CID : బెయిల్‌ రాకూడదనే.. సీఐడీ వ్యూహం

ABN, Publish Date - Dec 24 , 2023 | 03:39 AM

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌తో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌(ఐఆర్‌ఆర్‌) అలైన్మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, అవినీతి చోటు

కేసుతో సంబంధం లేని వివరాలిచ్చారు

ఇంటర్వ్యూలను పరిశీలిస్తే కేసు గురించి నారా లోకేశ్‌ మాట్లాడినట్లు ఎక్కడా లేదు

ఐఆర్‌ఆర్‌ అలైన్మెంట్‌ కేసులో లిఖిత పూర్వక అభ్యంతరాలు దాఖలు చేసిన చంద్రబాబు

ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌

అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌తో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌(ఐఆర్‌ఆర్‌) అలైన్మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకుందని ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పలు దఫాలు విచారణ జరిగిన ఈ కేసులో తాజాగా హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. శనివారం వ్యాజ్యం విచారణకు రాగా చంద్రబాబు తరఫు న్యాయవాది గోళ్ల బసవేశ్వరరావు స్పందిస్తూ.. ఐఆర్‌ఆర్‌ కేసులో 14వ నిందితుడిగా ఉన్న నారా లోకేశ్‌ దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారని సీఐడీ దాఖలు చేసిన మెమోపై తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించామన్నారు. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగియడంతో పాటు పిటిషనర్‌, సీఐడీ తమ వాదనలు రాతపూర్వకంగా సమర్పించడంతో న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ ఈ కేసు నమోదుచేసింది. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన విచారణలో ఇరు పక్షాల వాదనలు ముగియడంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు న్యాయస్థానం కేసును వాయిదా వేసింది. శుక్రవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. లిఖిత పూర్వక వాదనలతో పాటు కేసులో ఏ14(లోకేశ్‌)గా ఉన్న వ్యక్తి దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారని సీఐడీ తెలిపింది. సంబంధిత పత్రికా కథనాలను జత చేస్తూ వేర్వేరుగా రెండు మెమోలు దాఖలు చేశామని కోర్టుకు నివేదించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కి సంబంధం లేని వివరాలను కోర్టు ముందు ఉంచారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించాలని న్యాయస్థానం వ్యాజ్యాన్ని శనివారానికి వాయిదా వేసిన విషయం తెలిపిందే.

చంద్రబాబు అభ్యంతరాలు ఇవీ

‘‘సీఐడీ మెమోకు జత చేసిన పత్రికా కథనాలు, వీడియోలను పరిశీలిస్తే లోకేశ్‌ ప్రస్తుత కేసు గురించి ప్రస్తావించినట్లు ఎక్కడా లేదు. కేసు దర్యాప్తులో నేను జోక్యం చేసుకున్నట్లు కానీ, కేసుకి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్లు కానీ సీఐడీ చెప్పడం లేదు. ప్రస్తుత పిటిషన్‌లో ఎలాంటి ఉపశమనం కోరని లోకేశ్‌ మీద మాత్రమే సీఐడీ ఆరోపణలు చేస్తోంది. నేను ప్రభావితం చేయగల వ్యక్తి అని యధాలాపంగా పేర్కొన్నారు తప్ప, ఎలా దుర్వినియోగం చేస్తున్నానో చెప్పలేదు. టీవీ చానళ్లు, పత్రికల్లో లోకేశ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలను పరిశీలిస్తే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రస్తుత కేసు గురించి ఎలాంటి చర్చ జరగలేదు. తనపై కోర్టుకు చెడు అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో కేసుకి సంబంధంలేని వివరాలను సీఐడీ కోర్టుకు సమర్పించింది. ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల విషయంలో లోకేశ్‌ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. బెయిల్‌ రాకుండా చేసేందుకు సీఐడీ ఈ వ్యవహారంలో నన్ను లాగుతోంది. కేసుకి సంబంధంలేని వివరాలతో సీఐడీ మెమో దాఖలు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు. మెమోను తిరస్కరించండి’’ అని చంద్రబాబు కోర్టును అభ్యర్థించారు.

Updated at - Dec 24 , 2023 | 03:39 AM