వన్‌డే వీక్షణకు..

ABN , First Publish Date - 2023-03-19T01:33:29+05:30 IST

విశాఖపట్టణంలోని వైఎస్సార్‌ స్టేడియంలో ఈనెల 19న జరిగే భారత్‌, ఆస్ట్రేలియా డేఅండ్‌నైట్‌ వన్‌డే మ్యాచ్‌కు కాకినాడ జిల్లానుంచి యువత, క్రికెట్‌ అభిమానులు అధికసంఖ్యలో తరలివెళ్లారు. మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఆన్‌లైన్లో గత శుక్రవారం విడుదల చేశారు. కొన్నిగంటల్లోనే టిక్కెట్లన్నీ అయిపోయాయి. చాలామంది అభిమానులకు టిక్కెట్లు దొరకలేదు. రూ.600, రూ.800, రూ.1500, రూ.2వేలు, రూ.3వేలనుంచి రూ.10వేల వరకు వివిధ ధరల్లో టిక్కెట్లు ఉన్నాయి.

వన్‌డే వీక్షణకు..

నేడు విశాఖలో భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌

జిల్లానుంచి తరలివెళ్లిన క్రికెట్‌ అభిమానులు

టిక్కెట్ల కోసం పదిరోజులుగా తీవ్ర ప్రయత్నాలు

ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు విపరీతమైన డిమాండ్‌

ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసి వెళ్లిన యువత

గిల్‌, ఇషాంత్‌ సిక్సులు వీక్షించాలి.. కోహ్లీ, రోహిత్‌ మెరుపులు ఆశ్వాదించాలి.. పాండ్యా, జడేజా ఆల్‌రౌండ్‌ షో వీక్షించాలి.. షమీ, సిరాజ్‌ బౌలింగ్‌ చూడాలి.. ఎలాగైనా ఇండియా గెలుపును దగ్గరుండి లైవ్‌లో తిలకించాలి.. ఇలా వారం, పదిరోజులుగా మన జిల్లాలో క్రికెట్‌ అభిమానుల్లో ఒకటే ఆసక్తి.. నేడు ఇండియా-ఆసిస్‌ వన్‌డే మ్యాచ్‌ చూడడానికి మన జిల్లా నుంచి చాలామంది యువత తరలివెళ్లారు. మ్యాచ్‌లో స్టార్‌ క్రికెటర్స్‌ ఆటను లైవ్‌లో చూసి అప్‌డేట్స్‌ పెట్టేందుకు చాలామంది ఉత్సాహం కనబరుస్తున్నారు. కానీ, అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మరి..

కాకినాడ అర్బన్‌, మార్చి 18: విశాఖపట్టణంలోని వైఎస్సార్‌ స్టేడియంలో ఈనెల 19న జరిగే భారత్‌, ఆస్ట్రేలియా డేఅండ్‌నైట్‌ వన్‌డే మ్యాచ్‌కు కాకినాడ జిల్లానుంచి యువత, క్రికెట్‌ అభిమానులు అధికసంఖ్యలో తరలివెళ్లారు. మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఆన్‌లైన్లో గత శుక్రవారం విడుదల చేశారు. కొన్నిగంటల్లోనే టిక్కెట్లన్నీ అయిపోయాయి. చాలామంది అభిమానులకు టిక్కెట్లు దొరకలేదు. రూ.600, రూ.800, రూ.1500, రూ.2వేలు, రూ.3వేలనుంచి రూ.10వేల వరకు వివిధ ధరల్లో టిక్కెట్లు ఉన్నాయి. 27వేల సామర్థ్యం గల స్టేడియంలో టిక్కెట్‌ దొరకడమే చాలామంది అదృష్టంగా భావిస్తున్నారు. కొన్నివేల టిక్కెట్లను మాత్రమే పేటీఎం, బుక్‌మైషో ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంల ద్వారా విక్రయించగా మిగతావి 14వతేదీ నుంచి విశాఖలోని స్టేడియంతోపాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో విక్రయించారు. ఇవికాక ప్రతిజిల్లా అసోసియేషన్‌కి, వీఐపీల కోటా కింద కొన్ని కేటాయించారు. ప్రతి జిల్లా అసోసియేషన్‌కి 200 చొప్పున టిక్కెట్లు కేటాయిస్తారు. ఆఫ్‌లైన్‌లో విక్రయించే టిక్కెట్ల కోసం జిల్లానుంచి చాలామంది క్రికెట్‌ అభిమానులు వెళ్లి కొనుగోలు చేశారు. కొందరు తమకు తెలిసిన వారి ద్వారా వేర్వేరు మార్గాల్లో టిక్కెట్లు తెచ్చుకున్నారు. జిల్లాకు దగ్గరప్రాంతం కావడంతో అభిమానులు మ్యాచ్‌ లైవ్‌లో చూసేందుకు ఎగబడుతున్నారు.

ఆఫ్‌లైన్‌లో దొరికాయి..

-కె.శ్రీనివాస్‌ క్రెకెట్‌ అభిమాని

ఎలాగైనా వైజాగ్‌ స్టేడియంలో మ్యాచ్‌ చూడాలని ఆన్‌లైన్లో నేను, నాస్నేహితులు ప్రయత్నించాం. టిక్కెట్లు దొరకలేదు. ఆఫ్‌లైన్‌లో ప్రయత్నించగా దొరికాయి. స్టేడియంనుంచి మ్యాచ్‌ చూస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది.

అసోసియేషన్‌కు 185 టిక్కెట్లు వచ్చాయి

-పీఎస్‌ సత్య, కార్యదర్శి, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌

జిల్లాకు 185 టిక్కెట్లు మాత్ర మే కేటాయించారు. వీటిలో రూ.600 టిక్కెట్లు 175 కాగా, రూ.2000 టిక్కెట్లు 10 వచ్చాయి. మన జిల్లా క్రికెట్‌ అభిమానులు, యువత నుంచి టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది.

Updated Date - 2023-03-19T01:33:29+05:30 IST