భారత్ గౌరవ్ రైలొచ్చింది..
ABN , First Publish Date - 2023-03-19T01:28:42+05:30 IST
’భారత్ గౌరవ్’ పేరుతో అధునాతన సదుపాయాలు కలిగిన బోగీలతో శనివారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన మొట్టమొదటి యాత్రికుల రైలు అదే రోజు రాత్రి 9.30 ప్రాంతంలో రాజమహేంద్రవరం చేరుకొంది.

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), మార్చి 17: ’భారత్ గౌరవ్’ పేరుతో అధునాతన సదుపాయాలు కలిగిన బోగీలతో శనివారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన మొట్టమొదటి యాత్రికుల రైలు అదే రోజు రాత్రి 9.30 ప్రాంతంలో రాజమహేంద్రవరం చేరుకొంది. రైలు బోగీలపై భారతదేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటే పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. 7 స్లీపర్, 3 థర్డ్ ఏసీ, ఒక సెకండ్ ఏసీ బోగీలు ఉండగా.. రూ.13 వేల నుంచి రూ.40 వేల వరకూ చార్జీలు ఉన్నాయి. బోగీలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. యాత్రికులు తమ 8 రోజుల ప్రయాణంలో పూరీ, కోణార్క్, గయ, వారాణసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ సందర్శించనున్నారు. ఆహారం, వసతి, రవాణా అన్నీ ఐఆర్‌సీటీసీ చూసుకుంటుంది. మొదటి యాత్రికుల రైలును ప్రయాణికులు బాగానే ఆదరించారు. 700 టికెట్లను అందుబాటులో ఉంచగా అన్నీ నిండిపోయాయి. రాజమహేంద్రవరం నుంచి 25 మంది రైలెక్కారు. భోజనం విషయంలో సంతృప్తి వ్యక్తం చేసిన ప్రయాణికులు.. క్యాటరింగ్, క్లీనింగ్, సెక్యూరిటీ వాళ్లు హిందీ మాత్రమే మాట్లాతున్నారని.. తెలుగు మాట్లాడే వారిని అందుబాటులో ఉంచితే భాషాపరమైన ఇబ్బంది రాదన్నారు. రైలు వద్దకు ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఎంఎస్ చౌహాన్, ఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్టర్ సైదయ్య తమ సిబ్బందితో రైలు వద్దకు చేరుకొని ప్రయాణికులతో మాట్లాడి పలు భద్రతాపరమైన సూచనలు చేశారు.