేటాయించి మూడేళ్లు గడచినా రెండింతల నిర్మాణాలు కూడా పూర్తికాలేదు.చిరుజల్లులు పడినా లేఅవుట్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. బావాజీపేటలో గల జగనన్న కాలనీలో సమస్య ఎక్కువుగా ఉంది. మొదట్లో లబ్ధిదా రులు ఇక్కడ ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేందుకు ముం దుకు రాలేదు. అయితే సదుపాయాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో లబ్ధిదా రులు ముందు కొచ్చారు. ఇప్పటికీ హామీ మాత్రం నిలబెట్టుకోలేదు. దీంతో వర్షం కుర్షిన ప్రతిసారీ కాలనీ జలమయంగా మారుతుంది. ఆ సమయంలో అంతర్గత రహదారులన్నీ కనిపించకుండా మునిగిపోతున్నాయి. దీంతో గృహల నుంచి బయటకు వచ్చేందుకు స్ధానికులు ఇబ్బందులు పడుతున్నారు. జగనన్న కాలనీకి కేటాయిం చిన అచ్చుతాపురం లేఅవుట్‌ను అధికారులు రద్దు చేశారు.శ్మశానానికి దగ్గరిగా స్ధలాలను కేటాయించడంతో ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
వంగలపూడికి వెళ్లే దారేది
సీతానగరం,జూలై 27 : సీతానగరం మండలం, వంగలపూడి గ్రామంలో వంగలపూడి నుంచి పెదకొండేపూడి వెళ్లే పుంత రోడ్డును అనుకుని జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు.ఇక్కడకు వ్యవసాయం చేస్తున్న రైతు లు సైతం వెళ్లలేని పరిస్థితి. అటువంటిది అక్కడ నివాసం ఉండాలంటే కష్టమే. కొండ గోదావరి వచ్చినా ,భారీ వర్షాలు వచ్చినా ముంపునకు గురవుతుంది. దారిమార్గం బురదమయంగా మారి కాలు కూరుకుపోతుంది. వసతులు లేక లబ్దిదారులు పెదవి విరవడమే కాకుండా ఈ కాలనీ స్థలాలకు ఎలా వెళ్లాలి.. ఎలా ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
నిడదవోలులో నీళ్లే లేవు
నిడదవోలు, జూలై 27 : నిడదవోలు పట్టణంలో వైయస్సార్ కాలనీని ఆనుకుని ఉన్న జగనన్న కాలనీ లో 1884 ఇళ్ళ స్థలాల లే - అవుట్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో తుది దశకు చేరుకున్న ఇళ్లు 798 ఉన్నాయి.ఈ ఇళ్ళలో లబ్దిదారులు నివాసం ఉంటు న్నారు.జగనన్న కాలనీ సమస్యలతో నిండిపోయింది. చినుకు పడితే రోడ్లన్నీ చిత్తడిగా మారిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రావెల్ రోడ్డు వేసి వదిలే యడంతో చినుకు పడితే బురదమయంగా మారిపో తున్నాయి. ఈ కాలనీలో నివసించే 798 కుటుంబాలు తాగునీటికి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకు తాగునీటి సదుపాయం లేక రూ.10ల వాటర్ టిన్ను రూ.30లకు కొనుగోలు చేసుకుంటున్నారు.
చాగల్లులో రోడ్డేది..గోతులే..
చాగల్లు, జులై 27 : చాగల్లులో జగనన్న కాలనీ, ఇందిరమ్మ కాలనీలకు వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. గతంలో 15 ఏళ్ల కిందట ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలకు వెళ్లే రోడ్డు గోతులుతో దారుణంగా ఉంది. షుగర్ ప్యాక్టరీ వద్ద గల మెయిన్‌రోడ్డు నుంచి కాలనీకి వెళ్లే రోడ్డు సుమారు 2 కిలో మీటర్లు పొడవు ఉంటుంది. కానీ ఈ రోడ్డు కచ్చా రోడ్డును తలపిస్తుంది. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడి గోతుల్లోకి వరద నీరు చేరి చెరువును తలపిస్తుంది. కాలనీలోను రోడ్లు లేవు. కాలనీ వాసులకు కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో నిర్మాణం చేసిన ఇందిరమ్మ కాలనీలో వాసులు కూడ ఇళ్లు ఖాళీ చేసి వచ్చేస్తున్నారు. మిగిలిన వసతులు ఎలా ఉ న్నా కనీసం కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డునైనా అభివృద్ది చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.