సాయం మరిచారు.. బయట పడేశారు!
ABN , First Publish Date - 2023-06-26T01:07:23+05:30 IST
అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ చిత్రం.. విభిన్న ప్రతిభావంతుల కోసం దాతలు లక్షలు ఖర్చులు చేసి కొనుగోలు చేసి ఇచ్చిన వీల్ చైర్లు, హ్యాండ్ స్టిక్స్ నిరుపయోగంగా ఎండకు ఎండుతూ వాన కు తడుస్తూ ఉన్నాయి..అయినా కన్నెత్తి చూసిన వారే లేరు..
రాజమహేంద్రవరం రూరల్ , జూన్ 25 : అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ చిత్రం.. విభిన్న ప్రతిభావంతుల కోసం దాతలు లక్షలు ఖర్చులు చేసి కొనుగోలు చేసి ఇచ్చిన వీల్ చైర్లు, హ్యాండ్ స్టిక్స్ నిరుపయోగంగా ఎండకు ఎండుతూ వాన కు తడుస్తూ ఉన్నాయి..అయినా కన్నెత్తి చూసిన వారే లేరు.. కనీసం ఎందుకిలా పడేశారని ప్రశ్నించిన వారూ లేరు. పరిశ్రమలు, కొన్ని సంస్థలు తమ లాభాల్లో కొంత మొత్తాన్ని కార్పొరేట్ రెస్సాన్సిబిలిటీ ఫండ్స్ రూపంలో ప్రభుత్వ సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు పరికరాల రూపేణా ఇస్తారు. అలా వచ్చిన పరికరాలను అవసరమైన వారికి అందించడం అధికారుల బాధ్యత..ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించ కపోవడంతో కొత్తవే అయినా తుప్పు పడుతున్నాయి. ఎందుకూ పనికిరాకుం డా పోతున్నాయి.ఇదెక్కడో కాదు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న హుకుంపేటలో నెలకొంది. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు వీల్ చైర్లు, చేతికర్రలు అందజేశారు. వీటన్నింటి బాధ్యత రూరల్ మండల పరిషత్ కార్యాలయం అఽధికారులకు అప్పగించినట్టు చెబుతున్నారు. మండల పరిషత్ సమావేశమందిరం బ్యాలెట్ బాక్సులతో నిండిపోవడంతో వీటిని హుకుంపేటలో నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనంలో ఉంచారు. సచివాలయ పనులు ఆరంభించడం తో సుమారు 100కు పైగా వీల్ చైర్లు, హ్మాండ్ స్టిక్‌లు కుప్పలుగా ఆవరణలో పడేశారు. లక్షలాది రూపాయల విలువ చేసే ఉపకరణాలు అలా పడవేయడంపై అధికారుల తీరుపై గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి వెంకట్రావును వివరణ కోరగా వీటిని ఎవరు కొనుగోలు చేసారో తమకేమీతెలియదని మండల పరిషత్ అధికారులు ఆదేశాలలో తమ కార్యాలయం ఆవరణలో ఉంచామన్నారు. ఎంతో మంది దివ్యాంగులు ఉపకరణాలు లేక ఇబ్బందులు పడుతుంటే మూలన పడేసి ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మూలన పడేసిన ఈ ఉపకరణాలను లబ్ధిదారులను అందించాలని పలువురు సూచిస్తున్నారు.