వైభవంగా కోదండరాముడి కల్యాణం

ABN , First Publish Date - 2023-03-31T01:15:14+05:30 IST

కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడలో ఉన్న శ్రీకోదండ సీతారాముని కల్యాణం వైభంగా జరిగింది. గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు.

వైభవంగా కోదండరాముడి కల్యాణం

పట్టువస్ట్రాలు సమర్పించిన కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లు

పెదపూడి, మార్చి 30: కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడలో ఉన్న శ్రీకోదండ సీతారాముని కల్యాణం వైభంగా జరిగింది. గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో ఆలయప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం పదకొండున్నర గంటలకు స్వామిని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ప్రభుత్వం తరపున కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా, ఆమె భర్త డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా దంపతులు, అనపర్తి ఎమ్మెల్యే సత్తిసూర్యానారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి సలహాదారుడు అజయ్‌ కల్లాం రాములవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డితోపాటు పలువురు భక్తులు స్వామివారికి మంచి ముత్యాలు, తలంబ్రాలు, 9రకాల పండ్లు, పుష్పాలు, పట్టువస్త్రాలను పల్లకీలో ఊరేగింపుగా రాములవారి కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12.30కి సీతారాముల కల్యాణ సంకల్పం ప్రారంభమైంది. విశ్వక్షేనసంప్రోక్షణ, రక్షబంధన్‌, యజ్ఞోపవేతం చేశారు. సుముహూర్తంలో జీలకర్ర బెల్లం సీతారాముల తలపై పెట్టారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పణ, మంగళహారతులిచ్చారు. మాంగల్య సూత్రధారణ రాములవారితో చేయించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు మంచి ముత్యాలు, తలంబ్రాలను శాస్త్రోక్తంగా పోశారు. రామయ్య తండ్రి రాములోరి కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించారు. ఇక్కడ ఆనవాయితీగా సాగే పిల్లల వేలంపాట తంతు యథావిధిగా జరిగింది. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ అధికారులు మంచి ముత్యాలు, తలంబ్రాలు, బియ్యం పంపిణీ చేశారు.

Updated Date - 2023-03-31T01:15:14+05:30 IST