జిల్లా ఆసుపత్రికెళితే.. ఫ్యాన్ తీసుకెళ్లండి
ABN , First Publish Date - 2023-06-07T00:46:31+05:30 IST
ఒక పక్క తీవ్రమైన ఉష్ణోగ్రతలు. మరోపక్క ఉక్కబోత. పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 45 డిగ్రీలకు అటూ ఇటూగా నమోదవుతున్నాయి. ఇళ్లల్లో హై స్పీడులో ఫ్యాన్లు తిరుగుతున్నా చెమటలు కారిపోతున్నాయి.
పనిచేయని ఫ్యాన్లు, ఏసీలు
ఎవరి ఫ్యాన్ వారే తెచ్చుకోవాలి
నరకం చూస్తున్న రోగులు
తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి
అయినా పట్టించుకోని వైనం
ఆర్థో విభాగంలో ఇదీ దుస్థితి
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 6 : ఒక పక్క తీవ్రమైన ఉష్ణోగ్రతలు. మరోపక్క ఉక్కబోత. పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 45 డిగ్రీలకు అటూ ఇటూగా నమోదవుతున్నాయి. ఇళ్లల్లో హై స్పీడులో ఫ్యాన్లు తిరుగుతున్నా చెమటలు కారిపోతున్నాయి. వేడిని భరించలేక ప్రజలు అల్లల్లాడిపోతూ కాస్త ఉపశమనం కోసం గోదావరి గట్టుకో, ఏసీలున్న రెస్టారెంట్లు, హోటళ్లకో పరుగులు తీసే పరిస్థితి. వారం, పదిరోజులుగా ఇలాంటి దారుణమైన వాతావరణ పరిస్థితుల్లో సాధారణ ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి భయానక వాతావరణ పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అధికారులు రోగుల విషయంలో చూపుతున్న నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కొన్ని వార్డుల్లో ఫ్యాన్లు లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన తమవారి కోసం కుటుంబీకులు ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఆర్థో వార్డు (మేల్)లో పరిస్థితిని చూస్తే రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ వార్డులో 17 బెడ్‌లు ఉండగా కనీసం ఫ్యాన్లు లేవు. ఉన్న రెండు ఏసీలు మొక్కుబడిగానే ఉన్నాయి. వీటిలో ఒకటి పూర్తిగా మూలనపడితే ఇంకో ఏసీ నుంచి చల్లదనం మాట దేముడెరుగు కనీసం గాలి కూడా రావడంలేదు. ఆ వార్డులో మొత్తం 10 మంది రోగులు ఉన్నారు. ఎటూ కదల్లేని పరిస్థితుల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఉక్కబోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హుకుంపేట, మండపేట ప్రాంతాల నుంచి వచ్చి చికిత్స పొందుతున్న ఇద్దరు మాత్రం తమ ఇళ్ల నుంచి టేబుల్ ప్యాన్లు రప్పించుకుని ఉపశమనం పొందుతున్నారు. రోగులతోపాటు వారి సహాయకులకు ఇబ్బందులు తప్పడంలేదు. కొన్ని వార్డుల్లో ఫ్యాన్లు మొక్కుబడిగా తిరుతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోగాలు గాలిలేక అల్లాడిపోతున్నారు.