మొత్తం మీరే చేశారు
ABN , First Publish Date - 2023-03-31T00:03:49+05:30 IST
గత ఏడాది మే నెలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పును నిరసిస్తూ అమలాపురం కేంద్రంగా జరిగిన అల్లర్లు, విధ్వంసం, హింసాత్మక ఘటనల్లో కేసులు అమాయకులపైనే బనాయించారంటూ పోలీసు యంత్రాంగంపై ఇప్పుడు నిందలు మోపుతున్నారు.
అల్లర్ల ఘటనలో అమాయకులపైనే కేసులన్న నేతలు
సీఎం జగన్ సమక్షంలోనే పోలీసులపై విమర్శలు
తలలు పట్టుకుంటున్న పోలీసులు
నాడు జాబితాలిచ్చారు.. నేడు అమాయకులంటున్నారు
సోషల్ మీడియాలో బాధితుల ఆవేదన
జీవో వస్తే ప్రతిఘటిస్తాం : దళిత న్యాయవాదులు
ఇప్పటికే ఆందోళన చేస్తున్న దళిత సంఘాలు
అందరూ అమాయకులైతే.. అసలు దోషులెవరు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి): గత ఏడాది మే నెలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పును నిరసిస్తూ అమలాపురం కేంద్రంగా జరిగిన అల్లర్లు, విధ్వంసం, హింసాత్మక ఘటనల్లో కేసులు అమాయకులపైనే బనాయించారంటూ పోలీసు యంత్రాంగంపై ఇప్పుడు నిందలు మోపుతున్నారు. అధికార వైసీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల నుంచి ఆ పార్టీలోని ప్రధాన సామాజికవర్గాల నాయకులు వరకు అందరూ ఇప్పుడు పోలీసుల వైపే వేలు చూపుతున్నారు. అంతా వారే చేశారంటూ పోలీసుల వైఖరిని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముందే ప్రస్తావించడంతో ఇప్పుడు పోలీసు యంత్రాంగం తలలు పట్టుకుంటుంది. గత ఏడాది మే 24న జరిగిన అల్లర్లు, విధ్వంసం, హింసాత్మక ఘటనలతో పాటు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ల గృహ దహనాలకు సంబంధించి అప్పట్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీసు యంత్రాంగం ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఈ కేసుల్లో 250 మందిని అరెస్టు కూడా చేశారు. అయితే అప్పట్లో అసలైన నిందితులను పోలీసులే పక్కకు తప్పించి అమాయకులను అరెస్టు చేశారంటూ ఇప్పుడు అధికార పక్షానికి చెందిన వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా ఆ ఘటనల సమయంలో టీడీపీ, జనసేనతో పాటు వైసీపీకి వ్యతిరేకంగా ఉండే అనేక సామాజికవర్గాలకు చెందిన దూకుడుగా ఉండే యువకులపై పక్కా వ్యూహంతో వైసీపీ నాయకులు గ్రామాల వారీగా ఇచ్చిన జాబితాల ఆధారంగా కేసులు పెట్టారు. పోలీసులు వారు అల్లర్లలో పాల్గొన్నారా లేదా అనేది నిర్ధారించకుండానే నిందితులను అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ పేరిట అప్పట్లో చిత్రహింసలు పెట్టారు. ఏ రోజున ఎవరిని అదుపులోకి తీసుకున్నారనేది పోలీసులు జాబితా తయారుచేసి వైసీపీ కీలక నేతలు, వారి అనుచర గణాల ముందు అప్పట్లో పెట్టడం తీవ్ర దుమారానికి కారణమైంది. పోలీసు యంత్రాంగంలో పనిచేసే కొందరు బృందాలుగా ఏర్పడి అమాయకులు, కొంచెం ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మీరు కేసుల్లో ఉన్నారంటూ తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టడం ద్వారా ఆర్థికపరమైన ఎన్నో ప్రయోజనాలు పొందారని నాటి కేసుల్లో ఉన్న బాధితులు ఇప్పటికీ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తూనే ఉంటున్నారు.
ప్లేటు ఫిరాయించారు
అయితే ఇప్పుడు సడన్‌గా రాజకీయ దురుద్దేశంతో కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలు ప్లేటు ఫిరాయించారు. అమాయకులపై కేసులు నమోదుచేసిన తీరును ఈ నెల 28న తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో నేతలు దుయ్యబట్టారు. మరి ఆనాడు కేసుల తీరుపై ఎందుకు ఎవరూ అభ్యంతరం పెట్టలేదంటూ ఇప్పుడు చాలా మంది విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. అమాయకులపై కేసులు పెట్టి అసలైన నిందితులను పక్కన పెట్టారంటూ సాక్షాత్తూ అమాత్యులు, ప్రజాప్రతినిధులు సీఎం ముందు ఏకరువు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆనాటి సీఎం భేటీకి కాపు సామాజికవర్గం, ఇటు శెట్టిబలిజ సామాజిక వర్గంలో ఉన్న వైసీపీ నేతలనే తీసుకువెళ్లడంతో కేసుల్లో ఉన్న మిగిలిన సామాజికవర్గాల నేతలను ఎందుకు పిలవలేదంటూ బాధిత కుటుంబాల నుంచి విమర్శనాస్ర్తాలు ఎక్కుపెడుతున్నారు. పరోక్షంగా కేసులు పెట్టడంలో పాత్ర వహించిన వైసీపీ నేతలు కొందరుంటే నాటి ఘటనలో బాధితులను కనీసం పరామర్శించినవారు మరికొందరున్నారనేది వారి ఆవేదన. అటువంటి వ్యక్తులతో ఎత్తివేసే లక్ష్యంతో సీఎం సమీక్ష నిర్వహించడం రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న రాజకీయ ఎత్తుగడ అంటూ విపక్షాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేసులు ఎత్తివేసేందుకు జీవో జారీ చేయనున్న ప్రకటన ప్రధానంగా దళిత వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అమలాపురం కేంద్రంగా దళిత నాయకులు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో పాటు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలుస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. కేసుల్లో ఉన్న బాధిత కుటుంబాలు గానీ, బాధితులు గానీ ఇది పొలిటికల్ డ్రామాగా తేల్చేస్తున్నారు. కేసులు ఎత్తివేత చట్టపరంగా సాధ్యమయ్యే పనేనా అంటూ న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా అప్పట్లో నమోదయ్యాయి. హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ సైతం కేసుల ఎత్తివేతను ప్రతిఘటిస్తామని ఇప్పటికే ప్రకటన చేశారు. దళిత వర్గంలోని న్యాయవాదులు జీవో విడుదలైతే హైకోర్టులో సవాల్ చేస్తామంటూ హెచ్చరించారు. జగన్ రాజకీయ కుట్ర, కుతంత్రంలో దళిత వర్గాలను పావులుగా వాడుకుంటున్నారని, అయితే వచ్చే ఎన్నికల్లో తాము వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మొత్తం మీద జిల్లా పేరుమార్పు వ్యవహారంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో అమాయకులైన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసుల అత్యుత్సాహమే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠతను దిగజార్చి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసే కోనసీమ జిల్లా అభ్యర్థులకు ప్రాణ సంకటంగా మారింది.