పచ్చిమిర్చి ధర మోత
ABN , First Publish Date - 2023-06-26T00:51:06+05:30 IST
పచ్చిమిర్చి ఘాటెక్కింది. కిలో మిర్చి ధర సెంచరీ దాటేసింది. టమోటాలు అర్ధ సెంచరీ దాటితే అల్లం ఏనాడో డబుల్ సెంచరీ దాటింది. వెజ్, నాన్ వెజ్ మసాలా వంటలు ఏవైనా సరే తప్పనిసరిగా వినియోగించే పచ్చిమిర్చి, టమోటా, అల్లం.. ధరలు ఇలా ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యుడితో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 25: పచ్చిమిర్చి ఘాటెక్కింది. కిలో మిర్చి ధర సెంచరీ దాటేసింది. టమోటాలు అర్ధ సెంచరీ దాటితే అల్లం ఏనాడో డబుల్ సెంచరీ దాటింది. వెజ్, నాన్ వెజ్ మసాలా వంటలు ఏవైనా సరే తప్పనిసరిగా వినియోగించే పచ్చిమిర్చి, టమోటా, అల్లం.. ధరలు ఇలా ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యుడితో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో పచ్చిమిర్చి ధర రూ.120-రూ.140 వరకూ ఉంది. రైతు బజార్లలోనే మిర్చి ధర రూ.80 ఉండడం గమనార్హం. ధర భారీగా పెరగడంతో మిర్చి కొనాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ ధర కారణంగా రైతు బజార్లలో మిర్చి అమ్మకాలు పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే పచ్చిమిర్చి తెచ్చి అమ్ముతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని కడియం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా మడికి ఏరియాల్లో లోకల్‌గా సాగు లేకపోవడం గుంటూరు, పరిసర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో మిర్చి ధర భారీగా పెరిగింది. దీనికితోడు వేసవిలో ఆవకాయ, మాగాయ పచ్చళ్ల కోసం ఎండుమిర్చికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో మిర్చి రైతులు కాపు త్వరగా కోసేయడం వల్ల ప్రస్తుతం పచ్చిమిర్చి దిగుబడులు గణనీయంగా తగ్గి ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇలా కారణాలేమైనా మిర్చి ధరలు సామాన్యులకు మంటపుట్టిస్తున్నాయి.
టమోటా ధరల మోత ...
మరోపక్క టమోటాలు ధరల మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. కేవలం వారం, పది రోజుల వ్యవధిలోనే ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 వరకూ విక్రయిస్తుంటే రైతు బజార్లలో రూ.40 ధర ఉంది. మడికి, సీతానగరం, కడియం ప్రాంతాల్లో పండించే లోకల్ టమోటా సీజన్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ముగిసింది. ప్రస్తుతం ఎవరూ టమోటా సాగు చేయడం లేదు. మళ్లీ ఆగస్టు, సెప్టెంబరు వరకూ లోకల్ టమోటా మార్కెట్లకు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో రాజమహేంద్రవరం, రావులపాలెం, అమలాపురం, కాకినాడ వంటి హోల్‌సేల్ మార్కెట్లన్నీ ఇతర ప్రాంతాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతం నుంచి టమోటాలను దిగుమతి చేసుకుంటున్నా అక్కడి నుంచి వచ్చే సరుకు ఇక్కడి మార్కెట్ అవసరాలను తీర్చలేకపోతోంది. దీంతో ఒడిశా, జగదల్‌పూర్ వంటి ప్రాంతాల నుంచి టమోటాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లలో టమోటాలు పుష్కలంగా దొరుకుతుండడంతో ఇప్పటికిప్పుడే ధర భారీగా పెరగకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
దిగిరాని మెట్టుపాలెం అల్లం...
ఇక, కొంతకాలం నుంచి కర్నాటక మెట్టుపాలెం అల్లం ధరలు కిందకు దిగడంలేదు. బహిరంగ మార్కెట్లలో కిలో రూ.250-రూ.300 ధర ఉంది. రైతుబజార్లలో కిలో రూ.120 (కొత్తది)-రూ.200 (పాతది) ధర ఉంది. మన రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ పాడేరు, ఎస్.కోట ప్రాంతాల నుంచి ఘాటీ అల్లం రాకపోవడంతో మెట్టుపాలెం అల్లంకు మార్కెట్లో తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు పడుతున్నాయి. అయినా ఇప్పట్లో పచ్చిమిర్చి, టమోటా, అల్లం ధరలు తగ్గే అవకాశం లేదని, మరికొన్నాళ్లు ధరల భారం మోయక తప్పదని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, అడపాదడపా వర్షాలు పడుతూ వాతావరణం చల్లబడితే మాత్రం కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటుందని, కొన్ని రకాల కూరగాయల ధరలు తగ్గే ఛాన్స్ ఉంటుందని రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు చెబుతున్నారు.