ఆక్వా జోన్‌లోకి 229.09 ఎకరాలు
ABN , First Publish Date - 2023-03-05T01:08:54+05:30 IST
జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం పెంపొందించే దిశలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎల్‌ఎస్‌లో రెండో ఫేజ్‌లో 106 మంది రైతులకు చెందిన 229.09 ఎకరాలు ఆక్వా జోన్‌లోకి మార్పు చేసినట్టు కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు.
బొమ్మూరు, మార్చి 4: జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం పెంపొందించే దిశలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎల్‌ఎస్‌లో రెండో ఫేజ్‌లో 106 మంది రైతులకు చెందిన 229.09 ఎకరాలు ఆక్వా జోన్‌లోకి మార్పు చేసినట్టు కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో శనివారం సాయంత్రం మత్స్య అధికారి కృష్ణారావు, ఇతర అధికారులతో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. మత్స్య రంగానికి ప్రోత్సాహం అందించి మార్కెటింగ్ ప్రోత్సహిస్తే ఆక్వాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. 9 మండలాల్లో 29 గ్రామాల్లో 1197.02 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 967.93 ఎకరాలను నాన్ ఆక్వాజోన్ నుంచి జోన్‌గా మార్చేందుకు కమిటీ ఆమోదం జరిగిందన్నారు. ఇంకా జిల్లాలో 1,529 ఎకరాలు నాన్ ఆక్వా జోన్ కింద ఉన్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో వ్యవసాయాధికారి మాధవరావు, పశుసంవర్థక అధి కారి సత్య గోవింద్ తదితరులు పాల్గొన్నారు.