Share News

వైసీపీ నేత.. ‘గుట్ట’ మేత

ABN , First Publish Date - 2023-12-06T00:50:40+05:30 IST

అది పశువుల మేతకు ఉపయోగపడే గుట్ట. దానినీ మేసేస్తున్నాడో వైసీపీ నేత. గుట్టను చదును చేయించి మామిడి మొక్కలు నాటించాడు. ఉలవలు చల్లించాడు. దీనిపై తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

వైసీపీ నేత.. ‘గుట్ట’ మేత
గుట్టను చదును చేసి నాటిన మామిడి మొక్కలు

ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థుల విమర్శ

పెనుమూరు, డిసెంబరు 5: అది పశువుల మేతకు ఉపయోగపడే గుట్ట. దానినీ మేసేస్తున్నాడో వైసీపీ నేత. గుట్టను చదును చేయించి మామిడి మొక్కలు నాటించాడు. ఉలవలు చల్లించాడు. దీనిపై తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పెనుమూరు మండలం శాతంబాకం పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో సర్వే నంబరు 36-1 గయ్యాలుగా రికార్డుల్లో ఉంది. ఈ గ్రామ పూర్వీకుల నుంచీ పశువులను మేతకు గుట్టపైకి తోలేవాళ్లు. అంటే పశువుల మేతకు ఈ గుట్ట ఉపయోగపడేది. అలాంటి గుట్టను తమ గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు రాత్రిళ్లు ఎక్స్‌కవేటర్లతో చదునుచేసి ఆక్రమించేస్తున్నాడని గ్రామస్థులు మంగళవారం మీడియాకు తెలిపారు. చదును చేసిన స్థలంలో మామిడి మొక్కలు నాటి.. ఉలవలు పైరు చేసుకుంటున్నాడని ఆరోపించారు. ఈ గుట్ట కబ్జాపై గతంలో అధికారులకు.. కలెక్టర్‌కు స్పందనలోను వినతిపత్రాలు ఇచ్చామన్నారు. అప్పటి తహసీల్దారు సురే్‌షబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి ఇక్కడ ఎవరూ ప్రవేశించరాదని బోర్డు కూడా పెట్టారు. అయితే ఆ బోర్డును తొలగించి ఇప్పుడు మామిడి చెట్లు నాటారని ఇదెక్కడి న్యాయమని వారు ప్రశ్నించారు. ఈ గుట్ట చుట్టూ చదును చేశారని దీనిపై అధికారులు స్పంధించాలని వారు మీడియా ద్వారా కోరారు. ఈ గుట్టలోని ఎర్రమట్టిని కూడా రాత్రిపూట తరలిస్తున్నారని సుమారు 7 ఎకరాల భూమిని కబ్జా చేశారని అడిగితే మా ఇష్టం మీరు ఏం చేస్తారో చేయండి అని అంటున్నారని వారు వాపోయారు. గ్రామస్తులు మురళి, విశాలాక్షి, మమత, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూముల జోలికొస్తే సహించం

శాతంబాకం పంచాయతీలో రీ సర్వే పూర్తయ్యింది. అందులో గుట్ట పోరంబోకు, ప్రభుత్వ, గయాలు భూముల జోలికి ఎవరు వెళ్లినా ఊరుకోం. ఆ గుట్టను పరిశీలించి మొక్కలు నాటి ఉంటే వాటిని తొటగించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రాత్రి పూట, సెలవు దినాల్లో ఇలా ప్రభుత్వ భూముల జోలికి వెళ్లేవారిని ఉపేక్షించం.

- కళావతి, తహసీల్దారు పెనుమూరు

Updated Date - 2023-12-06T00:50:41+05:30 IST