8 నెలలైనా ఎదురుచూపులేనా!
ABN , First Publish Date - 2023-02-12T00:23:54+05:30 IST
ఏడాదిగా ఎదురుచూపులే .. అయినా ఇంకా ఫలించలేదు.. చివరిలో అయినా ఉద్యోగం వస్తుందనే ఆశ అడియాశగానే మిగిలిపో యేలా ఉంది. 1998 డీఎస్సీ అభ్యర్థుల సుదీర్ఘపోరాటం అనంతరం 24 ఏళ్ళ తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన మరోసారి అభ్యర్థుల్లో ఊపిరినింపింది.
ప్రకటనలతోనే సరిపెడుతున్న ప్రభుత్వం
వయసు పెరుగుతుందని ఆందోళన
అయినా కనికరించని సర్కారు
24 ఏళ్లకు పట్టాలెక్కి ఆగిన బండి
రోజురోజుకు పెరుగుతున్న అసహనం
ఉత్తుత్తి హామీలు వద్దని విన్నపం
సీఎం తేల్చాలని డిమాండ్
కోరుకొండ, ఫిబ్రవరి11 : ఏడాదిగా ఎదురుచూపులే .. అయినా ఇంకా ఫలించలేదు.. చివరిలో అయినా ఉద్యోగం వస్తుందనే ఆశ అడియాశగానే మిగిలిపో యేలా ఉంది. 1998 డీఎస్సీ అభ్యర్థుల సుదీర్ఘపోరాటం అనంతరం 24 ఏళ్ళ తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన మరోసారి అభ్యర్థుల్లో ఊపిరినింపింది. అయితే గత జూన్‌లోనే 98 డీఎస్సీ అభ్యర్థులకు టైం స్కేల్ ప్రకారం సెకండరీ గ్రేడ్ పోస్టుల్లో భర్తీ చేసేందుకు సీఎం ఫైల్‌ఫై సంతకం చేశారు. దీంతో అక్కడక్కడ చెల్లాచెదురైపోయిన అభ్య ర్థులు ఊపిరిపోసుకుని 24 ఏళ్ళ తరువాతైన తమకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న కొండంత ఆశతో గత జూలైలో ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో విద్యాశాఖ కమిషనర్ నుంచి చకచకా కిందిస్థాయి అధికారులకు 98 డీఎస్సీ అభ్యర్థుల వివరాలు అందజేయాలని ఆదేశాలు రావడంతో ఆగ మేఘాలు మీద వివరాలు అందజేశారు. అప్పటికే 60 ఏళ్ల వయసుకు దగ్గరగా ఉన్న అభ్యర్థులు కనీసం కొద్ది నెలల పాటైనా ప్రభుత్వ ఉద్యోగం చేశామన్న తృప్తి మిగులుతుందనుకున్నారు.
అన్నీ ఓకే.. ఆ ఒక్కటీ తప్ప..
ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 98 అభ్యర్థుల వివరాలు సేకరించడం.. ఎవరెవరు ఉద్యోగాలు చేయాలనుకుం టున్నారో వివరాలు తెలుసుకోవడం చకచకా జరిగి పోయాయి. దీంతో 98 డీఎస్సీ అభ్యర్థులు 24 ఏళ్ళ పోరాటం ఫలించిందని గతేడాది ఆగస్టు, సెప్టెంబరులో ప్రభుత్వఉద్యోగంలో జాయినవుతామని అనుకున్నారు. అయితే ఈ ప్రక్రియ మొదలై 8 నెలలు కావస్తున్నా 98 డీఎస్సీ అభ్యర్థులు 24 ఏళ్ల కింద ఎక్కడ ఉన్నారో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. గడిచిన 8 నెలలుగా అధికారులు హడావుడి, నాయకుల ప్రకటనలు, అభ్య ర్థులు దరఖాస్తులు, ఆన్‌లైన్‌లో అంగీకార పత్రాలు, 24 ఏళ్ళ తరువాత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరిగాయి. కానీ ఆ తరువాత ప్రక్రియ ముందుకు జరగడంలేదు. ప్రతిసారి విద్యాశాఖ సమీక్షలో 98 డీఎస్సీ వారికి త్వరలో ఉద్యోగాలు ఇస్తామని, టైం స్కేల్ ఇస్తామని ఫైల్‌పై సీఎం సంతకం చేశారని, కేబినేట్‌లో చర్చిం చారని, మంత్రిమండలిలో ఆమోదం తెలిపారని, ముఖ్యమంత్రి విధాన పరమైన నిర్ణయం తీసుకున్న తరువాత కూడా అదిగోఇదిగో అంటూ 8 నెలలు గడిచి పోయింది. వయసు మీరిపోతున్న అనేక మంది అభ్య ర్థులు ఇప్పటికే ఆశలు వదిలేసుకుంటున్నారు. జనవరి 2023 రావడంతో అభ్యర్థుల్లో చాలా మంది 60 సంవత్సరాలు నిండిపోయాయి.
ఈ విద్యాసంవత్సరంలో అనుమానమే
ప్రస్తుత విద్యాసంవత్సరం ముగియడానికి ఇక కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది. విద్యాసంవత్సరం ఆరంభంలో మొదలైన ప్రక్రియ విద్యా సంవత్సరం ముగుస్తున్నా కౌన్సెలింగ్ నిర్వహించడం కానీ, పోస్టులు భర్తీ చేయడం కానీ జరగలేదు.దీంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా అనుకున్న విధంగా అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని ఆలస్యం అయ్యే కొద్ది వయస్సుమీరిన అభ్యర్థుల అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ప్రభుత్వం ఫిబ్రవరిలోనే ఖాళీగానే ఉపాధ్యాయ పోస్టులను 98డీఎస్సీ అభ్యర్థులు నియమించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.