అకాల వాన

ABN , First Publish Date - 2023-04-03T01:00:34+05:30 IST

అనుకోకుండా అకాల కష్టం వచ్చిపడింది..వారం కిందట ఇలాగే చినుకులు పడ్డాయి. రైతాంగాన్ని ఆందోళనకు గురి చేశాయి.

అకాల వాన
అనపర్తిలో జలయమమైన రోడ్డు.

ఉదయం ఎండ..మధ్యాహ్నం వాన

అక్కడక్కడా నేలనంటిన వరిచేలు

మెట్టలో పొగాకు, మొక్కజొన్నకు నష్టం

ఆందోళనలో రైతాంగం

అనపర్తిలో రెండు గంటల పాటు వాన

బిక్కవోలులో ఈదురుగాలులు

రాజమహేంద్రిలో స్వల్పంగా నమోదు

రాజమహేంద్రవరంరూరల్‌/అనపర్తి/బిక్కవోలు/ కొవ్వూరు/ గోపాలపురం, ఏప్రిల్‌ 2 : అనుకోకుండా అకాల కష్టం వచ్చిపడింది..వారం కిందట ఇలాగే చినుకులు పడ్డాయి. రైతాంగాన్ని ఆందోళనకు గురి చేశాయి.అప్పటి వరకూ భానుడు భగభగలాడి పోతు న్నాడు. ఆ మరుక్షణమే వరుణుడు చిరు జల్లులతో విరుచుకుపడుతున్నాడు. ఆదివారం ఒక్కసారిగా వర్షం కురిసింది.దీంతో రైతాంగం ఉరుకులు పరుగులు పెట్టారు. ఉదయం నుంచి వాతావరణం కాస్త చల్లగా ఉంది. మధ్యాహ్నం సమయానికి వరుణుడు విరుచుకు పడ్డాడు.పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమో దుకాగా కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా నమోదైంది. రాజమహేంద్రవరం,అనపర్తి, కడియం, బిక్కవోలు, గోపాలపురం, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమ యమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసి భారీ వర్షానికి పలు రోడ్లు జలమయం కాగా డ్రెయినేజీలు పొంగి పొర్లాయి.దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. ఆదివారం అనపర్తిలో వారపు సంత కావడంతో వ్యాపారాలు ముగించుకునే సమయానికి భారీ వర్షం కురవడంతో చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు మూడు రోజులుగా ఉక్కపోత వాతావరణం ఉండడంతో ఈ వర్షానికి ప్రజలు సేద తీరారు. భారీ వర్షానికి అనేక చోట్ల వరి పంట నేలనంటింది.దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బిక్కవోలులో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. నెల రోజుల్లో వరి పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో ఈదురుగాలులకు పందలపాకలో పలు చోట్ల వరి నేలకొరిగింది. ఊలపల్లి - పందలపాక రోడ్డులో కొబ్బరి చెట్టు విరిగిపడింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గోపాలపురంలో మొక్కజొన్న,పొగాకు,రైతులు పంటను కాపాడుకునేందుకు నానాతంటాలు పడ్డారు. కరిచర్లగూడెం గ్రామంలో వర్షం కారణంగా పండు మిర్చిని ఇంటి ఆవరణలోనే ఆరబెట్టారు. పొగాకు, నాటుపొగాకు, మొక్కజొన్న, మిర్చి, తదితర పంటలు చేతికొచ్చే సమయంలో అకాలవర్షం రైతుకు గుండెలపై కుంపటిలా మారింది.కొవ్వూరులో ఆదివారం ఉదయం నుంచి ఎండవేడిమితో ఉక్కబోతతో ప్రజలు అల్లాడారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృ త్తమై వర్షం కురిసింది. దీంతో ఎక్కడి జనం అక్కడే నిలిచిపోయారు. ఏప్రిల్‌ నెలలో ఏమిటి ఈ ఆకాల వర్షం అని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.ప్రస్తుతం కొన్ని చోట్ల వరి పంట పొట్ట దశలో.. మరి కొన్ని చోట్ల ఈనిక దశలోను ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షానికి దిగుబడి తగ్గుతుందని అకాల వర్షంతో పంటను తీవ్రంగా నష్ట పోతామని వాపోతున్నారు.

Updated Date - 2023-04-03T01:00:34+05:30 IST