బైక్‌ల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2023-02-21T00:30:43+05:30 IST

ఒకే ఒక్కడు. బైక్‌ కనిపించిందంటే చాలు. మూడో కంటికి కనబడకుండా మాయం చేసేస్తాడు. ఒకవేళ పోలీసులకు చిక్కినా జైలు కెళ్లి అక్కడ ఆరితేరిన దొంగల వద్ద మరిన్ని మెలకువలు తెలుసుకుని బెయిల్‌ పై బయటకు వచ్చి యథేచ్ఛగా బైక్‌ దొంగతనాలకు పాల్పడుతుంటాడు.

బైక్‌ల దొంగ అరెస్టు

కాకినాడ క్రైం: ఫిబ్రవరి20: ఒకే ఒక్కడు. బైక్‌ కనిపించిందంటే చాలు. మూడో కంటికి కనబడకుండా మాయం చేసేస్తాడు. ఒకవేళ పోలీసులకు చిక్కినా జైలు కెళ్లి అక్కడ ఆరితేరిన దొంగల వద్ద మరిన్ని మెలకువలు తెలుసుకుని బెయిల్‌ పై బయటకు వచ్చి యథేచ్ఛగా బైక్‌ దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఆ పాత నేరస్తుడిని కాకినాడ క్రైం పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన 28 మోటరు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్మిన్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌ వివరాలను వెల్లడించారు. ఇటీవల చోరీలు ఎక్కువగా జరుగుతుండడంతో ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు ఆదేశానుసారం అడ్మిన్‌ ఎస్పీ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో క్రైం డీఎస్పీ శీలబోయిన రాంబాబు ఆధ్వర్యంలో క్రైం సిబ్బంది నిఘాను పటిష్టం చేశారు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న సిబ్బందికి కాకినాడ మసీద్‌ సెంటర్‌ సమీపంలోని భీమాస్‌ హోటల్‌ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తోన్న ఓ వ్యక్తి తారసపడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, వాడపల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల కోరాడ వెంకటేశులుగా గుర్తించారు. అతను గతంలో కడియం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బైక్‌ తస్కరిస్తూ దొరికిపొయి సంవత్సరం పాటు జైలు జీవితం అనుభవించాడు. అనంతరం 5 నెలల క్రితం జైలు నుంచి విడుదలై తిరిగి కాకినాడ, మండపేట, కడియం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, పెదపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బైక్‌లను దొంగిలించినట్లు ఏఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. నిందితుడి నుంచి గతంలో 45 బైక్‌లను స్వాధీన పరుచుకోగా, ఇప్పుడు 28 బైక్‌లను స్వాఽధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని చోరీసొత్తును స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన డీఎస్పీ రాంబాబు, ఎస్‌ఐలు టి. క్రాంతికుమార్‌, పీవీఆర్‌ మూర్తి, ఏఎస్‌ఐ కొప్పిశెట్టి గోవిందరావు, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాసరావు, క్రైం సిబ్బందిని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:30:44+05:30 IST