Share News

రాయలసీమ అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు

ABN , First Publish Date - 2023-12-11T01:16:22+05:30 IST

రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌ మండిపడ్డారు.

రాయలసీమ అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు
ఐక్యతను చాటుతున్న వివిధ పార్టీలు, సంఘాల నాయకులు

‘సీమ’ సమగ్రాభివృద్ధికి ఐక్యంగా పోరాడదాం

‘జన చైతన్య వేదిక’ చర్చా గోష్ఠిలో వక్తలు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 10: రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌ మండిపడ్డారు. సీమ సమగ్రాభివృద్ధి కోసం ఐక్యంగా పోరాడదామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఏపీ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధి - సమస్యలపై తిరుపతి యశోదనగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ.. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, రాష్ట్రానికి నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కాంగ్రెస్‌ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌. తులసిరెడ్డి మాట్లాడుతూ.. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ అమలు చేయక పోవడం, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పొందలేక పోవడం, హైకోర్టును సాధించలేకపోవడం, నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేక సీమ ప్రాంతం అభివృద్ధి కాలేకపోతోందని చెప్పారు. సభాధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. నీటి పారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్కువ శాతం కేటాయించడం లేదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఓబులేసు మాట్లాడుతూ.. సీమ వెనుకబాటుకు ప్రకృతి వైపరీత్యాలతోపాటు పాలకుల నిర్లక్ష్యం, ప్రజల్లో అనైక్యత కారణాలుగా తెలిపారు. వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టుకు రూ.10 కోట్లు వెచ్చించకపోవడంతో మూడేళ్లుగా పునర్నిర్మాణం జరగలేదన్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ.. సీమలోని నీటి పారుదల ప్రాజెక్టులపై వైసీపీకి, సీఎంకి చిత్తశుద్ధి లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో వెచ్చించిన నిధుల్లో నాల్గవ వంతు కూడా ప్రస్తుత ప్రభుత్వం కేటాయించక పోవడమే దీనికి నిదర్శమన్నారు. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ కక్షపూరిత ధోరణి వల్లే అమరరాజా ఫ్యాక్టరీ తెలంగాణకు తరలిపోయిందన్నారు. ఇకనైనా సీమకు నీళ్లు, నిధులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు, సీఐటీయూ నేత కందారపు మురళి, నాయకులు సాయిలక్ష్మి, జయచంద్ర, రవి, ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చిన్నం పెంచలయ్య, సీపీఐ నేత రాధాకృష్ణ, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, వూకా విజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నేత నవీన్‌ కుమార్‌ రెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి, జనసేన తిరుపతి అధ్యక్షుడు రాజారెడ్డి, డాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి, పలు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T01:16:23+05:30 IST