వైభవంగా రథోత్సవం

ABN , First Publish Date - 2023-02-02T01:13:20+05:30 IST

గోవింద నామస్మరణలతో అంతర్వేది పురవీధుల్లో శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు లక్షలాది మంది భక్త జనం మధ్య కనుల పండువగా సాగింది.

వైభవంగా రథోత్సవం

అంతర్వేది, ఫిబ్రవరి 1: గోవింద నామస్మరణలతో అంతర్వేది పురవీధుల్లో శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు లక్షలాది మంది భక్త జనం మధ్య కనుల పండువగా సాగింది. తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలనుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొని భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తజన సందోహం మధ్య అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి రథయాత్ర జరిగింది. స్వామివారి సోదరి అశ్వరూఢాంబిక (గుర్రాలక్కమ్మ)కు చీర, సారె లాంఛనప్రాయంగా తీసుకువెళ్లారు. రథానికి బ్యాటరీతో కూడిన జాకీ ఏర్పాటు చేయడంతో గుర్రాలక్కమ్మ గుడి మలుపులో సునాయాసంగా రథం ముందుకు కదిలింది. ముందుగా ఆలయ ఫ్యామిలీ ఫౌండర్‌ మెంబర్‌, చైర్మన్‌ మొగల్తూరు రాజా కలిదిండి కుమారరామగోపాల రాజాబహద్దూర్‌ రథానికి తొలిపూజ చేశారు. అనంతరం కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టి రథాన్ని ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, డీసీ విజయరాజు, అమలాపురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం వేద పండితులు శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఉత్సవ మూర్తులను రథంపై కొలువు దీర్చి ఊరేగింపుగా గుర్రాలక్కమ్మ గుడికి తీసుకువచ్చారు. రాజావారి వీధి నుంచి ప్రారంభమైన రథయాత్ర పల్లపు వీధిలోని 16 స్తంభాల మండపానికి చేరుకోవడానికి సుమారు నాలుగు గంటలు పట్టింది. భక్తులు రథానికి అరటి గెలలు, గుమ్మడికాయలు, వరి కంకులు కట్టారు. భీష్మఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జంగమ దేవరులు పూరించిన శంఖాల ధ్వనితో సాగర సంగమ తీర ప్రాంతం మార్మోగింది. కల్యాణోత్సవాల్లో ఉచిత పాసులు ఎక్కువ ఇవ్వడం వల్ల సామాన్య భక్తులకు కొంత భారంగా మారింది. కార్యక్రమంలో డీఎస్పీలు వై.మాధవరెడ్డి, రమణ, ఆలయ సహాయ కమిషనర్‌ వి.సత్యనారాయణ, వనమాలి మూలాస్వామి, వడుగు శ్రీను, తిరుమాని ఆచార్యులు, పోతురాజు శ్రీవెంకటకృష్ణ, కొపనాతి కృష్ణమ్మ కుటుంబీకులు, సీఐ శేఖర్‌బాబు, ఎస్‌ఐలు ఫణిమోమహన్‌, గోపాలకృష్ణ, కృష్ణమాచారి, సర్పంచ్‌లు కొండా జాన్‌బాబు, పోతురాజు నరసింహారావు(కిశోర్‌), ఎంపీటీసీ బైరా నాగరాజు పాల్గొన్నారు.

రథోత్సవానికి 57 వసంతాలు పూర్తి:

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవానికి 57 వసంతాలు పూర్తయ్యాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవంలో అధికార యంత్రాంగం అత్యుత్సాహం చూపించి సామాన్య భక్తులకు రథం తాడు లాగి దణ్ణం పెట్టుకునే అవకాశం కల్పించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో రథోత్సవాన్ని తిలకించలేకపోయామని పలువురు భక్తులు వాపోయారు.

అక్షింతల కోసం భక్తులు ఎదురుచూపులు

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం అనంతరం తలంబ్రాలు బియ్యం కోసం భక్తులు బారులు తీరారు. క్యూలైన్‌లో స్వామివారి దర్శనంకోసం వెళుతున్న భక్తులకు దర్శనం అనంతరం అక్షింతలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే అక్షింతలు కల్యాణ ఘడియల సమయంలో పంపిణీ చేస్తారని, కల్యాణం అనంతరం భక్తులు మండపం ప్రదేశానికి దూసుకొచ్చారు. దీంతో భక్తులకు మైక్‌ ద్వారా ప్రచారం అధికారులు ఉదయం సుప్రభాత సేవతో మొదలయ్యే దర్శన క్యూలైన్లలో కల్యాణోత్సవ అనంతర తలంబ్రాల అక్షింతలు పంపిణీచేశారు.

Updated Date - 2023-02-02T01:13:22+05:30 IST