Share News

ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దుచేయాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:39 PM

అధికారుల ముసుగులో రాజకీయ జోక్యాన్ని ప్రేరేపించే నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కొవ్వూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు బొబ్బా భారతి డిమాండ్‌ చేశారు. సోమవారం కొవ్వూరు లాంచీలరేవు ఏజీఆర్‌బీ కార్యాలయం ఎదుట కొవ్వూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రజా, రైతు వ్యతిరేక ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం-2022ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు.

ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దుచేయాలి
కొవ్వూరు రిలే దీక్షలో పాల్గొన్న బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు

  • కొవ్వూరు, నిడదవోలులో న్యాయవాదుల రిలే దీక్షలు

కొవ్వూరు, డిసెంబరు 18: అధికారుల ముసుగులో రాజకీయ జోక్యాన్ని ప్రేరేపించే నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కొవ్వూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు బొబ్బా భారతి డిమాండ్‌ చేశారు. సోమవారం కొవ్వూరు లాంచీలరేవు ఏజీఆర్‌బీ కార్యాలయం ఎదుట కొవ్వూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రజా, రైతు వ్యతిరేక ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం-2022ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. భారతి మాట్లాడుతూ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందని, కొత్తగా చేసిన సర్వేల ఆధారంగా అధికారుల చేతుల్లో ఉండేటట్టు టైటిల్‌ రిజిష్టర్‌, డిస్‌ప్యూట్‌ రిజిష్టర్‌ ఏర్పాటు చేస్తామని వాటిలో ఉండేదే భూమికి సంభందించిన హక్కు అని అంటున్నారని, వాటిలో వివాదాలు ఉంటే ట్రిబ్యూనల్స్‌లో మాత్రమే పరిష్కరించుకోవాలని, రిజిష్టర్‌లో నమోదు చేసిన రెండేళ్లలో మాత్రమే వివాదానికి వెళ్లాలని, ట్రిబ్యూనల్‌లో పరిష్కారం కాని సమస్యలను హైకోర్టులో పరిష్కరించుకోవాలని కిందిస్థాయి సివిల్‌ కోర్టులు నిర్ధారించే హక్కు లేదని చట్టంలో పేర్కొన్నారని, దీనివల్ల వ్యవస్థ అంతా అధికారులు, రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లిపోయి, ప్రజల ఆస్తి కబ్జాలకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోందని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ న్యాయవాది వీవీ సుబ్బారావు మాట్లాడుతూ భూమి ఉన్న రైతులకు టైటిల్‌, మొత్తం భూ హక్కులు తహశీల్దార్‌ కార్యాలయంలో మాత్రమే నిర్ధారించడం, భూ వివాదాలు తలెత్తితే దానిలో రెవెన్యూ అధికారులకే అప్పిలేట్‌ అథారిటీ ఇస్తూ ట్రిబ్యూనల్‌ ఏర్పాటుచేసుకునే అవకాశం ఇవ్వడం, సివిల్‌ కోర్టుకు పరిధి లేకుండా చేయడం అత్యంత దారుణమన్నారు. ప్రజా, రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తక్కెళ్ల చిట్టిబాబు, వై.ప్రకాశరావు, ఏలూరి గోపాలకృష్ణ, పిల్లలమర్రి మురళీకృష్ణ, కోడూరి రాఘవులు, నర్శింహరావు, బందెల సువర్ణరాజు, మెరిపో గోపి, రాజాన శ్రీనివాస్‌, కె.సన్యాసిరావు, యాగంటి చలపతి, ముంగమూరి నాగమణి, పి.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:39 PM