బొండాలపై బొంకే..

ABN , First Publish Date - 2023-05-10T01:40:14+05:30 IST

జిల్లాలో బొండాల ధాన్యం పండించిన రైతులు జగన్‌ సర్కారు తీరుతో నిలువునా మునిగిపోయారు. వర్షాలకు తడిచి రంగుమారి, మొలకలొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో అంతులేని జాప్యం ప్రద ర్శిస్తుండడంతో మోసపోతున్నారు.

బొండాలపై బొంకే..
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో సామర్లకోటలోని మేడపాడు కెనాల్‌ రోడ్డుపై ఆరబెట్టుకుంటున్న బొండాల ధాన్యం

జిల్లాలో బొండాల ధాన్యం కొనుగోలుపై సర్కారు మీనమేషాలు

1.40 లక్షల మెట్రిక్‌ టన్నులకు ఇప్పటివరకు కొనుగోలు చేసింది 20 వేల మెట్రిక్‌ టన్నులే

ప్రభుత్వ తీరుతో తడిచి కళ్లాల్లోనే ఉండిపోయిన బొండాలు రకం ధాన్యం

ఒకపక్క మొలకలు.. మరోపక్క ఆర్బీకేల్లో నిబంధనలతో అన్నదాతల బేజారు

అటు నూక పేరుతో మిల్లర్ల మాయతో మందకొడిగా కొనుగోళ్లు

ప్రభుత్వ తీరుతో చేసేదిలేక అయినకాడికి దళారులకు అమ్ముకుంటున్న వైనం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో బొండాల ధాన్యం పండించిన రైతులు జగన్‌ సర్కారు తీరుతో నిలువునా మునిగిపోయారు. వర్షాలకు తడిచి రంగుమారి, మొలకలొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో అంతులేని జాప్యం ప్రద ర్శిస్తుండడంతో మోసపోతున్నారు. తొలుత బొండాలు సాగువద్దని చెప్పిన ప్రభుత్వం, ఆ తర్వాత కొంటా మని మాట ఇచ్చినా ఆచరణలో మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఒకపక్క వర్షాలకు తడిచిన బొండాల ధాన్యం ఆర్‌బీకేలకు వస్తే తేమశాతం పేరుతో తిప్పి పంపేస్తోంది. దీంతో లక్ష్యం మేర బొండాల ధాన్యం కొనుగోలు అనుమానాస్పదంగా మారింది. జిల్లాలో రబీలో 6,53,352 హెక్టార్లలో వరినాట్లు పడగా 5.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో బొండాల రకం ధాన్యమే 3 లక్షల టన్నులు. అయితే మొత్తం దిగుబడిలో కేవలం 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యమే ఈ దఫా కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల సంస్థ లక్ష్యం విధించుకోగా ఇందులో 1.40 లక్షల మెట్రిక్‌ టన్నులు కేవలం బొండాల రకమే ఉంది. తీరా ఇప్పుడు ఈ ధాన్యం కొనే విషయంలో ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. తొలుత అసలు కొనేదిలేదని చెప్పి.. ఆ తర్వాత 1.40 లక్షల మెట్రిక్‌ టన్నులు కొంటామని ప్రకటించి ఇప్పటివరకు 20 వేల మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేసింది. అంటే తొమ్మిది శాతం కూడా దాటలేదు. ఒకపక్క జిల్లాలో 6.53 లక్షల హెక్టార్లలో నాటు పడగా 3.50 లక్షల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. ఇందులో కొన్ని లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇందులో బొం డాల రకం చాలా ఎక్కువ. అయితే తడిచిన బొండాల రకం ధాన్యాన్ని ఆరబెట్టి గడచిన అయిదురోజులుగా రైతులు ఎక్కడికక్క ఆర్బీకే కేంద్రాల వద్దకు తీసుకు వెళ్తున్నారు. తీరా అక్కడ కొనడం లేదు. తేమశాతం ఎక్కువగా ఉందని, గింజ విరిగిపోతోందని, సంచులు అందుబాటులో లేవని రకరకాల సాకులు చెబుతూ అధికారులు తప్పించుకుంటున్నారు. దీంతో ఈపాటికే 70 వేల మెట్రిక్‌ టన్నుల బొండాలు కొనాల్సి ఉండగా 20 వేల మెట్రిక్‌ టన్నులే సేకరణ జరిగింది. మరోవైపు ఆర్బీకేల్లో ఈ ధాన్యం తీసుకున్నా మిల్లర్ల వద్దకు వెళ్లి ధాన్యం అన్‌లోడ్‌ చేసేందుకు 24 గంటల నుంచి 48 గంటల వరకు సమయం తీసుకుంటున్నారు. అలాగే ఆర్బీ కేల వద్ద తేమశాతం 15 నుంచి 17 శాతం చూపుతుంటే మిల్లర్ల వద్దకు వెళ్లేసరికి 20 నుంచి 25 శాతంగా ఉంటోం ది. ఈ కారణం చూపి మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదు. ధాన్యం అదనంగా అయిదు నుంచి ఏడు కేజీలు ఇస్తేనే తీసుకుంటామని చెబుతుండడంతో రైతులు గత్యంతరం లేక అంగీకరిస్తున్నారు.ఈ నిస్సహాయ పరిస్థితుల్లో చాలామంది రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా బొం డాల రకం 75 కిలోల బస్తాను రూ.1200-1300 వరకూ కొంటుండగా, ఏ మాత్రం తడిచినా, రంగుమారినా బయట మార్కెట్లో రూ.850 నుంచి మాత్రమే దళారులు ఇస్తున్నా రు. ప్రస్తుత వాతావరణంతో జిల్లాలో బొండాలు సాగు చేసిన రైతులు కలవరపడుతున్నారు. ప్రభుత్వం వేగంగా బొండాల రకం ధాన్యాన్ని కొనకపోతే మళ్లీ వర్షాలు వస్తే పంట నష్టపోతామనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ధాన్యం తడిచిపోయి, చేలల్లో పనలు కుళ్లిపోయిన పరిస్థితుల్లో మళ్లీ వర్షాలతో తడిస్తే అటు ప్రభుత్వం, ఇటు దళారులు కొనరని.. అప్పుడు పూర్తిగా ఇబ్బందుల్లో పడి పోతామనే ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. ప్రభు త్వం బొండాల ధాన్యం కొనే విషయంలో వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉండడం, పండిన పంటలో ఇప్పటివరకూ కేవలం తొమ్మిది శాతం మాత్రమే కొనడాన్ని గుర్తుచేసుకుని భయాందోళనలకు గురవుతున్నారు.

Updated Date - 2023-05-10T01:40:14+05:30 IST