తూర్పులో క్రైం రేటు తగ్గింది
ABN , First Publish Date - 2023-03-02T00:25:13+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం జాంపేట పోలీస్ క్యార్టర్స్‌లో రూ.కోటి 80 లక్షలతో నిర్మించిన పోలీస్ కన్వెన్షన్ సెంటర్ (కళ్యాణ మండపం), జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో రూ.45 లక్షలతో నిర్మించిన స్పోర్ట్సు కాంప్లెక్స్ ను బుధవారం డీజీపీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 1: తూర్పుగోదావరి జిల్లాలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం జాంపేట పోలీస్ క్యార్టర్స్‌లో రూ.కోటి 80 లక్షలతో నిర్మించిన పోలీస్ కన్వెన్షన్ సెంటర్ (కళ్యాణ మండపం), జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో రూ.45 లక్షలతో నిర్మించిన స్పోర్ట్సు కాంప్లెక్స్ ను బుధవారం డీజీపీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత మూడు ఏళ్లుగా క్రైమ్ రేటు తగ్గిందన్నారు. శారీరక నేరాలు, ఆస్తి నేరాలు, వైట్ కాలర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు పరిశీలన చేయగా తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఒడిసా నుంచి రవాణా అవుతున్నగంజాయికి తూర్పుగోదావరిలో అడ్డుకట్ట వేశామని చెప్పారు. జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న 53 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించామని చెప్పారు. మహిళల రక్షణకు ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లాలో యువతిని నడిరోడ్డుపై నరికిన కేసులో నిందితుడికి నాలుగు నెలల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ఏడాది 94 కేసులలో యావజ్జీవ కారాగార శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. దిశ చట్టం వచ్చేలోపు అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి సీఐ, ఎస్‌ఐలకు పది కేసులు చొప్పున దర్యాప్తు పూర్తిచేసేలా బాధ్యతలు అప్పగించామన్నారు. అదే విధంగా రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉందన్నారు. ఇప్పటికే 61 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. సచివాలయాల మహిళా పోలీసులు స్థానికంగా వారి వారి పరిధిలో మహిళల సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు వంటి వాటిని గుర్తించి పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటిని పరిష్కరించడంతో కేసులు తగ్గుతున్నాయన్నారు. 2023 లో నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 7183 కేసులు పరిష్కారం పొందడంతో కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాదంలో అత్యధిక శాతం మరణాలు బైక్‌లు నడిపేవారు హెల్మెట్లు ధరించకపోవడం వల్లనే జరుగుతున్నాయని చెప్పారు. 80 శాతం మంది హెల్మెట్లు ధరించకపోవడంతోనే మృతిచెందుతున్నారని అందువల్ల తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రాజమహేంద్రవరంలో నిర్మించిన పోలీస్ కల్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అలాగే స్పోర్ట్సు కాంప్లెక్స్‌లో ఉన్న వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ క్లే, ,సింథటిక్ కోర్టులను, క్రికెట్ నెట్స్‌లను సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవాలని, కోచ్‌లను నియమించి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాలలో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జిల్లా అడిషనల్ ఎస్పీలు ఎం.రజనీ, సీహెచ్ పాపారావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.