Share News

కరోనా కంగారు

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:57 AM

మళ్లీ కరోనా వచ్చేసింది.. ప్రజలు భయపడినట్టుగానే జిల్లాలో రాజమహేంద్రవరంలో తొలికేసు నమో దైంది.

కరోనా కంగారు

84 ఏళ్ల వృద్ధురాలికి కొవిడ్‌ పాజిటివ్‌

నిర్ధారించిన వైద్యఆరోగ్యశాఖ .. హోం ఐసోలేషన్‌లో చికిత్స

కొవిడ్‌ సమాచారంపై స్పందించని జీజీహెచ్‌ వైద్యులు

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 22 : మళ్లీ కరోనా వచ్చేసింది.. ప్రజలు భయపడినట్టుగానే జిల్లాలో రాజమహేంద్రవరంలో తొలికేసు నమో దైంది. దీంతో నగర ప్రజానీకం కంగారుపడిపోతున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన 84 ఏళ్ల వృద్ధురాలికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. రెండు రోజుల క్రితం అనుమానిత లక్షణాలు కనిపించడంతో కంబాలపేట యూహెచ్‌సీలో శాంపిల్స్‌ తీసుకుని, ఆ శాంపిల్‌ను ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ కోసం కాకినాడ ల్యాబ్‌కు పంపించారు. దీంతో పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల అభ్యర్థనమేరకు వృద్ధురాలిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ముందుజాగ్రత్తగా కుటుంబ సభ్యులకు కొవిడ్‌ టెస్టులు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే పాజిటివ్‌ వచ్చిన వృద్ధురాలికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నించినా జీజీహెచ్‌ అధికారులు అందుకు నిరాకరించినట్టు సమాచారం. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన జీజీహెచ్‌ వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలకు ఎలాంటి హెల్త్‌ బులెటిన్స్‌ ఇవ్వడంలేదు. సమాచారం కోసం మీడియా పదే పదే ఫోన్లు చేసినా కనీసం స్పందించడంలేదు. తూతూ మంత్రంగా కొన్ని బెడ్స్‌ సిద్ధం చేయడం మినహా కొవిడ్‌ సోకకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఆసుపత్రి వద్ద ఇప్పటి వరకూ కనీస హెచ్చరికలు లేకపోవడం గమనార్హం. ఆసుపత్రికి వచ్చే రోగులు చాలా మంది మాస్కులు ధరించడంలేదు. వార్డుల్లో ఇన్‌పేషెంట్లకు సహాయకులు మాస్కులు పెట్టుకోవడంలేదు. జీజీహెచ్‌ అధికారుల నిర్లిప్తత కారణంగా ఆసుపత్రిలో విధులు నిర్వహించే ఉద్యోగులు, పారామెడికల్‌ సిబ్బంది చాలా మంది మాస్కులు వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదు. శానిటైజర్లు వాడకం ఊసేలేదు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమహేంద్రవరంలోనే కొవిడ్‌ పాజిటివ్‌ కేసు ఒకటి వెలుగుచూసినా జీజీహెచ్‌ వైద్యాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌1

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి

డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌ 1 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం జేఎన్‌ 1 కేసులకు సంబంధించి వై ద్యాధికారులు, వైద్య సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ కేసులకు సంబంధించి అనుమానాలుంటే వారి నుంచి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలు చేయడం జరుగుతున్నదని తెలిపారు. జేఎన్‌ 1 సోకిన వారిలో ముఖ్యంగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, వాంతులు, డయేరియా, ఛాతిలో నొప్పి, వణుకు, వాసన గుర్తించలేకపోవడం, ఒళ్లు నొప్పులు అధికంగా కనిపిస్తాయని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికి ప్రజలు బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు రాజమహేంద్రవరం జీజీహెచ్‌, జీఎస్‌ఎల్‌ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లోనూ అనుమానితులకు కొవిడ్‌ పరీక్షలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

Updated Date - Dec 23 , 2023 | 12:57 AM