వరికి మద్దతు ధర పెంపు

ABN , First Publish Date - 2023-06-08T01:26:15+05:30 IST

ధాన్యానికి కనీస మద్దతు ధర పెరిగింది. క్వింటాకు సాధారణ రకం రూ. 143, గ్రేడ్‌ ఏ రకానికి రూ.143 పెంచుతూ వ్యవసాయ, వ్యయ ధరల కమిషన్‌ (సీఏపీసీ) కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది.

వరికి మద్దతు ధర పెంపు

సామర్లకోట, జూన్‌ 7: ధాన్యానికి కనీస మద్దతు ధర పెరిగింది. క్వింటాకు సాధారణ రకం రూ. 143, గ్రేడ్‌ ఏ రకానికి రూ.143 పెంచుతూ వ్యవసాయ, వ్యయ ధరల కమిషన్‌ (సీఏపీసీ) కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. దీంతో సాధారణ రకం రూ.2183, గ్రేడ్‌ ఏ రకం రూ.2203 పెరిగింది. గతేడాది సాధారణ రకం రూ.2040, గ్రేడ్‌ ఏ రకం 2060గా ఉంది. దీనికి రూ.143 అదనంగా పెంచుతూ కేంద్రానికి ప్రతిపాదించారు. తాజా మద్దతు ధరతో రానున్న ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు వీలుగా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 5.54 లక్షల ఎకరాల పరిధిలో 14.00 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయా ధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల ప్రభావం లేకపోతే ఎకరాకు వరికి 4.5 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర క్వింటాకు రూ.143లు పెంచడంతో జిల్లాలో అన్నదాతలకు రూ.200 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. వరి మొక్కజొన్న తదితర 16 పంటలకు సంబంధించి మద్దతు ధరలను పెంచుతూ వ్యవసాయ, వ్యయ ధరల కమిషన్‌ (సీఏపీసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి రూ. 8,558గా నిర్ణయించింది. గతేడాది పెసలు క్వింటాకు రూ. 7,755గా ఉంది. పెసలపై 10 శాతం పెంచగా, వరికి కేవలం 7 శాతం మాత్రమే పెంచింది. బుధవారం కేంద్రం నిర్వహించిన (సీఏపీసీ)ఈ పెంపుదల ధరలు వరికే అత్యధికం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ పెరిగిన సాగు ఖర్చులుతో పోలిస్తే ఇది ఏమంత అధికం కాదని పలువురు రైతులు చెబుతున్నారు. ఈ సిఫార్సులను కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో సాధారణ రకం , గ్రేడ్‌ ఏ రకాలకు ప్రస్తుతం చెల్లిస్తున్న ధర కంటే రూ. 143 చొప్పున పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో సుమారు 330 ధాన్యం కొనుగోలు కేంద్రాల వరకూ ఏర్పాటు చేసి ప్రభుత్వం గతంలో ప్రకటించిన మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గత ఖరీఫ్‌ లో 14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు చేపట్టగా రానున్న ఖరీఫ్‌ నాటికి 5.54 లక్షల ఎకరాలలో సాగు ద్వారా వచ్చే 16.00 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది. ఇక ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 143 మాత్రమే పెంపుదల చేయడంతో రైతాంగం పెదవి విరుస్తోంది.

సాగుకు పెట్టుబడులు అధికమవుతున్న తరుణంలో అందుకు తగ్గట్టుగా మద్దతు ధర లభించడం లేదని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో ప్రధానమైన వరి పంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా, ఏటా మిల్లర్లు రైతులకు మద్దతు ధర అందివ్వని పరిస్థితి నెలకొంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మిల్లర్లకు ధాన్యాన్ని అందజేస్తున్నా, తమకు మాత్రం మద్దతు కరువవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సగటున 48 బస్తాల వరకూ దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా క్వింటాకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్‌ ఏ రకానికి 2,203 ప్రకారం బస్తాకు రూ. 1,652.25 వస్తుంది. మొత్తం 48 బస్తాలకు రూ. 79,308 వస్తుంది. కానీ ఎకరానికి పెట్టుబడిగా రూ. 60 వేల వరకూ వ్యయం అవుతుండగా, రైతుకు మిగిలేది కేవలం 19,308 మాత్రమే. అదే రైతు కూలీ పనులకు వెళితే పంట సాగుకాలంలో రూ. 60వేల వరకూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదికూడా ఏ-గ్రేడ్‌ రకానికి మాత్రమే సొంతభూమి సాగు చేసుకునే రైతుకు కొంత మిగులు కనిపించే అవకాశం ఉండగా కౌలు రైతు, ప్రభుత్వం ముద్దుగా పిలుచుకొనే సాగు హక్కుదారుడు చేతి చమురు వదిలించుకోవాల్సిందే. సాధారణంగా ఖరీఫ్‌లో సాగు హక్కుదారులకు ఏమీ మిగలదు. రబీలో లాభం ఉంటుందనే ఆశతోనే సాగులోకి దిగుతారు. అన్ని అవరోధాలను దాటుకుని సాగు చేసినా చేతికి మిగిలేది రెండు పదులు కూడా దాటని పరిస్థితి. దీనిపై వరి రైతులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక సన్‌ఫ్లవర్‌కు రూ.360, సోయాబీన్‌కు రూ.300 చొప్పున మద్దతు ధర పెరిగింది.

Updated Date - 2023-06-08T01:26:15+05:30 IST